గప్‌‘చిప్‌’గా దోపిడీ | Huge Fraud At Petrol Pumps | Sakshi
Sakshi News home page

గప్‌‘చిప్‌’గా దోపిడీ

Published Sat, Sep 5 2020 4:31 AM | Last Updated on Sat, Sep 5 2020 4:31 AM

Huge Fraud At Petrol Pumps - Sakshi

చిత్తూరు అర్బన్‌/ఏలూరు టౌన్‌: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని పెట్రోల్‌ బంకుల్లో గుట్టుగా జరుగుతున్న దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. బంకుల్లో పెట్రోల్‌ పరిమాణాన్ని సూచించే డిజిటల్‌ మీటర్‌కు ఓ చిన్నపాటి చిప్‌ను అమర్చడం ద్వారా వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించి శుక్రవారం చిత్తూరు, ఏలూరులో పోలీసులు, తూనికలు–కొలతలశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి మోసాలకు పాల్పడుతున్న పలు బంకులను సీజ్‌ చేశారు. ఏలూరుకు చెందిన బాషా అనే వ్యక్తిని ఈ వ్యవహారాలకు సూత్రధారిగా గుర్తించారు. చిత్తూరులో డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, తూనికలు, కొలతలశాఖ అధికారి సుధాకర్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
పెట్రోలు బంకులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను తీస్తున్న పోలీసులు 

రీడింగ్‌ మీటర్ల వద్ద అమర్చి..
► తెలంగాణలోని పలుచోట్ల పెట్రోలు బంకుల్లో ఆయిల్‌ తక్కువగా వస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపిన అధికారులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన బాషా ఎలక్ట్రానిక్‌ చిప్‌లను తయారుచేసి బంకు నిర్వాహకులకు అమ్మినట్లు గుర్తించారు. సిమ్‌కార్డును పోలి ఉండే ఈ చిప్‌ను బంకుల్లో పెట్రోలు రీడింగ్‌ తెలియచేసే డిజిటల్‌ అనలాగ్‌ వద్ద అమరుస్తారు. దీంతో ప్రతి లీటరుకు 40 ఎంఎల్‌ పెట్రోలు తక్కువగా వినియోగదారులకు అందుతుంది. 

చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ వద్ద బంకులో..
► బాష ఇచ్చిన సమాచారంతో చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ సమీపంలోని ఓ పెట్రోలు బంకును తనిఖీ చేసిన సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ మోహన్‌కుమార్, తూనికల శాఖ అధికారులు ఎలక్ట్రానిక్‌ చిప్‌ ఉండటాన్ని గుర్తించి బంకు మేనేజరు వెంకట్రావు(39)ను అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలు బంకు నిర్వాహకుడు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. ఇతను ఈ ఏడాది ఫిబ్రవరిలో బాష నుంచి రూ.లక్షకు ఎలక్ట్రానిక్‌ చిప్‌ను కొనుగోలుచేసి, 6,457 లీటర్ల పెట్రోలును విక్రయించాడు. ప్రతి లీటరుకు 40 ఎంఎల్‌ తక్కువగా పోయడం ద్వారా రూ.5.51 లక్షలు వినియోగదారుల నుంచి కాజేసినట్లు విచారణలో వెల్లడైంది. 
► పరారీలో ఉన్న శ్రీనివాసులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుమానం వస్తే డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని డీఎస్పీ సూచించారు. 

‘పశ్చిమ’లో 11 బంకులు సీజ్‌...
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలక్ట్రానిక్‌ చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న 11 పెట్రోల్‌ బంకులను అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. ఏలూరు మాదేపల్లి రోడ్డు ప్రేమాలయం సమీపంలోని ఐవోసీ బంకు, సత్రంపాడులోని బీపీసీఎల్, భీమడోలులోని ఎస్‌ఆర్‌ బంకు, ఐవోసీ పెట్రోల్‌ బంకు, విజయరాయిలోని బీపీసీఎల్, భీమవరంలోని ఐవోసీ, నరసాపురంలోని ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంకు, పెరవలిలో ఐవోసీ, కాపవరంలోని హెచ్‌పీ, నల్లజర్లలోని ఐవోసీ, పాలకొల్లులోని పెట్రోల్‌ బంకులను సీజ్‌ చేశారు. పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు రూ.లక్ష నుంచి రూ.1.70 లక్షల వరకు చెల్లించి ఈ చిప్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement