న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఇప్పటికే సమర్పించిన పత్రాల్లో ధర శ్రేణి, ఏ ఇన్వెస్టరు ఎంత విక్రయించనున్నారు, ఇతర వివరాలను తర్వాత అప్‌డేట్ చేయనున్నట్లు పేర్కొన్నాయి.
మరోవైపు, పేటీఎం ఐపీవో పరిమాణం రూ. 18,300 కోట్లకు పెరిగింది. కంపెనీలో అతి పెద్ద వాటాదారు అయిన ఆలీబాబా గ్రూప్ సంస్థ యాంట్ ఫైనాన్షియల్‌తో పాటు సాఫ్ట్‌బ్యాంక్ తదితర ఇతర ఇన్వెస్టర్లు మరిన్ని వాటాలు విక్రయించాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ద్వారా సుమారు రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎం తొలుత ప్రణాళికలు వేసుకుంది. సుమారు రూ. 8,300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయాలని, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత ఇన్వెస్టర్లు సుమారు రూ. 8,300 కోట్ల షేర్లను విక్రయించాలని భావించింది.
కానీ తాజాగా ప్రస్తుత షేర్‌హోల్డర్లు మరిన్ని వాటాలు విక్రయిస్తుండటంతో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి ఉంచే షేర్ల పరిమాణం మరో రూ. 1,700 కోట్లు పెరిగి రూ. 10,000 కోట్లకు చేరినట్లవుతుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించే వాటాల్లో దాదాపు సగం వాటా యాంట్ ఫైనాన్షియల్‌ది కానుండగా, మిగతాది ఆలీబాబా, ఎలివేషన్ క్యాపిటల్, సాఫ్ట్‌బ్యాంక్, ఇతర షేర్‌హోల్డర్లది ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ముసాయిదా పత్రాలు సమర్పించినప్పుడు వాటాలు విక్రయించే ఇన్వెస్టర్ల జాబితాలో సాఫ్ట్‌బ్యాంక్ పేరు లేదు.
స్విస్ రీఇన్సూరెన్స్‌కి వాటాలు..
పేటీఎం బీమా విభాగం పేటీఎం ఇన్సూర్‌టెక్ (పీఐటీ)లో స్విట్జర్లాండ్‌కి చెందిన రీఇన్సూరెన్స్ వ్యాపార దిగ్గజం స్విస్ రీఇన్సూరెన్స్ 23 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 920 కోట్లుగా ఉండనుంది. దీని కింద ముందస్తుగా రూ. 397 కోట్లు, మిగతాది విడతలవారీగా స్విస్ రీఇన్సూరెన్స్ చెల్లించనుంది. దేశీ బీమా మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్విస్ రీఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని ఈ సందర్భంగా పేటీఎం చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఆయన వ్యక్తిగతంగా కూడా పీఐటీలో పెట్టుబడి పెట్టనున్నారు. అయితే, శర్మ ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయనున్నదీ వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment