ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌ల్లో ప్లాస్టిక్ బాటిళ్లలో ఇంధనం కొనుగోలు చేసేవారిపై సైబరాబాద్ పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనను తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసులు పెట్రోల్ బంక్‌లపై దృష్టి సారించారు. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ బాటిల్స్ లేదా జెర్రీ కేసెస్‌లో ఇంధనం నింపడంపై నిషేధం ఉన్నా పలు పెట్రోల్ బంక్‌లు వాటిని పాటించకపోవడం వల్ల కొన్ని సార్లు నేరాలకు అవకాశం ఏర్పడుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఇంధనం అవసరం ఉన్న కొనుగోలుదారుడి చిరునామా, గుర్తింపుకార్డు జిరాక్స్ ప్రతులతో పాటు ఫొటోలిస్తేనే విక్రయించాలని, లేని పక్షంలో పెట్రోల్ బంకు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ బాటిళ్లలో కొనుగోలు చేసిన పెట్రోల్ ఉపయోగించి కొందరు వ్యక్తులు హత్యలకు పాల్పడి మృతదేహాలను తగలబెడుతుండగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలో నియమ నిబంధనలు పాటించని కొనుగోలుదారులు, పెట్రోల్‌బంక్ సిబ్బందిపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదుచేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అయితే కొనుగోలుదారుడు తప్పుడు చిరునామా ఇస్తే ఇతర సెక్షన్లలు కూడా నమోదుచేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసుల్లో నెల నుంచి ఆరు నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ‘ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్రోల్ కొనడమనేది చట్టప్రకారం నేరం. దీనిపై పెట్రోల్ పంప్ యజమాన్యం, సిబ్బందికి అవగాహన కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామ’ని సీపీ పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా పెట్రోల్ విక్రయిస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. వాహనదారులు తమ వాహనాల్లోనే పెట్రోల్ పంప్‌కు వచ్చి ఇంధనాన్ని నింపుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఎక్కడైనా ఆగిపోతే పెట్రోల్ బంక్‌లకు బాటిల్స్‌లో కొనుగోలు చేసేందుకు వస్తే గుర్తింపుకార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment