
పేటీఎంతో డీపీఐఐటీ ఒప్పందం
ఇన్‌ఫ్రా, నిధుల అవకాశాలపరంగా మద్దతు
తయారీ, ఫిన్‌టెక్ స్టార్టప్‌ల అభివృద్ధికి తోడ్పాటు అందించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పేటీఎంతో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంకుర సంస్థలు కార్యకలాపాలు విస్తరించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు అవసరమైన మెంటార్‌షిప్, మార్కెట్ యాక్సెస్, నిధుల అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపరంగా మద్దతునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.
ఈ చర్యల్లో భాగంగా నియంత్రణ నిబంధనలను పాటించడంపై, పెట్టుబడులను సమకూర్చుకోవడానికి ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు. పేటీఎం విస్తృత మర్చంట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను టెస్ట్ చేసేందుకు, వేలిడేట్ చేసేందుకు, వాటిని మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలు, మార్కెట్ యాక్సెస్‌కి సంబంధించిన మద్దతు లభిస్తుంది. మెంటార్‌షిప్, ఆర్థిక సాయం, అధునాతన టెక్నాలజీ ద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సాధికారత కలి్పంచేందుకు పేటీఎం కట్టుబడి ఉందని సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. పేటీఎం ఫిన్‌టెక్ అనుభవాన్ని, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని, కార్యకలాపాలను విస్తరించడంలో, సవాళ్లను అధిగమించడంలో స్టార్టప్‌లను తోడ్పాటు అందిస్తామని డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు.
హెచ్‌బీఎన్ డెయిరీస్‌కు నో
సెబీ తాజా హెచ్చరిక
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా హెచ్‌బీఎన్ డెయిరీస్‌కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దంటూ పబ్లిక్‌ను హెచ్చరించింది. హెచ్‌బీఎన్ డెయిరీస్ అండ్ అలైడ్ లిమిటెడ్‌కు చెందిన ఎలాంటి ప్రాపర్టీ కొనుగోలు లేదా లావాదేవీలు చేపట్టవద్దంటూ పేర్కొంది. వీటి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా సూచించింది. కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు తప్పుడు సమాచారం(వదంతులు) ప్రచారం చేస్తూ హెచ్‌బీఎన్ ప్రాపర్టీస్ వేలాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని తెలియజేసింది. సెబీ అధికారులుగా చెప్పుకుంటూ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా నిజమైన కొనుగోలుదారులను పక్కదారి పట్టించడంతోపాటు.. సెబీ ఈవేలం విధానానికి అడ్డుతగులుతున్నట్లు వివరించింది. హెచ్‌బీఎన్ ప్రాపరీ్టస్‌లో.. సంస్థ డైరెక్టర్లు, సంబంధిత అనుబంధ, సహచర సంస్థలు తదితరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి హక్కులూ లేవని స్పష్టం చేసింది. వెరసి హెచ్‌బీఎన్ ఆస్తుల విషయంలో సంస్థకు సంబంధించిన ఏ వ్యక్తినీ లేదా ఏ సంస్థనూ చట్ట విరుద్ధంగా అనుమతించబోమని పేర్కొంది.