‘పాయింట్‌’ దోపిడీ..! | Petrol Bunk Owners Cheat People By Reducing Petrol Points | Sakshi
Sakshi News home page

‘పాయింట్‌’ దోపిడీ..!

Published Thu, Aug 8 2019 12:10 PM | Last Updated on Thu, Aug 8 2019 12:10 PM

Petrol Bunk Owners Cheat People By Reducing Petrol Points - Sakshi

పాయింట్లలో తేడా ఉన్న పెట్రోల్‌ బంక్‌

సాక్షి, దేవరకొండ: హడావుడిగా ఆఫీస్‌కు బయల్దేరుతూ దారిలో ఏ బంక్‌ వద్ద అయినా ఓ రూ.100 పెట్రోల్‌ పోయించుకుంటే తెలియకుండానే ఓ పాయింట్‌ ఎగిరిపోతోంది. దీనికి తోడు ఓ రూ.10పైసల నుంచి రూ.20 పైసలు తక్కువ పోసినా తొందరలో ఉన్న కస్టమర్లు గట్టిగా అడగలేరు. ఇది పెట్రోల్‌ బంకుల్లో నిత్యం జరుగుతున్న తంతు. ఇలా రోజు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి.  హైవే వెంట  ఉన్న పెట్రోల్‌ బంకుల్లో ప్రతి నిత్యం పైస పైస పక్కపెడుతూ రూ. లక్షలు  దోచుకుంటున్నారు. బంకుల్లో పెట్రోల్‌ పోయించే సమయంలో పాయింట్లలో గోల్‌మాల్‌ జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కస్టమర్లకు కొందరు రూ.10పైసలు, రూ.20పైసల వరకు తక్కువగా పెట్రోల్‌ పోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

పాయింట్లకు కోత 
పాయింట్లలో కోతతో వినియోగదారులు తెలియకుండానే నష్టపోతున్నారు. పెట్రోల్‌ బంక్‌లో ధరల పట్టికలు ఉంచడం లేదు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.75 ఉంది. కంపెనీని బట్టి ధరల్లో తేడా ఉంటుంది. రోజు ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఇప్పుడున్న ధరకు లీటర్‌పై రూ.10పైసలు, రూ.20పైసలు పెరిగినప్పుడు యూనిట్‌ లెక్కించరు. లీటర్‌కు 10 పాయింట్లుగా లెక్కిస్తారు. కనీసం రూ.35పైసలకు పైగా పెరిగితేనే యూనిట్‌ వస్తుంది. చాలా మంది వాహనదారులు లీటర్‌ చొప్పున కాకుండా రూ.50, రూ.100 ఇలా పెట్రోల్‌ పోయించుకుంటుంటారు. ఇక్కడే అసలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

లీటర్‌ ధర రూ.75 ఉంటే ఒక పాయింట్‌ విలువ 7.5యూనిట్‌ లెక్కన చూయిస్తుంది. అయితే వినియోగదారులు ఎవరూ ఎన్ని పాయింట్లు పోస్తున్నారనేది సరిగా గమనించలేకపోతున్నారు. చాలా మందికి దీనిపై సరైన అవగాహన ఉండదు. దీన్ని అవకాశంగా భావించి కొందరు బంకుల్లో అరపాయింట్‌ తగ్గించి పెట్రోల్‌పోస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అరపాయింట్‌కు రూ.3.50 వినియోగదారుడు నష్టపోతున్నట్లే. ఈ రూ.3 నష్టపోవడంతో పాటు పెట్రోల్‌ బంక్‌ యజమానులకు పెట్రోల్‌ ఆదా అవుతుంది.

ఈ లెక్కన రోజుకు వేల లీటర్లు అరపాయింట్‌ చొప్పున తగ్గించినా వేలలో ఆదాయం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారులు వదిలేస్తున్న సదరు యజమానులకు లక్షలు మిగుల్చుతున్నాయి. ఈ మోసాన్ని వినియోగదారులు కూడా గుర్తించలేకపోతున్నారు. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లు ఉన్నాయి. అప్పుడప్పుడు తని ఖీలు చేస్తున్నా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.

రూ.10పైసలు, రూ.20పైసలు తక్కువగానే 
చాలా మంది బంకుల్లో పని చేసే సిబ్బంది రూ.10 పైసల నుంచి రూ.20పైసల వరకు తక్కువగా పెట్రోల్‌ పోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మనం ఇచ్చే డబ్బులకు పూర్తి స్థాయిలో పెట్రోల్‌ పోయకుండానే చేతిలో ఉన్న క్లచ్‌ను ఆపివేస్తున్నారు. చిన్న మొత్తమైనా పరిశీలిస్తే లక్షల్లో జరుగుతున్న మోసం బయటపడుతుంది. ఇది ప్రతి బంకులో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు పాయింట్ల కోతతో పాటు ఇలా కూడా వినియోగదారుడు మోసపోతున్నాడు. 

బంకులో అన్ని మోసాలే 
మండలంలోని అన్ని పెట్రోల్‌ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. పెట్రోల్‌ బంకులో రూ.వంద పెట్రోల్‌ పోసుకుంటే రూ.99 మాత్రమే పెట్రోల్‌ పోస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారితో గొడవకు దిగుతున్నారు. ప్రతి వాహనదారుడికి ఇదే సమస్య ఉంది. వాహనదారులు పాయింట్‌ దోపిడీకి గురికాక తప్పడం లేదు. అధికారులు ఈ దిశగా తనిఖీలు చేపట్టి పెట్రోల్‌ బంకులపై చర్యలు తీసుకోవాలి.
–బొడ్డు మహేశ్, చింతపల్లి 

అన్నీ అవకతవకలే.. 
పెట్రోల్‌ బంకుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జ రుగుతున్నాయి. సంబంధిత తూనికల కొలతల శాఖ అధికారులు కా కుండా పెట్రోల్‌ కంపెనీలకు సంబంధించిన అధికారులు సక్రమంగా లేకపోవడంతో ఈ అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం పెట్రోల్‌ బంక్‌ యజమానులకు వరంగా మారుతోంది. లీటర్‌ పెట్రోల్‌కు అరపాయింట్‌ వరకు తక్కువగా పోస్తున్నారు. ఇలాగే లీటర్‌ ధరలోనూ తేడాలు జరుగుతున్నాయి. పెట్రోల్‌ బంక్‌ మోసాలపై చర్యలు తీసుకోవాలి. 
–వింజమూరి రవి, సర్పంచ్, వర్కాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement