సాక్షి, న్యూఢిల్లీ: చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబి) ఫాస్ట్ ట్యాగ్ల జారీలో రికార్డు క్రియేట్ చేసింది. మూడు మిలియన్ ఫాస్ట్ ట్యాగ్లను జారీ చేశామని సంస్థ సోమవారం ప్రకటించింది. తద్వారా దేశంలో పెద్ద సంఖ్యలో ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన సంస్థగా నిలిచామని ప్రకటించింది. 'డిజిటల్ ఇండియా' లో భాగంగా తాము ఈ మైలురాయిని అధిగమించామని పేటీఎం సీఈవో సతీష్ గుప్తా వెల్లడించారు. దేశంలో డిజిటల్ టోల్ చెల్లింపులకు తమ వంతుగా చేస్తున్న కృషి కొనసాగుతోందని తెలిపారు. మార్చి నాటికి 5 మిలియన్ల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ జారీని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
హైవేలపై టోల్ ప్లాజాల వద్ద చార్జీలు కట్టేందుకు గంటల తరబడి క్యూలు, చిల్లర చికాకులకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణలో ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫాస్ట్ ట్యాగ్ అంటే జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేయడం. ప్రీపెయిడ్ లేదా పొదుపు ఖాతా నుండి నేరుగా లింక్ చేయబడిన పేటీఎం వాలెట్‌నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ చెల్లింపులకు పేటీఎం బ్యాంకు మద్దతునిస్తుంది. దేశవ్యాప్తంగా 110 టోల్ ప్లాజాలలో ఆటోమేటిక్ నగదు రహిత చెల్లింపులను అనుమతిస్తుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 10వేల వ్యాపార కరస్పాండెంట్ల ద్వారా ఫాస్ట్ ట్యాగ్లను విక్రయిస్తోంది. అలాగే నగదు రహిత చెల్లింపు సౌలభ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, వాణిజ్య వాహన యజమానులకు ట్యాగ్‌లను కొనుగోలులో సహాయపడటానికి, పేటీఎం బ్యాంక్ భారతదేశం అంతటా టోల్ ప్లాజాలలో 300 కి పైగా శిబిరాలను ఏర్పాటు చేసింది.
టోల్ గేట్ నుంచి వెళ్లే ప్రతీ వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ ఉండాల్సిందే. లేకపోతే రెండింతలు టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. వేర్వేరు బ్యాంకులు, నేషనల్ హైవే టోల్ ప్లాజాలు, ఆర్‌టీఓలు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్ హబ్స్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల దగ్గర్నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయొచ్చు. అలాగే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పేటీఎం పేమెంట్ బ్యాంక్, అమెజాన్‌లో కూడా ఫాస్ట్‌ట్యాగ్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఈ ట్యాగ్ల కొరత కారణంగా దీనిని జనవరి 15, 2020 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment