Alibaba
-
‘ఇదే మంచి సమయం’.. జొమాటోలోని వాటా అమ్మనున్న అలిపే
ప్రముఖ చైనా పేమెంట్ దిగ్గజం అలిపే కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఉన్న తన వాటాను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జొమాటోలో అలిపేకి మొత్తం 3.44 శాతం వాటా ఉంది. అందులో 3.4 శాతం వాటాను ఇండియన్ స్టాక్ మార్క్ట్లోని బ్లాక్ డీల్ (5లక్షల షేర్లను ఒక్కొకరికి అమ్మే) పద్దతిలో విక్రయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ మొత్తం విలువ 395 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.3,300 కోట్లు). జొమాటో - అలిపే మధ్య జరిగే ఈ డీల్‌లో సలహా ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ ప్రతినిధుల్ని సలహాదారులుగా నియమించన్నట్లు సమాచారం. అయితే దీనిపై జొమాటో- అలిపేలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాకెట్ వేగంతో జొమాటో 2021 జులై నెలలో ఐపీఓకి వెళ్లింది. ఉక్రెయిన్‌పై రష్యా వార్తో పాటు ఇతర అనిశ్చితి పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లోని టెక్నాలజీ స్టాక్స్ 2022 మే వరకు నష్టాల్లోనే కొనసాగాయి. భారీ లాభాల్ని ఒడిసిపట్టి మే నెల నుంచి తిరిగి పుంజుకోవడంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 90 శాతం మేర జొమాటో షేర్ల విలువ పెరిగింది. దీంతో భారీ లాభాల్ని అర్జించిన అలిపే మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల్ని అమ్మేందుకు ఇదే మంచి సమయం అని తెలిపింది. అన్నట్లుగానే తాజాగా జొమాటోలోని వాటాను అమ్మేందుకు అలిపే చర్చలు జరుపుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన అలిబాబా జాక్‌మా
అలీబాబా గ్రూప్ అంటే వెంటనే గుర్తొచ్చేది జాక్‌మా, ఈకామర్స్ బిజినెస్. కానీ సంస్థ ఛైర్మన్‌గా వైదొలిగిన జాక్‌మా తాజాగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించారని తెలిసింది. ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను విక్రయించే కొత్త సంస్ధను జాక్ మా మొదలుపెట్టారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అలీబాబా ఛైర్మన్‌గా జాక్ మా 2019లో తన పదవి నుంచి వైదొలిగారు. తాజాగా ఎఫ్ఎంసీజీ కంపెనీని స్థాపించినట్లు తెలిసింది. జాక్ మా ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ పేరు హంగ్‌ఝూ మా కిచెన్ ఫుడ్‌గా నిర్ణయించారు. జాక్ మా స్వస్ధలం హంగ్‌ఝూ. అదే పేరును తన కొత్త బిజినెస్‌కు పెట్టారని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఈ కంపెనీ ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడీ మీల్స్, ఎడిబుల్ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తుంది. కరోనా మహమ్మరి అనంతరం ప్యాకేజ్డ్ ఫుడ్‌కు డిమాండ్ పెరగడం, జీవన శైలి మార్పుల కారణంగా జాక్ మా ఫుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక చైనాలో రాబోయే మూడేళ్లలో దేశీ రెడీ మీల్స్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
పాకిస్తాన్లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో
చైనా అపర కుబేరుడు, అలీబాబా వ్యవస్తాపకుడు జాక్‌మా పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంగ్లీష్ మీడియా సంస్థ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. పాక్‌లో జాక్‌మా అడుగు పెట్టినట్లు బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ (boi) మాజీ ఛైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ చెప్పినట్లు పాక్ మీడియా సంస్థ వెల్లడించింది. జాక్‌మా పాక్‌కు రాకముందు జూన్ 27న నేపాల్ రాజధాని ఖాట్మండూ తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలలో పర్యటించారు. ఇలా వరుస పర్యటనలతో మా ప్రపంచ దేశాల్లో చర్చాంశనీయంగా మారారు. నేపాల్, బంగ్లాదేశ్‌లలో పర్యటనలలో ఈ చైనా అపర కుబేరుడితో పాటు మరో ఏడుగురు వ్యాపార వేత్తలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఐదుగురు చైనా పౌరులు, ఒకరు యూరప్ దేశమైన డెన్మార్క్‌కు చెందిన డానిష్ వ్యక్తి, మరొకరు అమెరికా దేశస్తుడు ఉన్నట్లు తెలిపాయి. తాజాగా, స్విర్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే విమానయాన సంస్థ జెట్ ఏవియేషన్ ప్రైవేట్ ఫ్లైట్ వీపీ-సీఎంఏలో పాకిస్తాన్‌కు చేరుకున్నారు. జూన్ 29న లాహోర్‌లో అడుగు పెట్టిన జాక్‌మా 24 గంటల పాటు అక్కడే ఓ ప్రైవేట్ ప్రాంతంలో గడిపారు. అనంతరం, అదే విమానంలో ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లారు. మీడియాలో అనేక ఊహాగానాలు జాక్‌మా,అతని బృందం పాకిస్తాన్లో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు పర్యటించినట్లు అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇందులో భాగంగా బిజినెస్ చేసేందుకు అనువైన ప్రాంతాల గురించి ఆరాతీయడంతో పాటు, ఆ దేశంలో వ్యాపార వేత్తలతో భేటీ, వివిధ వాణిజ్య ఛాంబర్ల అధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, నిర్దిష్ట వ్యాపార ఒప్పందాలు,సమావేశాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. ఆయన వ్యక్తిగతమే జాక్‌మా పర్యటన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని బోవోఐ మాజీ ఛైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ ట్వీట్ చేశారు. మా’ పర్యటన చైనా రాయబార కార్యాలయ అధికారులకు కూడా తెలియదని ట్వీట్లో పేర్కొన్నారు. చైనాపై విమర్శలు చేసి ఈ-కామర్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రముఖ వాణిజ్య వేత్తగా జాక్‌మా సుపరిచితులు. అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో చైనా రెగ్యులేటరీ సిస్టంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో చైనా అధికారులు జాక్‌మాను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆయన కంపెనీలపై చైనా దర్యాప్తు సంస్థలు వరుసగా దాడులు చేశాయి. ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ప్రభుత్వ ఆగ్రహంతో అలీబాబా, యాంట్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 2021 చివర్లో జాక్‌మా చైనాను వీడారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏడాది పాటు బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన చైనా బిలియనీర్ ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ దేశాల్లో అప్పుడప్పుడు కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు వరుస ప్రపంచ దేశాల పర్యటనలతో జాక్‌మా భవిష్యత్‌లో ఏం చేయనున్నారోనని ప్రపంచ దేశాల వ్యాపార వేత్తలు, దేశాది నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి : ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు? -
పేటీఎమ్‌లో అలీబాబా వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్‌లో మిగిలిన ప్రత్యక్ష వాటాను సైతం చైనీస్ కంపెనీ అలీబాబా తాజాగా విక్రయించింది. పేటీఎమ్ బ్రాండుతో సర్వీసులందించే వన్97లో బ్లాక్‌డీల్ ద్వారా 3.16 శాతం వాటాను అమ్మివేసినట్లు తెలుస్తోంది. డీల్ విలువ రూ. 1,360 కోట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో అలీబాబాకు పేటీఎమ్‌లో ప్రత్యక్షంగా ఎలాంటి వాటా మిగల్లేదని తెలియజేశాయి. 2022 డిసెంబర్‌కల్లా 6.26 శాతం ప్రత్యక్ష వాటాను కలిగి ఉన్న అలీబాబా తొలుత ఈ జనవరిలో 3.1 శాతం వాటాను విక్రయించింది. కాగా.. గ్రూప్ సంస్థ యాంట్(ఏఎన్‌టీ) ఫైనాన్షియల్ ద్వారా పేటీఎమ్‌లో 25 శాతం వాటాను అలీబాబా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్‌డీల్ ద్వారా శుక్రవారం(10న) మొత్తం 2.8 కోట్ల పేటీఎమ్ షేర్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. అలీబాబాతోపాటు ఇతరులు సైతం లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రూ. 645–655 ధరలో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. బ్లాక్‌డీల్ నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 8% పతనమై రూ. 651 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 640 వరకూ క్షీణించింది. -
పేటీఎంకు అలీబాబా షాక్: కంపెనీ నుంచి ఔట్
సాక్షి,ముంబై: చైనీస్ ఈ-కామర్స్, రిటైల్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం అలీబాబా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. One97 కమ్యూని కేషన్స్ (పేటీఎం) నుంచి పూర్తిగా నిష్క్రమించింది. బ్లాక్‌డీల్ ద్వారా రెండు కోట్లకు పైగా పేటీఎం షేర్లను విక్రయించింది. ఇండియా ఈకామర్స్ బిజినెస్‌లోకి భారీ పెట్టుబడులతో దూసుకొచ్చిన అలీబాబా (పేటీఎం)లో తన మొత్తం వాటాలను అమ్మేసింది. తాజా నివేదికల ప్రకారం బ్లాక్‌డీల్ ద్వారా శుక్రవారం మొత్తం 3.4 శాతం ఈక్విటీ లేదా 2.1 కోట్ల షేర్లను విక్రయించింది. జొమాటో, బిగ్‌బాస్కెట్ తరువాత తాజాగా అలీబాబా వాటాలను పూర్తిగి సెల్ చేసింది. ఎన్ఎస్ఈలో మొత్తం 4.73 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా చూపించింది. మొత్తం టర్నోవర్ రూ.3,097 కోట్లుగా ఉంది. రెండు వారాల సగటు 8 లక్షల షేర్లకు వ్యతిరేకంగా మొత్తం 19.61 లక్షల పేటీం షేర్లు బీఎస్ఈలో చేతులు మారాయి. ఫలితంగా పేటీఎం షేరు 7.85 శాతం తగ్గి రూ.650.75 వద్ద ముగిసింది. కాగా 2023లో ఇప్పటివరకు స్క్రిప్ 22 శాతం పెరిగింది. పేటీఎంలోని 6.26 శాతం ఈక్విటీ వాటా ఉన్న అలీబాబా జనవరిలో 3.1 శాతం విక్రయించింది. విజయ్ శేఖర్శర్మ నేతృత్వంలోని కంపెనీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.778.5 కోట్ల నష్టంతో పోలిస్తే 50 శాతం తగ్గి, డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ.392 కోట్లకు తగ్గించుకుంది. సాఫ్ట్‌బ్యాంక్ మద్దతున్న పేటీఎం ఆదాయం గత ఏడాది త్రైమాసికంలో రూ.1,456 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లను ఆర్జించింది. -
ఇక చైనా ‘చాట్‌బాట్’.. రేసులో ఆలీబాబా!
చాట్‌జీపీటీ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో మారుమోగుతున్న పేరు. గూగుల్, మైక్రోసాఫ్ట్ తర్వాత చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా కూడా ఈ రేసులోకి వచ్చింది. తాము కూడా చాట్ జీపీటీ తరహా సాధనం తీసుకొస్తున్నామని, ఇప్పటికే దీనిపై తమ ఉద్యోగులు టెస్టింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఆలీబాబా సంస్థ ప్రతినిధి ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు తెలియజేశారు. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించేది స్పష్టం చేయలేదు. ఏఐ చాట్‌బాట్‌పై తమ టెస్టింగ్ వచ్చే మార్చిలో పూర్తవుతుందని మరో చైనీస్ సంస్థ.. సెర్చ్ ఇంజిన్ బైదు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆలీబాబా నుంచి ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు గూగుల్ కూడా ఈ చాట్ జీపీటీకి పోటీగా ‘బార్డ్’ పేరుతో ఏఐ చాట్‌బాట్ సర్వీస్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ చాట్‌బాట్ సర్వీస్‌ను శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఏఐ సంస్థ రూపొందించింది. కోరిన అంశాలపై వ్యాసాలు, పద్యాలు, ప్రోగ్రామింగ్ కోడ్స్‌ను ఇది సెకండ్ల వ్యవధిలో అందిస్తోంది. మరోవైపు దీని ద్వారా విద్యార్థులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రొఫెసర్లు, విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆర్థిక నేరాలు, వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే కూడా వ్యక్తమవుతున్నాయి. (ఇదీ చదవండి: Disney layoffs: 7వేల మందిని తొలగించిన డిస్నీ.. కారణం ఇదే..) -
పేటీఎంలో ఆలీబాబా వాటాల విక్రయం
న్యూఢిల్లీ: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ దాదాపు 3 శాతం వాటాలను విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 1,031 కోట్లు. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ డేటా ప్రకారం ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ 1.92 కోట్ల షేర్లను (సుమారు 2.95 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 536.95 రేటుకి విక్రయించింది. దీనితో వన్97లో ఆలీబాబా మొత్తం వాటాలు 31.14 శాతం నుంచి 28.19 శాతానికి తగ్గాయి. గురువారం పేటీఎం షేర్లు 6 శాతం క్షీణించి రూ. 543.50 వద్ద ముగిశాయి. పేటీఎం రుణ వృద్ధి 4 రెట్లు కాగా, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రుణ వృద్ధి గత నెల నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైంది. డిసెంబర్లో రూ. 3,665 కోట్లు విలువ చేసే 37 లక్షల రుణాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఇది 330 శాతం అధికమని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనితో డిసెంబర్ త్రైమాసికంలో మంజూరు చేసిన మొత్తం రుణాలు 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరినట్లు వివరించింది. క్లిక్స్ క్యాపిటల్, పిరమల్ ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల భాగస్వామ్యంతో పేటీఎం తమ కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. -
జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం
సాక్షి, ముంబై: చైనాకు చెందిన అలీబాబా కంపెనీ అలీపే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో తనకున్న వాటాల నుంచి 3.07 శాతాన్ని (26,28,73,507 షేర్లు) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూపంలోనే ఈ విక్రయం జరిగింది. (జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు, టాప్‌లో ఆ రెండు) కెమాస్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కొనుగోలు చేసిన రూ.608 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన అమ్మకం ద్వారా అలిపే మొత్తం రూ.1,631 కోట్లను ఆర్జించింది.సగటున ఒక్కో షేరు విక్రయం ధరం రూ.62,06గా ఉంది. సెప్టెంబర్ చివరికి జొమాటోలో అలీబాబా గ్రూపునకు 13 శాతం వాటా ఉండగా, విక్రయం తర్వాత కూడా ఇంకా 10 శాతం వాటా మిగిలి ఉంది. సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ టెమాసెక్‌కు చెందిన కెమాస్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ 9.80 కోట్ల జొమాటో షేర్లను కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: CNN layoffs షాకింగ్: ఉద్యోగులకు ముప్పు నేడో, రేపో నోటీసులు! -
2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..
2021 Best And Worst Companies Of The Year: ఎప్పటిలాగే ఈ ఏడాది వ్యాపార రంగంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అదే టైంలో ఘోరమైన పతనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ ట్రేడింగ్‌లో ఊహించని పరిణామాలే ఎదురయ్యాయి.. ఒమిక్రాన్ ప్రభావంతో ఇంకా ఎదురవుతున్నాయి కూడా. చైనా లాంటి అతిపెద్ద(రెండో) ఆర్థిక వ్యవస్థను.. గ్లోబల్ రియల్టి రంగాన్ని కుదిపేసిన ‘ఎవర్‌గ్రాండ్’ డిఫాల్ట్ పరిణామం ఇదే ఏడాదిలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో కంపెనీల పని తీరును, ఇతరత్ర కారణాలను బట్టి జనాల వోటింగ్ ద్వారా బెస్ట్, వరెస్ట్ కంపెనీల లిస్ట్‌ను ప్రకటించింది యాహూ ఫైనాన్స్ వెబ్సైట్. 2021 ఏడాదిగానూ ప్రపంచంలోకెల్లా చెత్త కంపెనీగా నిలిచింది మెటా (ఇంతకు ముందు ఫేస్బుక్). ఒపీనియన్ పోల్‌లో ఎక్కువ మంద పట్టం కట్టడం ద్వారా ‘వరెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచింది. ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా నిలిచింది. అలీబాబా కంటే 50 శాతం అత్యధిక ఓట్లు మెటా దక్కించుకోవడం విశేషం. ఇక ఇలా ప్రతీ ఏడాది బెస్ట్-వరెస్ట్ కంపెనీల జాబితాను యాహూ ఫైనాన్స్ వెబ్సైట్ విడుదల చేయడం సహజం. యాహూ ఫైనాన్స్ హోం పేజీ నుంచి సర్వే మంకీ ద్వారా డిసెంబర్ 4, 5 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించారు. వివాదాలు, విమర్శల నేపథ్యంలో.. మెటా కంపెనీకి వరెస్ట్ కంపెనీ హోదాను కట్ట బెట్టడం విశేషం. ఇక యూజర్ల అభిప్రాయంలో ఎక్కువగా ఫేస్బుక్ మాజీ ఉద్యోగిణి ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణల గురించి కనిపించింది. ఫేస్బుక్ తీరు, ఇన్స్టాగ్రామ్ యువత మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపడం, పిల్లల మీదా చెడు ప్రభావం కారణాలు.. ఫేస్బుక్ Meta గా మారినా కూడా వరెస్ట్ హోదాను కట్టబెట్టాయి. ఇక ఈ సర్వేలో పాల్గొన్న పదిలో ముగ్గురు మాత్రమే ఫేస్బుక్ తన తప్పులు సరిదిద్దుకోగలదన్న అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఇక యాహూ ఫైనాన్స్ లిస్ట్‌లో బెస్ట్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. కిందటి ఏడాదితో పోలిస్తే.. వాటా 53 శాతానికి పెంచుకోవడంతో పాటు 2 ట్రిలియన్ మైలురాయి దాటడం, మైక్రోసాఫ్ట్‌కి కలిసొచ్చాయి. చదవండి: చైనీస్ ఆపరేషన్.. మెటా దర్యాప్తులో సంచలన విషయాలు -
అత్యాచార ఆరోపణలు.. బాధితురాలికి అలీబాబా షాక్
China's Alibaba Sack Woman Employee Over Sexual Assault Allegations: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కామ పిశాచాలపై చర్యలకు ఉపక్రమించకపోగా.. వాళ్లకు అనుగుణంగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తోంది. పైగా ఉద్యోగుల మీదే రివెంజ్ తీర్చుకుంటోంది. ఆమధ్య తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి ఆరోపించగా.. ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఉద్యోగంలోంచి ఆ యువతిని తొలగించింది కంపెనీ. పైగా ఆమె ఆరోపణలు అవాస్తవమంటూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. చైనా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబాను లైంగిక ఆరోపణల పర్వం కుదిపేస్తోంది. ప్రతీ ఏడాది ఆరోపణల కేసులు పెరిగిపోతున్నాయి. గత ఆగష్టులో ఓ ఉద్యోగిణి అత్యాచార ఆరోపణలతో మీడియాకు ఎక్కగా.. ఇప్పుడు ఆ యువతికి షాక్ ఇచ్చింది అలీబాబా. తప్పుడు ప్రచారంతో కంపెనీ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని, అందుకే ఆమెను తొలగిస్తున్నాం అంటూ ప్రకటించింది అలీబాబా. ఇదిలా ఉంటే ఓ బిజినెస్ ట్రిప్ సందర్భంగా మేనేజర్ లెవల్ అధికారి(మిస్టర్ వాంగ్!), ఓ క్లయింట్ బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసింది సదరు యువతి. కానీ, కంపెనీ నుంచి స్పందన రాలేదు. దీంతో తోటి ఉద్యోగుల మద్ధతుతో ఆమె ‘స్క్రీన్ షాట్స్’ ఉద్యమాన్ని నడిపించింది. ఆ టైంలో ఆమెకు అండగా నిలిచిన పది మంది ఉద్యోగుల్ని డిస్మిస్ చేసేసింది అలీబాబా కంపెనీ. ఈ నిర్ణయంపై విమర్శలు వెత్తడంతో తగ్గిన అలీబాబా గ్రూప్.. ఆ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి చేర్చుకుంది. అంతేకాదు బాధితురాలికి తాత్కాలిక ఉపశమనం ఇస్తూ.. నిందితుడిపై వేటు వేసింది. (అదే సమయంలో అతడిపై పెట్టిన క్రిమినల్ కేసును సైతం ఎత్తేయించింది.. క్లయింట్ మీద మాత్రం దర్యాప్తు కొనసాగించింది). ఇక యువతి ఫిర్యాదుపై సకాలంలో స్పందించని మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌ను సస్పెండ్ కూడా చేసింది. లైంగిక ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే.. బాధితురాలిని అర్ధాంతరంగా ఉద్యోగంలోంచి తొలగించింది అలీబాబా గ్రూప్. ఆమెవి కేవలం ఆరోపణలే అని , కంపెనీ పేరు ప్రతిష్టలను బజారుకీడ్చిందంటూ చెబుతూ తాజాగా సదరు ఉద్యోగిణిపై వేటు వేసింది అలీబాబా. మరోవైపు చర్యలు తీసుకున్న అధికారుల్ని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. మొత్తం రెండున్నర లక్షల ఉద్యోగులు పని చేస్తున్న అలీబాబా కంపెనీలో.. కిందటి ఏడాది యాభై మందికిపైగా ఉద్యోగిణులు.. తమ హెడ్లపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం విశేషం. ఈ ఏడాది లైంగిక వేధింపుల ఫిర్యాదులు 75 పైనే వచ్చాయి. ఇంకోవైపు తోటి ఉద్యోగుల నుంచి వేధింపులపై సుమారు 1,500 దాకా ఫిర్యాదు అందినట్లు స్థానిక మీడియా ఒకటి కథనం వెలువరించింది. చైనా ప్రభుత్వానికి భయపడే.. ఇలాంటి ఫిర్యాదులపై చర్యలకు కంపెనీ అధినేత జాక్ మా వెనకంజ వేస్తున్నాడంటూ విమర్శలూ వినిపిస్తున్నాయి. సంబంధిత కథనం: రేప్ విక్టిమ్‌కు అండగా పోస్టులు.. పది మంది అలీబాబా ఎంప్లాయిస్ డిస్మిస్ -
చైనా బరితెగింపు..! వారికి మాత్రం చుక్కలే..!
Tech Giants Fined By China: చైనాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలకు జిన్ పింగ్ ప్రభుత్వం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గుత్తాధిపత్యాన్ని అరికట్టే సాకుతో పలు కంపెనీలపై అక్కడి ప్రభుత్వం బరితెగింపు వ్యవహారాలకు పాల్పడుతోంది. తాజాగా చైనాకు చెందిన కంపెనీలపై భారీ జరిమానాను విధించింది. చైనా టెక్ దిగ్గజం జాక్ మాకు చెందిన ఆలీబాబా, టెన్సెంట్‌హోల్డింగ్స్‌పై భారీ జరిమానాను అక్కడి ప్రభుత్వం వేసింది. వీటితో పాటుగా జేడీ.కామ్, బైడూ వంటి దిగ్గజ కంపెనీలు కూడా జరిమానా విధించిన జాబితాలో ఉన్నాయి. చదవండి: చేసింది చాలు, యాపిల్ కీలక నిర్ణయం..! అందుకే జరిమానా వేసాం..! టెక్ దిగ్గజ కంపెనీలపై భారీ జరిమానాను విధించడాన్ని అక్కడి ప్రభుత్వం సమర్థించుకుంది. ఆయా కంపెనీల గుత్తాధిపత్యాన్ని అరికట్టేందుకే చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఆలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్స్, జేడీ. కామ్ లాంటి ఇతర టెక్ కంపెనీలు 8 ఏళ్ల క్రితం వరకు చేపట్టిన 43 సంస్థల కొనుగోళ్లను గోప్యంగా ఉంచాయని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేటర్ వెల్లడించింది. ఆయా కంపెనీలకు చైనా యాంటీ మోనోపలీ చట్టం క్రింద సుమారు 58 లక్షల వరకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. కొత్తేమీ కాదు..! టెక్ దిగ్గజ కంపెనీలపై చైనా కొరడా ఝుళిపించడం కొత్తేమి కాదు. గత ఏప్రిల్‌లో వివిధ చట్టాల ఉల్లంఘనల పేరిట అలీబాబాకు 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కొన్ని రోజులపాటు జాక్ మా కన్పించకుండా పోయారు. గత ఏడాది కాలంఓ 344 బిలియన్ డాలర్ల భారీ నష్టాని జాక్ మా కంపెనీలు మూటగట్టుకున్నాయి. చదవండి: సుజుకీ అవెనిస్ 125 స్కూటర్ ఆవిష్కరణ -
నవంబర్ 8 నుంచి పేటీఎం ఐపీవో
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఇప్పటికే సమర్పించిన పత్రాల్లో ధర శ్రేణి, ఏ ఇన్వెస్టరు ఎంత విక్రయించనున్నారు, ఇతర వివరాలను తర్వాత అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు, పేటీఎం ఐపీవో పరిమాణం రూ. 18,300 కోట్లకు పెరిగింది. కంపెనీలో అతి పెద్ద వాటాదారు అయిన ఆలీబాబా గ్రూప్ సంస్థ యాంట్ ఫైనాన్షియల్తో పాటు సాఫ్ట్‌బ్యాంక్ తదితర ఇతర ఇన్వెస్టర్లు మరిన్ని వాటాలు విక్రయించాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ద్వారా సుమారు రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎం తొలుత ప్రణాళికలు వేసుకుంది. సుమారు రూ. 8,300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయాలని, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత ఇన్వెస్టర్లు సుమారు రూ. 8,300 కోట్ల షేర్లను విక్రయించాలని భావించింది. కానీ తాజాగా ప్రస్తుత షేర్హోల్డర్లు మరిన్ని వాటాలు విక్రయిస్తుండటంతో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి ఉంచే షేర్ల పరిమాణం మరో రూ. 1,700 కోట్లు పెరిగి రూ. 10,000 కోట్లకు చేరినట్లవుతుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించే వాటాల్లో దాదాపు సగం వాటా యాంట్ ఫైనాన్షియల్‌ది కానుండగా, మిగతాది ఆలీబాబా, ఎలివేషన్ క్యాపిటల్, సాఫ్ట్‌బ్యాంక్, ఇతర షేర్‌హోల్డర్లది ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ముసాయిదా పత్రాలు సమర్పించినప్పుడు వాటాలు విక్రయించే ఇన్వెస్టర్ల జాబితాలో సాఫ్ట్‌బ్యాంక్ పేరు లేదు. స్విస్ రీఇన్సూరెన్స్‌కి వాటాలు.. పేటీఎం బీమా విభాగం పేటీఎం ఇన్సూర్టెక్ (పీఐటీ)లో స్విట్జర్లాండ్‌కి చెందిన రీఇన్సూరెన్స్ వ్యాపార దిగ్గజం స్విస్ రీఇన్సూరెన్స్ 23 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 920 కోట్లుగా ఉండనుంది. దీని కింద ముందస్తుగా రూ. 397 కోట్లు, మిగతాది విడతలవారీగా స్విస్ రీఇన్సూరెన్స్ చెల్లించనుంది. దేశీ బీమా మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్విస్ రీఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని ఈ సందర్భంగా పేటీఎం చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఆయన వ్యక్తిగతంగా కూడా పీఐటీలో పెట్టుబడి పెట్టనున్నారు. అయితే, శర్మ ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయనున్నదీ వెల్లడి కాలేదు. -
ఏడాది తర్వాత ప్రత్యక్షమైన మల్టీబిలియనీర్
Billionaire Jack Ma reappears in Hong Kong: చైనా ప్రభుత్వం అక్కడి అపర కుబేరులకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది చైనా ఆర్థిక నియంత్రణ చట్టాలను ఏకిపడేయడంతో.. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఏడాది తర్వాత మళ్లీ మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. హాంకాంగ్‌లో గత కొన్నిరోజులుగా వ్యాపార సంబంధిత సదస్సుల్లో ప్రసంగిస్తున్న ఆయన.. బయట మాత్రం మీడియాతో ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం. కిందటి ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్ మా. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. జాక్ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్ డాలర్ల ఐపీవోకు(ఆసియాలోనే అతిపెద్ద ఐపీవో!) బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి చాలాకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. అడపాదడపా కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నప్పటికీ.. బయటికి కనిపించింది మాత్రం లేదు. ఈ తరుణంలో మంగళవారం హాంకాంగ్‌లోని ఓ బిజినెస్ వేదిక వద్ద జాక్ మా కనిపించడంతో మీడియా ఆయన ముందు మైక్ ఉంచింది. అయితే వ్యాపార సంబంధ వ్యవహారాల వల్ల తానేం మాట్లాడబోనని సున్నితంగా తిరస్కరించారు. ఇక చివరిసారిగా అక్టోబర్‌లో ఏషియన్ ఫైనాన్షియల్ హబ్ ఈవెంట్లో పాల్గొన్న జాక్ మా.. బహిరంగంగా కనిపించింది లేదు. చైనా ప్రభుత్వంపై చేసిన వ్యతిరేక కామెంట్లు ఆయన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. చైనా ప్రభుత్వ ప్రతీకారంతో ఆర్థికంగా జాక్ మాకు కోలుకోలేని దెబ్బలు పడుతున్నాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో దేశ ఆర్థిక పురోగతికి 15.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చైనా ప్రభుత్వానికి ఆఫర్ చేశాడు. డ్రాగన్ ప్రభుత్వ మద్దతుతో ఈమధ్యే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ది బాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు కూడా. దీంతో అలీబాబా షేర్స్ కొంతలో కొంత పుంజుకుంటున్నాయి. యాభై ఏడేళ్ల జాక్ మా మొత్తం ఆస్తుల విలువ 51.5 బిలియన్ డాలర్లు. చైనాలో మూడో ధనికుడిగా ఉన్న జాక్ మా.. గతంలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేశాడు. తూర్పు చైనా నగరం హాంగ్జౌ(పుట్టింది ఇక్కడే) కేంద్రంగా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అలీబాబా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హాంకాంగ్‌తో పాటు న్యూయార్క్‌లోనూ అలీబాబా కార్యకలాపాలకు గుర్తింపు ఉంది. చదవండి: బిట్‌కాయిన్.. చైనా బ్యాన్ ఎఫెక్ట్ నిల్! -
ప్రైవేట్‌పై చైనా కొరడా మతలబు?!
మావో అనంతర పాలకులు కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, రాజ్యాంగాన్ని మార్చడంద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, పట్టణ–గ్రామీణ, తీరప్రాంత– మైదాన ప్రాంతాల మధ్య విభజనలు బాగా పెరిగాయి. గత మూడు దశాబ్దాలుగా చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాంతానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయత్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యాసాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆర్థిక కొలమానాల్లో అత్యున్నత స్థానంలో ఉంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితిలో మాత్రం లేదు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి పరిణామాలు, ప్రత్యేకించి అలీబాబా గ్రూప్, ఎవెర్ గ్రాండే వంటి ప్రైవేట్ కంపెనీలు ఎదుర్కొన్న సమస్యలు... చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ త్రీ రెడ్ లైన్ పాలసీపై, ప్రైవేట్ రంగంపై ప్రభుత్వ వైఖరి, దాని ఉద్దేశాలపై ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. చైనా స్థూల దేశీయోత్పత్తిలో 60 శాతం, సాంకేతిక ఆవిష్కరణల్లో 70 శాతాన్ని ప్రైవేట్ రంగమే అందిస్తోంది. 1995లో ప్రైవేట్ రంగం చైనాలో 18 శాతం ఉద్యోగా లను కల్పించగా 2018లో అది 87 శాతానికి పెరిగింది. చైనా ఎగు మతులు ఇదే కాలానికి గాను 34 శాతం నుంచి 88 శాతానికి పెరి గాయి. పై ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముందు చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్మాణమైందో మనం అర్థం చేసుకోవడానికి అయిదు అంశాలను పరిశీలించాలి. మొదటిది: 1950లు, 60లలో మావో సేటుంగ్ పాలనలో నిఖా ర్సైన కమ్యూనిస్టు సైద్ధాంతిక పునాదిపై, అటు సోవియట్ సహాయం, ఇటు స్వావలంబనకు పిలుపివ్వడం అనే రెండింటి సమ్మేళనంతో, దేశంలో పారిశ్రామిక పునాదిని నిర్మించడంపై చైనా గట్టిగా కృషి చేసి మరీ విజయం సాధించింది. అయితే 1970లు, 80లలో డెంగ్ జియాంవో పింగ్ అంతర్జాతీయ సహకారంతో ఆర్థికాభివృద్ధిపై ఎక్కు వగా దృష్టిపెట్టారు. 1990లలో నాటి దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ సైద్ధాంతిక, ఆర్థిక రంగాల్లో సంస్కరణలతో చైనాను అత్యధిక వృద్ధి స్థాయికి తీసుకెళ్లారు. కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, ఈ మేరకు రాజ్యాం గంలో కూడా మార్పులు తీసుకోవడం ద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ యాజమాన్యానికి పలు హక్కులు కల్పిస్తూ ఒక నిబంధనను చేర్చారు. ప్రైవేట్ వ్యాపారులు కమ్యూనిస్టు పార్టీ నియం త్రణలో పనిచేయాల్సి ఉందని, పార్టీ పాలనకు వారు బేషరతుగా లోబడి ఉండాలని షరతు కూడా విధించారు. రెండు: ఈ విధానాల ఫలితంగా, 1978 నుంచి 2003 నాటికి ఎగుమతుల పరిమాణం 28 రెట్లకు పెరిగింది. 1952 నుంచి 1978 కాలంలో ఎగుమతుల్లో సాధించిన రెండు రెట్ల వృద్ధితో పోలిస్తే ఇది భారీ స్థాయి వృద్ధి అని చెప్పాలి. 1978–2003 కాలంలో సంస్కరణలు అమలు చేసి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించడానికి సుంకాలు, పన్నులు, వాణిజ్య ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తూ నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్లను నెలకొల్పారు. ఎగుమతులను, అత్యున్నత టెక్నాల జీని దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించడమే వీటి లక్ష్యం. దీంతో 1952లో చైనా జీడీపీలో పారిశ్రామిక రంగ వాటా 8 శాతం మాత్రమే ఉండగా, 2003 నాటికి 52 శాతానికి పెరిగింది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 1952లో 4.6 శాతం ఉండగా 2003 నాటికి 15 శాతానికి పెరిగింది. ఇక పారిశ్రామికోత్పత్తిలో విదేశీ మదుపు సంస్థల వాటా 1990లో 2.3 శాతం ఉండగా 2003 నాటికి అది 35.9 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. మూడు: 2003 నుంచి 2013 వరకు ఒక దశాబ్ది కాలంలో చైనా వార్షిక వృద్ధి రేటు 10.3 శాతంగా నమోదైంది. 2007 నాటికి 14.2 శాతం నమోదుతో ప్రపంచంలోనే అత్యన్నత వృద్ధి రేటును చైనా సాధించింది. 2008–2019 దశాబ్దంలో ఆర్థిక మాంద్య కాలంలో చైనా సగటు వృద్ధి రేటు 7.99 శాతానికి నమోదైంది. ఇది ఆ దశాబ్దంలో ఏ దేశమూ సాధించినంత అధిక వృద్ధి రేటు. 2004లో చైనా వస్తుతయారీ రంగం 625 బిలియన్ డాలర్ల విలువను నమోదు చేయగా 2019 నాటికి అది 3,896 బిలియన్లకు అమాంతంగా పెరిగింది. ఈ అసాధా రణమైన వృద్ధిరేటు వల్ల చైనా 2011లోనే ప్రపంచ తయారీరంగ కార్ఖానాగా మారింది. ఆ నాటికి ప్రపంచ తయారీరంగ ఉత్పత్తిలో చైనా వాటా 28.4 శాతంగా నమోదైంది. 2010లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. నాలుగు: ఆర్థిక రంగ సంస్కరణలు ప్రైవేట్ భాగస్వామ్యానికి చోటు కల్పించినప్పటికీ, చైనా ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం జీడీపీలో 23 నుంచి 27 శాతం వాటాను సాధించాయి. ఇవి పారి శ్రామిక రంగంలో 21 శాతం వాటాను కలిగి ఉండగా, నిర్మాణ రంగంలో 38.5 శాతం, హోల్‌సేల్, రిటైల్ రంగంలో 39 శాతం వాటాను, రవాణా, నిల్వ రంగంలో 77 శాతం వాటాను సాధించాయి. ఇక మొత్తం ద్రవ్యరంగంలో 88 శాతం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో 24.6 శాతం ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 27 ప్రభుత్వ రంగ సంస్థలకు చోటు దక్కగా చైనా నుంచి 9 సంస్థలు స్థానం సంపాదించాయి. 2017 నాటికి ఈ జాబితాలో మొత్తం 102 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 77 సంస్థలు చైనాకు సంబంధించినవే ఉండటం గమనార్హం. చైనా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు 2017లో 22,310 బిలియన్ డాలర్లతో రికార్డు సృష్టించాయి. కాగా మొత్తం 7,676 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సరకులను అమ్మగలిగాయి. ప్రత్యేకించి బొగ్గు, ఇనుము పెద్దగా లేని లోహాలు, ఉక్కు, విద్యుత్తు, నిర్మాణ పరి శ్రమ వంటి రంగాల్లోకి చైనా భారీ పెట్టుబడులను తరలించింది. వీటిలో కొన్ని పరిశ్రమలను అధికోత్పత్తి సామర్థ్యతతో నిర్మించారు. చైనా 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరింది. అప్పటినుంచి 2015 నాటికి 15 సంవత్సరాల వ్యవధిలో ఏటా 13 శాతం సగటు ఉత్పత్తి రేటుతో చైనా ఉక్కు ఉత్పత్తిని అతి భారీ స్థాయిలో కొనసాగించింది. ఒక్క ఉక్కు రంగంలోనే 2018లో 8.1 శాతం వృద్ధి రేటుతో 928 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని, సిమెంట్ రంగంలో 895 మిలియన్ టన్నుల అధికోత్పత్తి సామర్థ్యాన్ని చైనా సాధించింది. ఇది ప్రపంచ అధికోత్పత్తి సామర్థ్యంలో 45 శాతా నికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయిదు: చైనాలో బ్యాంకింగ్ వ్యవస్థ 2016 నాటికి యూరో పియన్ యూనియన్ బ్యాంకింగ్ వ్యవస్థకంటే పెద్దదిగా మారింది. చైనా బ్యాంకుల సొంత ఆస్తుల విలువ 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది చైనా జీడీపీకి 3 రెట్లు ఎక్కువ. 2001 నుంచి చైనా బ్యాంకులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారీ స్థాయి మౌలిక వస తుల కల్పన ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు అందించాయి. దీంతో అధికోత్పత్తి సామర్థ్యం కలిగిన చైనా ప్రత్యేక ఆర్థిక మండళ్లు నిర్మాణ రంగ సామగ్రిని ఈ దేశాలకు భారీగా పంపించగలిగాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ 2017లో నిర్వహించిన 19వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మార్క్సిస్ట్ దృక్పథం, వైధానికం తోడుగా 2049 నాటికి చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా మలుద్దామని పిలుపు నిచ్చింది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, గత మూడు దశాబ్దాల్లో పట్టణ–గ్రామీణ, తీరప్రాంత–మైదాన ప్రాంతాల మధ్య విభజనలు పెరి గాయి. 2019 నాటికి ఈ విభజన భారీ స్థాయికి చేరుకుంది. తీర ప్రాంతాల్లో నివసించే ఒక శాతం జనాభా దేశ మొత్తం సంపదలో 13 శాతాన్ని అదుపులో ఉంచుకున్నది. దీంతో చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాం తానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయ త్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యా సాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపి స్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు చైనా ఆర్థిక వ్యవస్థ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితితో అయితే లేదు. డా. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ ‘ మొబైల్: 79089 33741 -
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలో చీకటి యవ్వారాలు
చైనా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబాను లైంగిక ఆరోపణల పర్వం కుదిపేస్తోంది. ప్రతీ ఏడాది ఆరోపణల కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ మహిళా ఉద్యోగిణినిపై మేనేజర్ లెవల్ అధికారి, ఓ క్లయింట్ లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు పది మంది ఉద్యోగులపై వేటు వేసింది కంపెనీ. క్రమశిక్షణ చర్యల పేరుతో అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ కిందటి వారం పది మందిని డిస్మిస్ చేసింది. అయితే వాళ్లంతా అత్యాచార బాధితురాలికి మద్దతుగా పోస్ట్‌లు చేసినందుకే ఇదంతా జరిగిందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ మేనేజర్, క్లయింట్ ఇద్దరూ తనను ఓ బిజినెస్ ట్రిప్‌లో వేధించారని, బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారని గతంలో ఆమె ఆరోపించింది. దీంతో ఆరోపణలపై నిజాలు తేలేదాకా ఆ మేనేజర్‌పై వేటు వేశారు. క్లిక్ చేయండి: బిజినెస్ బిల్డప్ బాబాయ్ ఈ తరుణంలో ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కంపెనీ అంతర్గత ఫోరమ్‌లో షేర్ చేశారు పది మంది ఉద్యోగులు. తిరిగి ఆ మేనేజర్‌ను విధుల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నందునే బాధితురాలికి న్యాయం జరగదనే ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు వాళ్లు వివరణ కూడా ఇచ్చారు. అయితే కంపెనీ మాత్రం విషయం బయటకు పొక్కేలా చేసినందుకు వాళ్లపై వేటు వేసింది. మొత్తం రెండున్నర లక్షల ఉద్యోగులున్న అలీబాబా కంపెనీలో.. 2020లో ముప్ఫై మందికిపైగా ఉద్యోగిణులు.. తమ బాస్‌లపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం విశేషం. చదవండి: జియో వర్సెస్ ఎయిర్టెల్.. గూగుల్ షాకింగ్ నిర్ణయం -
నిషేధం ఉన్నా.. నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయ్
దేశ భద్రతకు ముప్పు కారణంతో కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్‌లపై నిషేధం విధించిన నేపథ్యంలో డ్రాగన్ కంపెనీలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. వివిధ యాప్‌లకు యాజమాన్య సంస్థగా వేరే కంపెనీని ముందు పెట్టి తెర వెనుక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భారత మార్కెట్లో నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయి. గతేడాది నిషేధం వేటు పడిన ఆలీబాబా, బైట్‌డ్యాన్స్ వంటి కంపెనీలే ఈ యాప్‌లను వెనుక నుంచి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలు తమ యాప్‌లను కొత్త సంస్థల పేర్లతో లిస్ట్ చేస్తున్నాయి. యాప్‌ల యాజమాన్యం గురించి ఎక్కువగా బైట సమాచారం పొక్కకుండా, చైనా మూలాల గురించి తెలియకుండా జాగ్రత్తపడుతున్నాయి. దేశీయంగా టాప్ 60 యాప్‌ల్లో 8 చైనాకి చెందినవి ఉన్నట్లుగా ఒక పరిశోధనలో తేలింది. వీటికి ప్రతి నెలా సగటున 21.1 కోట్ల మంది యూజర్లు ఉంటున్నారు. చైనా యాప్‌లను గతేడాది జూలైలో నిషేధించినప్పుడు ఇవే యాప్‌ల యూజర్ల సంఖ్య 9.6 కోట్లే. కానీ గడిచిన 13 నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 11.5 కోట్ల మేర పెరగడం .. నిషేధం ఉన్నా చైనా యాప్‌లు ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నాయో చెబుతోంది. చైనాతో సరిహద్దుల్లోనూ, దౌత్యపరంగాను ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గతేడాది చైనా యాప్‌లపై కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 267 చైనా యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, పబ్జీ, హెలో, అలీఎక్స్‌ప్రెస్, లైకీ, షేర్ఇట్, మి కమ్యూనిటీ, వుయ్‌చాట్, బైదు సెర్చి, క్యామ్‌స్కానర్, వీబో, బిగో లైవ్‌తో పాటు షావోమీ సంస్థకు చెందిన కొన్ని యాప్‌లు వీటిలో ఉన్నాయి. దేశ ప్రజలు, వారి డేటా భద్రత కారణాల రీత్యా హోం శాఖ సిఫార్సుల మేరకు వీటిపై నిషేధం విధించినట్లు కేంద్రం అప్పట్లో వెల్లడించింది. అయితే, దాదాపు అదే తరహా యాప్‌లు కొత్త అవతారంలో నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా విస్తరిస్తుండటం గమనార్హం. అత్యధికం మీడియా, వినోద రంగానివే.. కొత్తగా పుట్టుకొస్తున్న వాటిల్లో చాలా మటుకు యాప్‌లు.. మీడియా, వినోద రంగానికి చెందినవే. 2020లో నిషేధం వేటు పడిన టిక్‌టాక్ (యాజమాన్య సంస్థ బైట్‌డ్యాన్స్), శ్నాక్‌వీడియో (క్వాయ్‌షో) వంటి సంస్థలు ఇదే విభాగంలో హవా కొనసాగించడం గమనార్హం. ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో యూజర్లకు త్వరితగతిన చేరువ కావడానికి వీలుంటుంది కాబట్టి మీడియా, వినోద రంగాలనే చైనా కంపెనీలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్లే నిషేధం అనంతరం కొత్తగా వచ్చిన వాటిలో కొన్ని యాప్‌లు కేవలం నెలల వ్యవధిలోనే లక్షల కొద్దీ యూజర్లను నమోదు చేసుకోవడం ఈ వాదనలకు ఊతమిస్తోంది. ఈ యాప్‌లలో కొన్ని పైరసీని ఎరగా చూపి యూజర్లను ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా యాప్‌లలో ప్లేఇట్ ఒకటి. ఇది ప్రధానంగా పైరసీని అడ్డం పెట్టుకుని వేగంగా వృద్ధి చెందింది. వివిధ వీడియోలను ప్లే చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్, ఎంఎక్స్ప్లేయర్, సోనిలివ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి షోలు, సినిమాల కాపీలను డౌన్లోడ్ చేసుకుని, చూసుకునేందుకు ప్లేఇట్ యాప్ వీలు కల్పిస్తోంది. పలు యాప్‌లు .. యూజర్ల డివైజ్‌లో ఉన్న సమా చారం, వీడియోలు, ఫొటోలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నాయి. ఆఖరికి యూజరు ఉన్న ప్రాంతాన్ని కూడా ట్రాక్ చేయగలుగుతున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా ఆయా యాప్‌లు ఉంటున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా లిస్టింగ్.. గూగుల్ ప్లే స్టోర్‌లో పలు చైనా యాప్‌లు అసలు యాజమాన్య సంస్థ పేరుతో కాకుండా వేరే కంపెనీ పేరుతో లిస్టయి ఉంటున్నాయి. ఫలితంగా వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సంస్థ ఆనవాళ్లు దొరకపుచ్చుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. అయితే, ఆయా కార్పొరేట్ కంపెనీల వెబ్సైట్లలో వాటి భాగస్వామ్య సంస్థల వివరాలు, యాజమాన్యానికి సంబంధించి పబ్లిక్‌గా ఉన్న రికార్డులు, సిబ్బంది నియామకాలకు సంబంధించి లింక్డ్ఇన్ వంటి పోర్టల్స్‌ను సదరు సంస్థలు ఉపయోగిస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం అవగతమవుతుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు యాప్‌లకు, గతంలో నిషేధం వేటుపడిన యాప్‌లకు యాజమాన్య సంస్థ ఒకటే అన్నది తెలుస్తుంది. చాలా సందర్భాల్లో నిషేధించిన యాప్‌ల ఉద్యోగులనే కొత్త యాప్‌లకు ఆయా కంపెనీలు మారుస్తున్నట్లు లింక్డ్ఇన్ డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్ యాప్ మాజీ హెడ్ .. ఈ ఏడాది జూలైలో బైట్‌డ్యాన్స్‌లో మరో విభాగానికి మారినట్లుగా లింక్డ్ఇన్ వివరాలు చూపడం ఇందుకు నిదర్శనం. మరోవైపు, భద్రత ఏజెన్సీలు ఏవైనా హెచ్చరికలు, సిఫార్సులు చేసిన తర్వాతే ఆయా యాప్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది కూడా దేశభద్రత కారణాలతో హోం శాఖ సిఫార్సుల మేరకే కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పలు యాప్‌ల నిషేధానికి ఆదేశాలిచ్చింది. -
ఐపీవోకు పేటీఎమ్,రూ.16,600 కోట్లు సమీకరణే లక్ష్యంగా
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది.ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 16,600 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం రూ. 8,300 కోట్ల విలువైన ఈక్విటీని ఐపీవోలో భాగంగా జారీ చేయనుంది. మరో రూ. 8,300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మతోపాటు చైనీస్ గ్రూప్ అలీబాబా, తదితర సంస్థలు వాటాలను ఆఫర్ చేయనున్నాయి. నిధుల వినియోగం..: అలీబాబా కనీసం 5 శాతం వాటాను విక్రయించనుండగా.. సయిఫ్ 3 మారిషస్, సయిఫ్ పార్ట్నర్స్, బీహెచ్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఐపీవో నిధులలో రూ. 4,300 కోట్లను బిజినెస్ పటిష్టత, విస్తరణ, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేటీఎమ్ పేర్కొంది. గతేడాది(2020–21) రూ. 3187 కోట్ల ఆదాయం సాధించింది. 2019–20లో రూ. 3,541 కోట్ల టర్నోవర్‌తో పోలిస్తే తగ్గింది. అయితే ఇదే కాలంలో నష్టాలు రూ. 2,943 కోట్ల నుంచి రూ. 1,704 కోట్లకు తగ్గినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలిపింది. చదవండి: నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు -
పేటీఎమ్ బోర్డు నుంచి చైనీస్ ఔట్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ బాట పట్టిన డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎమ్ బోర్డు నుంచి చైనీయులందరూ వైదొలగనున్నట్లు తెలుస్తోంది. వీరి స్థానే యూఎస్, దేశీ వ్యక్తులు బాధ్యతలు చేపట్టనున్నట్లు పేటీఎమ్ తాజాగా పేర్కొంది. అయితే కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థల వాటాల విషయంలో మార్పులు ఉండబోవని తెలియజేసింది. అలీపే ప్రతినిధి జింగ్ జియాన్ డాంగ్, యాంట్ ఫైనాన్షియల్స్‌కు చెందిన గువోమింగ్ చెంగ్, అలీబాబా ప్రతినిధులు మైఖేల్ యూన్ జెన్ యావో(యూఎస్), టింగ్ హాంగ్ కెన్నీ హో డైరెక్టర్ పదవుల నుంచి తప్పుకున్నట్లు పేటీఎమ్ వెల్లడించింది. ప్రస్తుతం బోర్డులో చైనీయులెవరూ లేరని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. యాంట్ గ్రూప్ తరఫున యూఎస్ వ్యక్తి డగ్లస్ ఫియాగిన్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. శామా క్యాపిటల్‌కు చెందిన అషిత్ రంజిత్ లిలానీ, సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి వికాస్ అగ్నిహోత్రి బోర్డులో చేరినట్లు పేటీఎమ్ తాజాగా తెలియజేసింది. కాగా.. బెర్కషైర్ హాథవే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ టాడ్ ఆంథోనీ కాంబ్స్ బోర్డు నుంచి పదవీ విరమణ చేసినట్లు వెల్లడించింది. -
అలీబాబాకు మరో ఎదురుదెబ్బ
బీజింగ్ : ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికసాంకేతిక సంస్థ యాంట్ గ్రూప్, చైనాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని ఇంటర్నెట్ రంగంలో గుత్తాధిపత్య వ్యతిరేక పద్ధతులపై పెరిగిన పరిశీలనల మధ్య తన వ్యాపారాలను సరిదిద్దుకోవాలని, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని రెగ్యులేటరీ సంస్థలు ఆదేశించాయి. ఈ మేరకు విచారణకు ఆదేశించాయి.ఐపీఓ నిలిపివేత ద్వారా ఇబ్బందులు పడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని స్థాపించి, తగినంత మూలధనాన్ని కలిగి ఉండాలని రెగ్యులేటర్లు యాంట్ గ్రూప్‌ను ఆదేశించారు. కార్పొరేట్ పాలనను మెరుగుపరిచేటప్పుడు, దాని వ్యాపారాల నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ, యాంట్ గ్రూప్ దాని చెల్లింపుల మూలానికి తిరిగి రావాలని, లావాదేవీల చుట్టూ పారదర్శకతను పెంచుకోవాలని, అన్యాయమైన పోటీని నిషేధించాలని వారు చెప్పారు. రెగ్యులేటరీ అవసరాలకు అనుగుణంగా ఉంటామని, రిస్క్ మేనేజ్మెంట్, నియంత్రణను మెరుగుపరుస్తామని, అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తామని యాంట్ గ్రూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో (37 బిలియన్ డాలర్ల) ప్లాన్ చేసింది కంపెనీ. షాంఘైతో పాటు, హాంకాంగ్ స్టాక్‌మార్కెట్లలో డెబ్యూ లిస్టింగ్‌కు ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోకముందే యాంట్ గ్రూపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో విచారణకు ఆదేశించారు. తాజా నిర్ణయంతో కంపెనీ షేరు 6శాతం పడిపోయింది. మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా మోనోపలిగా కంపెనీ వ్యవహరిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. పోటీతత్వం లేకుండా కస్టమర్లకు ఆప్షన్ లేకుండా చేస్తోందనేది ప్రధాన ఆరోపణ. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు అలీబాబా మాతృ సంస్థ యాంట్ మనదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది. బిగ్ బాస్కెట్, స్విగ్గీ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
43 యాప్స్‌పై బ్యాన్: చైనా అభ్యంతరం
న్యూ ఢిల్లీ: దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత దృష్ట్యా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 మొబైల్ అప్లికేషన్లపై చర్యలు చేపట్టింది. హోంమంత్రిత్వశాఖ నేతృత్వంలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ కేంద్రం నుంచి సమగ్ర నివేదికలపై చర్చించిన అనంతరం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనా యాప్ ల నిషేధంపై భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ స్పందించారు. చైనా కచ్చితంగా ఈ నిషేధింపు చర్యను ఖండిస్తుంది అని తెలిపారు. (చదవండి: భారీ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3) #China firmly opposes #Indian side’s repeated use of "national security” as excuse to prohibit #MobileAPPs with Chinese background. Hope India provides fair,impartial&non-discriminatory biz environ for all market players,& rectify discriminatory practices. https://t.co/hPqSHT7NLF pic.twitter.com/zD4FhajYt1 — Ji Rong (@ChinaSpox_India) November 25, 2020 "చైనా నేపథ్యం ఉన్న యాప్ లను నిషేదించటానికి భారత ప్రభుత్వం 'జాతీయ భద్రత' అనే పదాన్ని పదేపదే ఉపయోగించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది. భారతదేశంలో అన్ని మార్కెట్ ఆటగాళ్లకు న్యాయమైన, నిష్పాక్షికమైన, వివక్షత లేని వ్యాపార వాతావరణాన్ని అందిస్తుంది" అని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మే నెలలో లడఖ్ సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సమాచార గోప్యత దృష్ట్యా ఇప్పటికే 177 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా 43 మొబైల్ యాప్‌లపై కొరడా ఝుళిపించింది. తాజాగా నిషేధించిన యాప్‌లలో చైనా రిటైల్ దిగ్గజ కంపెనీ అలీబాబా గ్రూప్‌నకు చెందిన నాలుగు యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన మరికొన్ని యాప్‌లూ ఉన్నాయి. -
అలీబాబాకు ట్రంప్ సెగ
వాషింగ్టన్ : చైనాపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా కంపెనీలకు వరుస షాక్ లిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టిక్‌టాక్ నిషేధానికి రంగం సిద్ధం చేసుకున్న అనంతరం తాజాగా టెక్నాలజీ దిగ్గజం అలీబాబాను కూడా టార్గెట్ చేశారు. అలీబాబా వంటి చైనా కంపెనీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. (టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్ ఊరట) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా గురించి సరైన సమాచారాన్నిఅందించకుండా దాచిపెట్టిందన్న ఆగ్రహం ఒకవైపు, మరోవైపు రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో చైనా కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలీబాబాపై నిషేధాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం దృష్టిలో చైనా యాజమాన్యంలోని ఇతర ప్రత్యేక సంస్థలు ఉన్నాయా అని ప్రశ్నించినపుడు ట్రంప్ ఈ సంకేతాలు ఇచ్చారు. అమెరికాలో ఇతర కంపెనీల నిషేధం విషయాన్నికూడా పరిశీలిస్తున్నామన్నారు. కాగా టిక్‌టాక్ నిషేధం అంశంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ట్రంప్..అమెరికాలో టిక్‌టాక్ వ్యాపారాన్ని ఏదేని అమెరికా కంపెనీకి విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని బైట్‌డాన్స్‌కు తేల్చి చెప్పారు. ఈ మేరకు విధించిన 45 రోజుల గడువును 90 రోజులకు పెంచుతూ ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
అలీబాబా అధినేతను వెనక్కినెట్టి..
బీజింగ్ : కరోనా మహమ్మారి ప్రభావంతో అత్యంత సంపన్నుల జాబితాలూ తారుమారవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లో టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు అనూహ్యంగా పెరగడం, షాపింగ్ యాప్ పిండుడువో దూకుడు చైనా బిలియనీర్ల ర్యాంకింగ్‌ను తిరగరాశాయి. అతిపెద్ద గేమ్ డెవలపర్ టెన్సెంట్ హోల్డింగ్స్ అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌ను అధిగమించి ఆసియాలోనే అత్యంత విలువైన సంస్థగా ఎదిగింది. దీంతో చైనాలో అత్యంత సంపన్నుడు జాక్ మా (48 బిలియన్ డాలర్లు)ను టెన్సెంట్కు చెందిన పోనీ మా (50 బిలియన్ డాలర్ల) అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం పిడిడికి చెందిన కోలిన్ హువాంగ్ 43 బిలియన్ డాలర్ల నికర సంపదతో టాప్ 3 సంపన్నుల్లో మూడవ స్ధానంలో నిలిచారు. చైనా ఎవర్‌గ్రాండే గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం హుయ్ కా యాన్ నాలుగో స్ధానానికి పడిపోయారు. కరోనా మహమ్మారితో వినియోగదారుల అలవాట్లు మారడంతో పలు ఇంటర్నెట్ కంపెనీల షేర్లు నింగికెగిశాయి. దీంతో చైనా సంపన్నుల ర్యాంకుల్లో టెక్ దిగ్గజాలు అనూహ్యంగా దూసుకొచ్చాయి. తొలి టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు టెక్నాలజీ దిగ్గజాలే కావడం గమనార్హం. చదవండి : ‘అలీబాబా’ జాక్ మా కీలక నిర్ణయం! -
అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి డ్రాగన్ అవుట్ !
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. వాణిజ్య యుద్ధంగా మొదలైనది కాస్తా ఆ తర్వాత టెక్నాలజీ పోరుకు దారితీసింది. 5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా అనేక ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకట్ట వేసేసింది. ఇక, కరోనా వైరస్ వివరాలను తొక్కిపెట్టి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని వ్యాప్తి చేసిందంటూ చైనాపై మండిపడుతున్న అమెరికా ప్రస్తుతం మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తమ దేశ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ‘నేను కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు. నేను..నాతో పాటు మిగతా అందరూ కూడా నిబంధనల ప్రకారం చైనా నడుచుకోవాలనే కోరుకుంటున్నారు‘ అని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టిన సెనేటర్లలో ఒకరైన జాన్ కెనెడీ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఆలీబాబా, బైదు తదితర దిగ్గజ చైనా కంపెనీలకు డీలిస్టింగ్ గండం ఏర్పడింది. బిల్లు ఏం చెబుతోంది .. హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయొచ్చు. గతేడాది మార్చిలోనే సెనేటర్లు జాన్ కెనెడీ, క్రిస్ వాన్ హోలెన్ దీన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం లిస్టెడ్ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాలి. వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్ తప్పదు. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తించేదే. అయితే, చైనా కంపెనీల ఆడిటింగ్ విషయంలోనే సహకారం దొరకడం లేదంటూ పీసీవోఏబీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలపైనే అమెరికా ఎక్కువ కఠినంగా చర్యలు అమలు చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సేల్స్ అకౌంటింగ్ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్ కాఫీ’ ను డీలిస్ట్ చేస్తున్నట్లు నాస్డాక్ ప్రకటించడం దీనికి మరింత ఊతమిస్తోంది. చైనా ముందస్తు వ్యూహాలు.. అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించినా చైనా కూడా తదుపరి వ్యూహాలతో సిద్ధంగా ఉంది. హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్సే్చంజీల నుంచి డీలిస్ట్ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్సే్చంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. లండన్‌లో లిస్ట్ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పునఃప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వదేశీ కంపెనీలకూ ట్రంప్ వార్నింగ్.. చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పట్నుంచీ అమెరికన్ కంపెనీలను అక్కణ్నుంచి వచ్చేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తదితర దేశాలకు తయారీ కార్యకలాపాలు మళ్లించడంపై కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఆయా కంపెనీలను అమెరికాకే రప్పించే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నారు. చైనా నుంచి తయారీ కేంద్రాలను స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలకు వెడితే వాటిపై పన్నుల మోత మోగిస్తామని ఈమధ్యే మరోమారు హెచ్చరించారు. అంతే కాకుండా.. చైనా కంపెనీల్లో తమ సంస్థలు ఇన్వెస్ట్ చేయకుండా కూడా అమెరికా చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం శ్రేయస్కరం అంటూ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌రాక్‌కు నేషనల్ లీగల్ అండ్ పాలసీ సెంటర్ సూచించింది. పర్యావరణ కార్యకర్తల ఆందోళనల కారణంగా బ్లాక్‌రాక్ ఇప్పటికే కొన్ని బొగ్గు కంపెనీల నుంచి తప్పుకుంది. ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌ను నిర్వహించే థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ సంస్థ .. ఇన్వెస్ట్ చేసే విదేశీ స్టాక్స్ జాబితా నుంచి చైనా కంపెనీలను తప్పించడంలోనూ ట్రంప్ ప్రస్తుతానికి సఫలమయ్యారు. ఇది దాదాపు 500 బిలియన్ డాలర్ల నిధిని నిర్వహిస్తోంది. తమ ఇన్వెస్టర్లకు కొత్తగా అంతర్జాతీయ స్టాక్స్‌లో కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో 50 బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విదేశీ స్టాక్స్ జాబితాలో చైనా కంపెనీలు లేకుండా చూసేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దాదాపు 170 చైనా కంపెనీలు.. అమెరికాలోని నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్ పవర్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్‌డువోడువో, జేడీడాట్‌కామ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు, జేడీడాట్‌కామ్ సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. -
కరోనాపై పోరాటానికి 103 కోట్లు విరాళం
బీజింగ్ : చైనాలోని వుహన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ చైనీయుల ప్రాణాలను కబలిస్తోంది. కరోనా వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తూ ప్రపంచదేశాలను గజగజా వణికిస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు బాధితులకు కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందిస్తూనే.. మరోవైపు కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు సైతం తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. కరోనా వైరస్‌కు పోరాటానికి తన వంతు సాయంగా ఈ విరాళం అందజేశారు. దీంతో పాటు టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత 'పోని మా' సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) విలువైన వస్తువులతో పాటు మ్యాపింగ్, డేటా సర్వీసులను అందిస్తున్నారు. దీదీ చుక్సింగ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ తమ వాహనాల ద్వారా మెడికల్ వర్కర్స్, పేషెంట్లకు ఉచిత రవాణా సాయం చేస్తోంది. ఇక డైడు, టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వంటి కంపెనీలు సైతం తమకు తోచిన సాయం అందిస్తున్నాయి. కాగా, చైనాలో కరోనావైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 213 మంది మృతి చెందగా, 7వేల మందికి పైగా కరోనా బారీన పడి చికిత్స తీసుకుంటున్నారు. -
అలీబాబాకు జాక్ మా అల్విదా
చైనీస్ ఈ కామర్స్ రిటైల్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు, టెక్ బిలియనీర్ జాక్ మా (55) చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్నారు. జాక్ మా తన 55వ పుట్టిన రోజు సందర్భంగా నేడు సెప్టెంబర్ 10న అలీబాబా చైర్మన్ పదవి నుంచి అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. స్వస్థలం హాంగ్జౌలోని భారీ (ఒలింపిక్-పరిమాణ) స్టేడియంలో అత్యంత ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అయితే కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఎక్కువ మందిని నామినేట్ చేసే హక్కు ఉన్న 36 మందితో కూడిన అలీబాబా పార్ట్నర్షిప్లో సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. జాక్ స్థానంలో సంస్థ సీఈవో డేనియల్ జాంగ్ కొత్త చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. అతి పేద కుటుంబంలో జన్మించి ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన జాక్.. బిలియనీర్ వ్యాపారవేత్తగా అవతరించారు. ముఖ్యంగా 1999లో స్థాపించిన ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అలీబాబా సహ వ్యవస్థాపకుడిగా కంపెనీ ఎదుగలలో జాక్ మా కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోని టాప్ టెన్ ఇ-కామర్స్ సంస్థల్లో ఒకటిగా అలీబాబాను తీర్చిదిద్దిన జాక్ మా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య వేగంగా మారుతున్న పరిణామాలు, అనిశ్చితినెదుర్కొంటున్న తరుణంలో చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. కాగా 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని ప్రకటించారు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు, షేర్హోల్డర్లు, కస్టమర్లను ఉద్దేశించి రాసిన లేఖలో తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. భవిష్యత్ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే కేటాయిస్తానని పేర్కొన్నారు. నాకు ఇంకా చాలా కలలు ఉన్నాయి. నేను పనిలేకుండా కూర్చోవడం నాకు ఇష్టం ఉందడని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. ప్రపంచం పెద్దది, నేను ఇంకా చిన్నవాడిని, కాబట్టి నేను క్రొత్త విషయాలను ప్రయత్నించాలనుకుంటున్నాను - ఎందుకంటే కొత్త కలలతో కొత్త ఆవిషర్కణలకు, నూతన కలలను సాకారం చేసుకోవచ్చు గదా అంటూ గత ఏడాది ఒక బహిరంగ లేఖ ద్వారా తన రిటైర్మెంట్ గురించి జాక్ మా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ వ్యాపారాలు 16.7 బిలియన్ డాలర్ల ఆదాయంలో 66 శాతం వాటాను కలిగి ఉంది అలీ బాబా సంస్థ. -
సాఫ్ట్‌బ్యాంక్ ‘రికార్డు’ ఐపీవో
టోక్యో: జపాన్ టెక్నాలజీ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ భారీ పబ్లిక్ ఇష్యూతో (ఐపీవో) రికార్డు సృష్టించింది. ఐపీవో ద్వారా 2.65 లక్షల కోట్ల యెన్లు (సుమారు 23.5 బిలియన్ డాలర్లు) సమీకరించింది. జపాన్‌లో ఇది అతి పెద్ద ఐపీవో కాగా.. అంతర్జాతీయంగా భారీ పబ్లిక్ ఇష్యూల్లో రెండోది. 2014 నాటి చైనీస్ ఈకామర్స్ దిగ్గజం ఆలీబాబా ఐపీవో తర్వాత అంతటి భారీ పబ్లిక్ ఇష్యూ ఇదే. అప్పట్లో ఆలీబాబా సుమారు 25 బిలియన్ డాలర్లు సమీకరించింది. మరోవైపు, రికార్డు ఐపీవో అయినప్పటికీ.. లిస్టింగ్‌లో మాత్రం సాఫ్ట్‌బ్యాంక్ షేర్లు భారీగానే క్షీణించాయి. ఇష్యూ ధర షేరు ఒక్కింటికి 1,500 యెన్లు కాగా.. ఓపెనింగ్‌లోనే 1,463 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మకాలు మరింత వెల్లువెత్తడంతో 14.5 శాతం క్షీణించి 1,282 యెన్ల వద్ద క్లోజయ్యింది. షేరు ధర గణనీయంగా పడిపోవడం దురదృష్టకరమని సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ సీఈవో కెన్ మియోచి వ్యాఖ్యానించారు. అయితే, ఇది ఆరంభం మాత్రమేనని, క్రమంగా పరిస్థితులు మెరుగుపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లు అస్తవ్యస్తంగా మారటం, మొబైల్ సంస్థల భారీ చార్జీలపై జపాన్‌లో విధాననిర్ణేతలు గుర్రుగా ఉండటం తదితర అంశాలు సాఫ్ట్‌బ్యాంక్ లిస్టింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపి ఉంటాయని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. -
ఆలీబాబా సింగిల్స్ డే రికార్డు..
షాంఘై: చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఆదివారం నిర్వహించిన సింగిల్స్ డే సేల్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. గతేడాది సింగిల్స్ డే రోజు నమోదైన 25 బిలియన్ డాలర్ల విక్రయాలను కేవలం 16 గంటల్లోనే సాధించి తన రికార్డు తానే తిరగరాసుకుంది. ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు పాలపౌడరు, డైపర్లు మొదలైనవి కూడా అత్యధికంగా అమ్ముడైన వాటిల్లో ఉన్నాయి. జంటల కోసం ఉద్దేశించినదైన వేలంటైన్స్ డేకి భిన్నంగా పదకొండో నెల పదకొండో తారీఖుని సింగిల్స్ (ఒంటరి) డేగా చైనా యువత పాటిస్తుంది. దీన్ని పురస్కరించుకుని వ్యాపార సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈసారి సింగిల్స్ డే తొలి గంటలోనే ఆలీబాబా సుమారు 10 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అయితే, అమ్మకాలు భారీగానే ఉన్నప్పటికీ.. ఏడాది పొడవునా ఏదో ఒక ఆఫరు అందుబాటులో ఉంటున్నందున కస్టమర్లు క్రమంగా సింగిల్స్ డే కోసమే ఎదురుచూడటం తగ్గుతోందని, ఫలితంగా అమ్మకాలపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. -
భారత్‌లో ఆలీబాబా 2వ క్లౌడ్ డేటా సెంటర్
న్యూఢిల్లీ: చైనీస్ దిగ్గజ సంస్థ ఆలీబాబా భారత్‌లో తమ క్లౌడ్ సేవలను మరింత విస్తరించనుంది. త్వరలోనే ముంబై డేటా సెంటర్లో మరో క్లౌడ్ ఇన్ఫ్రాను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. ఈఏడాది ప్రారంభంలో క్లౌడ్ సేవలను ఇక్కడి మార్కెట్లో ప్రారంభించిన ఈ సంస్థ.. నెలల వ్యవధిలోనే తమకు లభించిన విశేష స్పందన చూసి, 2వ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ అంశంపై మాట్లాడిన సంస్థ జనరల్ మేనేజర్ అలెక్స్ లీ.. ‘వచ్చే ఏడాది మార్చిలో రెండవ సెంటర్ ప్రారంభంకానుంది. ఇక్కడి మార్కెట్ నుంచి వచ్చిన విశేష స్పందన కారణంగానే అనతికాలంలో 2వ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుచేయనున్నాం.’ అని వ్యాఖ్యానించారు. విదేశీ ఈ–కామర్స్, సోషల్ మీడియా సంస్థలు భారత్‌లో నిర్వహిస్తున్న సమాచారానికి భద్రత కల్పించే దిశగా భాతర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించిన ఆయన ఇక్కడి చట్టాలపై తమకు గౌరవం ఉందని అన్నారు. -
‘జాక్ మా’ వారసుడొచ్చాడు!
బీజింగ్: అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు జాక్ మా వెల్లడించారు. 420 బిలియన్ డాలర్ల (రూ.30,43,131 కోట్లు) ఈ–కామర్స్ దిగ్గజానికి తన తరువాత వారసుడిగా ప్రజాదరణ పొందిన ‘సింగిల్ డే సేల్’ ప్రచార రూపకర్త సీఈఓ డేనియల్ జాంగ్‌ను ప్రకటించారు. సోమవారం తన 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించిన జాక్ మా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 10న జాంగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపడతారని తెలియజేశారు. 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని ప్రకటించారు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు, షేర్హోల్డర్లు, కస్టమర్లను ఉద్దేశించి రాసిన లేఖలో తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. ఇక నుంచి భవిష్యత్ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే కేటాయిస్తానని పేర్కొన్నారు. -
అలీబాబా-రిలయన్స్ రిటైల్ వార్తలపై క్లారిటీ
ముంబై : భారత రిటైల్ రంగంలో భారీ జాయింట్ వెంచర్‌కు రంగం సిద్ధమవుతుందని... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్‌తో చైనా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా చేతులు కలుపబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, వీటిలో ఎలాంటి ఆధారాలు లేవని, ఊహాగాహనాల వార్తలు మాత్రమేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి తేల్చిచెప్పారు. రిలయన్స్ రిటైల్‌లో 50 శాతం వాటాను 5 బిలియన్ డాలర్లకు అలీబాబా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, దీనిపై చర్చలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ తమ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు అలీబాబా కానీ, మరే ఇతరులు కూడా చర్చలు జరుపలేదని రిలయన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ప్రకటన పూర్తిగా ఊహాగానాలేనని, అత్యంత బాధ్యతారహితమైనవని చెప్పారు. అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్‌మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో ఈ ప్రతిపాదనపై జూలై చివరిలో చర్చలు జరిపినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ జాక్‌మా, తమ చైర్మన్‌ను అసలు ముంబైలో కలువనే లేదని పేర్కొన్నారు. పేటీఎం మాదిరి రిలయన్స్ రిటైల్ తీసుకురావాలని చూస్తున్నారని రిపోర్టులు చక్కర్లు కొట్టాయి. అయితే ‘రిలయన్స్ రిటైల్ ఇప్పటికే అతిపెద్ద రిటైల్ కంపెనీ. అంతేకాక వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న, ఎక్కువగా లాభాలార్జిస్తున్న కంపెనీ. తమ వృద్ధి ప్రణాళికలను ఇటీవల జరిగిన ఏజీఎంల్లో షేర్హోల్డర్స్తో చైర్మన్ పంచుకున్నారు. అప్పటి నుంచి ఇక ఎలాంటి కొత్త అప్డేట్ లేదు’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి తేల్చి చెప్పారు. రిలయన్స్ రిటైల్‌తో అలీబాబా జతకట్టబోతుందని వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తమేమంటూ క్లారిటీ ఇచ్చారు. చదవండి : (రిలయన్స్ రిటైల్‌తో అలీబాబా జట్టు!) -
రిలయన్స్ రిటైల్‌తో అలీబాబా జట్టు!
ముంబై: భారత రిటైల్ రంగంలో భారీ జాయింట్ వెంచర్‌కు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్‌తో చైనా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ, అలీబాబా చేతులు కలపనున్నది. ఈ రెండు సంస్థలు కలసి భారత్‌లో భారీ రిటైల్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ప్రపంచంలో వేగంగా వృద్ది చెందుతున్న మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల జోరుకు చెక్ పెట్టడానికి ఈ జాయింట్వెంచర్ను ఏర్పాటు చేయాలని ఇరు సంస్థలు యోచిస్తున్నాయని సమాచారం. అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా గత నెల చివర్లో ముంబైలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో కలిసి చర్చలు జరిపారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటిలో ఇరువురూ పలు అంశాలపై చర్చలు జరిపారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల్లో భాగంగా రిలయన్స్ రిటైల్‌లో 50 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయాలని అలీబాబా సంస్థ యోచిస్తోందని, దీని కోసం ఆ సంస్థ 500–600 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలీబాబాకు స్వల్పమైన వాటాతో ఇరు సంస్థలు కలిసి వ్యూహాత్మక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. భారీ డిజిటల్‌మార్కెట్ ప్లేస్‌ను ఏర్పాటు చేసే విషయం కూడా చర్చలు జరిగాయని సంబంధిత వర్గాలు తెలపాయి. ఒక వేళ ఈ డీల్ సాకారమైతే, భారత్‌లో అలీబాబాకు ఇదే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ విషయంలో అలీబాబాకు గోల్డ్‌మన్ శాక్స్ సలహాదారుగా వ్యవహరిస్తోంది. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి గోల్డ్‌మన్ శాక్స్ ప్రతినిధి నిరాకరించారు. మొత్తం మీద భారత ఈ కామర్స్ రంగంలో భారీ పోరుకు తెర లేవనున్నది. నిధులు పుష్కలంగా ఉన్న రెండు దిగ్గజ సంస్థలు(ఆమెజాన్ వర్సెస్ ఆలీబాబా) భారత ఈ కామర్స్ మార్కెట్లో అగ్రస్థానం కోసం పోటీ పడనున్నాయి. ఈ పోటీ కారణంగా వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణుల అంచనా. మరోవైపు ఈ డీల్ అలీబాబాకు అత్యంత కీలకం కానున్నది. ఈ సంస్థకు 49 శాతం వాటా ఉన్న పేటీఎమ్‌కు ఇటీవలనే ఆర్బీఐ వినియోదార్ల డేటా విషయమై హెచ్చరిక జారీ చేసింది. పేటీఎమ్ కస్టమర్ల డేటాను ఈ చైనా కంపెనీ యాక్సెస్ చేస్తోందని ఆర్బీఐ ఆనుమానిస్తోంది. కాగా రిలయన్స్ రిటైల్ 5,200 పట్టణాల్లో మొత్తం 8,533 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఏడాది కాలానికి రిలయన్స్ రిటైల్ రూ.2,529 కోట్ల స్థూల లాభం సాధించింది. ఈ కంపెనీ టర్నోవర్ 1,000 కోట్ల డాలర్లను దాటేసింది. ‘ప్రపంచాన్ని మార్చే’ కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోకు అగ్రస్థానం ఫార్చ్యూన్ సంస్థ రూపొందించిన ప్రపంచాన్ని మార్చే కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోకు అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఫార్మా దిగ్గజం మెర్క్, మూడో స్థానంలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలు నిలిచాయి. ఐదో స్థానాన్ని చైనాకు చెందిన అలీబాబా సాధించింది. -
ఈ-కామర్స్ దిగ్గజంలో 3.6 కోట్ల ఉద్యోగాలు
బీజింగ్ : చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా 2017లో భారీగా ఉద్యోగాలు సృష్టించింది. తన రిటైల్ ఎకోసిస్టమ్ విస్తరణతో అలీబాబా దాదాపు 3.68 కోట్ల ఉద్యోగాలు కల్పించినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ట్మాల్, టాబో వంటి కంపెనీకి చెందిన పలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు 50 కోట్ల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు విపరీతంగా వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటు 2017లో భారీగా 14.05 మిలియన్ ఉద్యోగాలను కల్పించాయని జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఈ కంపెనీలో దుస్తులు, వస్త్రాలు, రోజువారీ అవసర, గృహోపకరణ ఉత్పత్తులు ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్న రిటైల్ ఉత్పత్తుల్లో టాప్-3లో ఉన్నట్టు పేర్కొంది. ఆన్లైన్ రిటైల్ సర్వీసులు భారీగా పైకి ఎగుస్తుండటంతో, ఆర్ అండ్ డీ, డిజైన్, మానుఫ్రాక్చరింగ్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో నిపుణులకు డిమాండ్ పెరిగిందని తెలిపింది. మొత్తంగా ఇవి 22.76 మిలియన్ ఉద్యోగాలను సృష్టించినట్టు నివేదించింది. 2017 నాలుగో క్వార్టర్లో అలీబాబా కంపెనీ సైతం ఏడాది ఏడాదికి 56 శాతం వృద్ధిని నమోదుచేసింది. ప్రస్తుతం ఈ-కామర్స్ మార్కెట్లో మధ్య, దీర్ఘకాలిక ప్లాన్లను రూపొందించే నిపుణులకు, బిజినెస్ మోడల్స్‌ను సంస్కరించే వారికి, ఆఫ్‌లైన్ రిటైల్ స్కిల్స్‌తో డిజిటల్ టెక్నాలజీస్‌ను అనుసంధానించే నిపుణులకు మంచి డిమాండ్ ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. -
సీఎం కేసీఆర్ ఓ అలీ బాబా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓ అలీ బాబా అని, ఆయన కుటుంబసభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ చార్ చోర్ (నలుగురు దొంగలు) అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేకుండా పోయా యన్నారు. తెలంగాణలో ఇలాంటి నిరం కుశ, అరాచక పోకడలు ఉంటాయని ఊహించలేదన్నారు. రాజ్యసభ సీటు కూడా సంతోష్కిస్తారా, అమరవీరుల కుటుంబాలకు ఎందుకివ్వరని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ బస్సు యాత్రతో మంత్రి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీపై కేసీఆర్ వ్యాఖ్య లు బాధించాయంటున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా సీఎంతోనే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ తిడితే కేటీఆర్‌తో ఆమె వివరణ తీసుకోవడం హాస్యాస్పదమన్నారు. -
బిగ్‌బాస్కెట్‌లోకి ఆలీబాబా 1,920 కోట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ సంస్థ, బిగ్‌బాస్కెట్ తాజాగా 30 కోట్ల డాలర్ల (రూ.1,920 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా, అబ్రాజ్ క్యాపిటల్, శాండ్స్ క్యాపిటల్, ఐఎఫ్‌సీ తదితర సంస్థల నుంచి ఈ నిధులు సమీకరించామని బిగ్‌బాస్కెట్ సీఈఓ హరి మీనన్ చెప్పారు. ఈ నిధులతో రైతుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని, తమ సేవలను మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,800 మంది రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, ఈ సంఖ్యను 3,000కు పెంచనున్నామని వివరించారు. మరోవైపు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా షారూక్ ఖాన్ కొనసాగుతారని, ఆయనతో కాంట్రాక్టును రెన్యువల్ చేశా మని పేర్కొన్నారు. ఇటీవలనే 80 లక్షల వినియోగదారుల మైలురాయిని దాటామని, హైదరాబాద్, బెంగళూరుల్లో బ్రేక్ ఈవెన్‌కు వచ్చామని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,410 కోట్ల ఆదాయం సాధించామని వివరించారు. గ్రోఫర్స్, అమెజాన్‌లకు గట్టిపోటీనివ్వడానికి బిగ్‌బాస్కెట్‌కు ఈ తాజా నిధులు ఉపయోగపడతాయని నిపుణులంటున్నారు. ఈ డీల్ ప్రాతిపదికన బిగ్‌బాస్కెట్ విలువ 90 కోట్ల డాలర్లని అంచనా. జొమాటొలో ఆలీబాబా పెట్టుబడులు కాగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటొలో చైనాకు చెందిన ఆలీబాబా అనుబంధ సంస్థ, ఆంట్ స్మాల్ అండ్ మైక్రో ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. -
యూసీ బ్రౌజర్‌పై నిషేధం?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్ బ్రౌజర్ యూసీ వెబ్ రద్దు కాబోతుంది. డేటా దొంగతనానికి పాల్పడుతుందంటూ చైనీస్ కంపెనీలపై వస్తున్న ఆరోపణల విచారణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ యూజర్ల డేటా దొంగతనానికి గురైందని వెల్లడైతే, భారత్‌లో యూసీ వెబ్‌పై నిషేధం విధించే అవకాశాలున్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. యూసీ బ్రౌజర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. చైనాలోని సర్వర్లకు భారత యూజర్ల మొబైల్ డేటాను ఇది పంపిస్తుందని, ఈ అంశాన్ని తాము పరిగణలోకి తీసుకున్నామని అధికారి తెలిపారు. యూసీ బ్రౌజర్‌కు భారత్‌లో నెలవారీ యాక్టివ్ యూజర్లు 100 మిలియన్‌కు పైననే. గ్లోబల్‌గా దీని యూజర్ బేస్ 420 మిలియన్లు. గూగుల్ క్రోమ్ తర్వాత భారత్‌లో అత్యధికంగా వాడుతున్న వెబ్ బ్రౌజర్ యూసీ బ్రౌజరే. మొబైల్ ఫోన్ సెగ్మెంట్ యాడ్స్‌లో దీని మార్కెట్ షేరు 48.7 శాతం. అయితే యూసీ వెబ్ సెక్యురిటీని, ప్రైవసీని చాలా సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. యూజర్లకు మెరుగైన సేవలందించడానికి ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను ఏర్పాటుచేయడం ఐటీ కంపెనీల సాధారణ పద్ధతి అని పేర్కొన్నారు. తాము ఎలాంటి యూజర్ల నమ్మకాన్ని వమ్ముచేయడం లేదని తెలిపారు. యూజర్ల డేటాను సేకరించడంపై ఆ సంస్థ సమర్థించుకుంటుంది. యూజర్ల సమాచారాన్ని, డేటాను సేకరించడం ఇండస్ట్రిలో పద్ధతిలో భాగమని పేర్కొంది. యూజర్ల ప్రయోజనాలను తాము కాపాడతామని చెప్పింది. -
పేటీఎంలోకి ఆలీబాబా మరో రూ.1,200 కోట్లు!
న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్ సంస్థలో చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా, మరో ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఎస్ఏఐఎఫ్ (సెయిఫ్) పార్ట్నర్స్ దాదాపు 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,350 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ సంస్థ 177 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,200 కోట్లు), మిగతా మొత్తం సెయిఫ్ పెట్టుబడి పెట్టనున్నాయి. తాజా పెట్టుబడుల అనంతరం పేటీఎం ఈ–కామర్స్‌లో ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ వాటాలు 36.31 శాతంగాను, సెయిఫ్ పార్ట్నర్స్ వాటా 4.66 శాతంగాను ఉండనున్నాయి. ఈ డీల్‌తో పేటీఎం వేల్యుయేషన్ దాదాపు 1 బిలియన్ డాలర్లకు చేరనుంది. గతంలో 60 మిలియన్ డాలర్లు సమీకరించినప్పుడు పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ వేల్యుయేషన్ 4.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వన్ 97 కమ్యూనికేషన్స్‌కి ప్రస్తుతం పేటీఎం ఈ–కామర్స్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం మొబైల్ సొల్యూషన్స్ అనే మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. దేశీ సంస్థ ఫ్లిప్‌కార్ట్, అమెరికన్ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఆధిపత్యం చెలాయిస్తున్న దేశీ ఈ–కామర్స్ మార్కెట్లో చోటు దక్కించుకునేందుకు ప్రస్తుత డీల్ ఆలీబాబాకు ఉపయోగపడనుంది. దూకుడుగా దూసుకెళుతున్న అమెజాన్ తన మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకుంటోంది. మరోవైపు, నిధుల కొరతతో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆలీబాబా రాక.. దేశీ ఆన్లైన్ రిటైల్ పరిశ్రమ ఓ కుదుపు కుదపగలదని పరిశీలకుల అంచనా. 2015లో 11 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఆన్లైన్ రిటైల్ మార్కెట్ 2016 చివరికి 14–16 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం నాటికి 69 బిలియన్ డాలర్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా. -
అమెరికా, చైనాకు ట్రేడ్ వార్ తప్పదా?
బీజింగ్ : ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, డ్రాగన్ దేశానికి పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఏర్పడగా.. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సీఈవో జాక్ మా మాత్రం స్వదేశానికి గట్టి హెచ్చరికలే జారీచేస్తున్నారు. వివాదాలను సరైన స్థాయిలో పరిష్కరించుకోలేకపోతే, ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికాకు, చైనాకు ''బిగ్ ట్రేడ్ వార్'' తప్పదంటూ హెచ్చరించారు. ఇప్పటికే చైనీస్ ఎకానమీ తిరుగమన స్థాయిలో ఉందని, అంచనావేసిన దానికంటే క్లిష్టతరంగా పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే మూడు లేదా ఐదేళ్లు తమ ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని చెప్పారు. జనరల్ అసోసియేషన్ ఆఫ్ జెజియాంగ్ ఎంటర్‌ప్రిన్యూర్స్ సదస్సులో జాక్‌మా తన స్వదేశాన్ని తూర్పారా పట్టారు. గత రెండు దశాబ్దాల్లో కల్లా అత్యంత కనిష్ట స్థాయిలో గతేడాది చైనీస్ ఆర్థికవృద్ధి నమోదైంది. కేవలం 6.7 శాతం మాత్రమే ఈ దేశం వృద్ధిని నమోదుచేసింది. గత మూడు దశాబ్దాల క్రితం కొనసాగిన అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును ఇక మనం చూడలేమని ఆయన చెప్పారు. మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రిని అప్‌గ్రేడ్ చేసి మెరుగైన వృద్ధిపై దృష్టిసారించాలని చెప్పారు. అమెరికాతో సమస్యలను సరైన స్థాయిలో పరిష్కరించుకోవాలని సూచించారు. తమ ఉద్యోగాలను చైనీసులు కొట్టుకుని పోతున్నారంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి చైనాపై విరుచుకుపడుతున్న ట్రంప్, గెలవగానే తైవాన్ అధ్యక్షురాలితో సంభాషణలు జరిపారు. వన్ చైనా పాలసీపై విమర్శలు సంధించారు. దీనిపై చైనా ఇప్పటికే గుర్రుగా ఉంది. ట్రంప్ ట్రేడ్ వార్కి దిగితే, తాము చూస్తూ ఊరుకోబోమని చైనా సైతం హెచ్చరించింది. ఈ ప్రత్యారోపణ సమయంలోనే డ్రాగన్ దేశ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సీఈవో మాత్రం అమెరికా అధ్యక్షుడితో భేటీఅయ్యారు. ఈ భేటీలో అమెరికాకు ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు చైనాకు మరింత కోపం తెప్పించేలా తన స్వదేశానికే జాక్ మా హెచ్చరికలు జారీచేశారు. -
భారత్‌లో యూసీవెబ్ రూ. 120 కోట్ల పెట్టుబడులు
గ్వాంగ్జూ: ఆలీబాబా మొబైల్ బిజినెస్ గ్రూప్‌లో భాగమైన యూసీవెబ్ ..భారత్, ఇండొనేషియాల్లో రూ. 200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులో సుమారు 60 శాతం (దాదాపు రూ. 120 కోట్లు) భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ జీఎం కెనీ యీ తెలిపారు. బ్లాగ్లు, షార్ట్ వీడియోలు, సంప్రదాయేతర న్యూస్ ఫీడ్ మొదలైన వాటిని తమ యూసీ న్యూస్ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించారు. నియామకాలు, ఇతరత్రా వ్యాపారపరమైన వ్యయాలకు కాకుండా కేవలం కంటెంట్ రూపకల్పన, పంపిణీకే తాజా పెట్టుబడులు ఉపయోగించనున్నట్లు కెనీ తెలిపారు. ఇందుకోసం వుయ్ మీడియా ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెస్తున్నామని, ఎవరైనా ఇందులో నమోదు చేసుకుని...తమ కంటెంట్‌ను ప్రచురించుకోవచ్చని పేర్కొన్నారు. 2017లో వుయ్ మీడియా ప్లాట్‌ఫాంలో 30,000 మంది పైచిలుకు సెల్ఫ్ పబ్లిషర్స్, బ్లాగర్లు మొదలైన వారిని నమోదు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు కెనీ వివరించారు. అలాగే ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి భారత్‌లో ప్రస్తుతం 40గా ఉన్న తమ సిబ్బంది సంఖ్యను 100కి పెంచుకోనున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో 50 శాతం మేర పెంచుకోనున్నామని పేర్కొన్నారు. -
ఒలింపిక్స్‌కు మేజర్ స్పాన్సర్ ఆ కంపెనీనే!
ఏదైనా మేజర్ ఈవెంట్ నిర్వహించాలంటే దానికి కచ్చితంగా స్పాన్సర్స్ అవసరం. ఇటు స్పాన్సర్ కూడా తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవడానికి ఈవెంట్లను బాగా వాడుకుంటుంటాయి. ఒలింపిక్స్ లాంటి వరల్డ్ ఈవెంట్లకు ప్రధాన స్పాన్సర్‌గా చేజిక్కించుకోవడం అంటే మాటలా! అలాంటి ఈ ఒలింపిక్స్‌కు ప్రధాన స్పాన్సర్‌గా చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సొంతంచేసుకుంది. ఈ మేరకు ఇంటర్నేషన్ ఒలంపిక్ కమిటీ(ఐఓసీ)తో 2028 వరకు ఒలంపిక్ గేమ్స్‌కు ప్రధాన స్పాన్సర్‌గా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు ఐఓసీ, అలీబాబా గురువారం వెల్లడించాయి. అధికారికంగా అలీబాబా ఈ-కామర్స్, క్లౌడ్ సర్వీసు పార్టనర్‌తో పాటు12 ఇతర కంపెనీలు కూడా ఈసారి నిర్వహించబోయే ఒలంపిక్స్‌కు టాప్ స్పాన్సర్లగా ఉన్నట్టు ఇవి పేర్కొన్నాయి.. ఈ కంపెనీల్లో కోకా-కోలా, మెక్‌డొనాల్డ్స్ ఉన్నాయి. అయితే ఎంత మొత్తంలో ఈ స్పానర్షిప్ను అలీబాబా దక్కించుకున్నందో మాత్రం ఇవి వెల్లడించలేదు. ఐఓసీ వర్గాల ప్రకారం ప్రధాన స్పాన్సర్‌గా నిర్వహించేవారు ప్రతి నాలుగేళ్ల కాలానికి 100 మిలియన్ డాలర్లు(రూ.681కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. దీనిలోనే ఒక సమ్మర్, ఒక వింటర్ గేమ్స్ కలిసి ఉంటాయి. డిజిటల్ వరల్డ్‌లో ఇదో చరిత్రాత్మకమైన ఒప్పందమని ఐఓఎస్ ప్రెసిడెంట్ థామస్ బాచ్ తెలిపారు. ఒలింపిక్ మూమెంట్‌ను సమర్థవంతమైన సాంకేతిక రూపంలో ప్రదర్శించగలుగడానికి ఈ డీల్ ఎంతో సహకరిస్తుందని ఐఓసీ ఆశిస్తోంది. ఇటు కంపెనీకి ఇది ఎంతో సహకరిస్తుందని అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా తెలిపారు. -
3.4 బిలియన్ డాలర్లు పన్నులు చెల్లించిన అలీబాబా
3 కోట్ల మందికి ఉపాధి కల్పన బీజింగ్: చైనా ఈ–కామర్స్ దిగ్గజం ‘అలీబాబా గ్రూప్’ గతేడాది మొత్తంగా దాదాపు 3.41 బిలియన్ డాలర్లు పన్నుల రూపంలో చెల్లించింది. అలాగే 3 కోట్ల మందికి ఉపాధిని కల్పించింది. ఇక అలీబాబా ప్లాట్‌ఫామ్‌లోని వ్యాపారులు, తయారీదారులు, లాజిస్టిక్స్ కంపెనీలు 2016లో 200 బిలియన్ యువాన్లను పన్నులు రూపంలో చెల్లించాయి. ‘మేము, మా అనుబంధ సంస్థ ఏఎన్‌టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ గతేడాది మొత్తంగా 23.8 బిలియన్ యువాన్లను (3.41 బిలియన్ డాలర్లు= దాదాపు రూ.23,188 కోట్లు) పన్నుల రూపంలో చెల్లించాం. ఇది గతేడాది పోలిస్తే 33 శాతం అధికం’ అని అలీబాబా పేర్కొంది. కాగా అలీబాబా షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 45,000కు పైగా సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. వీరి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 142 శాతం మేర వృద్ధి చెందింది. -
'నాడు హార్వార్డ్ నన్ను పదిసార్లు వద్దంది'
చైనా: ప్రముఖ ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మరోసారి ఆన్లైన్లో దూసుకుపోతోంది. రెండుసార్లు ఎంత వైరల్ అయిందో ఇప్పుడు కూడా అంతేస్థాయిలో ఈ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. దావోస్‌లో అలీబాబా వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈ ఎఫ్) సంస్థకు 2015లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత అంశాలతోపాటు తన కంపెనీ విజయం సాధించడానికి గల కారణాలు వెల్లడించారు. ఆ వీడియోను మరోసారి డబ్ల్యూఈఎఫ్ ఫేస్బుక్లో పబ్లిష్ చేయగా మూడు నిమిషాల నిడివి ఉన్న ఇది కాస్త ఇప్పటికే దాదాపు 17.4మిలియన్లమందిని ఆకట్టుకుంది. ఇందులో జాక్ మా ఏం చెప్పారంటే.. 'నేను హర్వార్డ్ యూనివర్సిటీకి పదిసార్లు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించారు. చైనాలోని మా నగరానికి అప్పుడే కేఎఫ్‌సీ వచ్చింది. అందులో ఇంటర్వ్యూకు 24మంది వెళ్లాం. 23మందిని తీసుకొని ఒకరిని తిరస్కరించారు. ఆ ఒక్కడిని నేనే. నేను పెట్టిన అలీబాబా కంపెనీ విజయానికి కారణం మహిళలే. నా కంపెనీలో 47శాతంమంది మహిళలే ఉన్నారు. నాకు తొలుత ఈ ప్రపంచాన్ని మార్చాలి అనిపించేది. కానీ తర్వాత తెలుసుకున్నాను ముందు మారాల్సింది నేనే అని. అలాగే మారాను. ఈ రోజు నీ దగ్గర కొన్ని మిలియన్ల డాలర్ల డబ్బు ఉండొచ్చు. కానీ, ఆ డబ్బు ఈ సమాజమే ఇచ్చిందనే విషయం మర్చిపోవద్దు' అంటూ ఇలా ఎన్నో విషయాలు పంచుకున్న వీడియో ఇప్పుడు ఆన్లైన్లో తెగ హల్చల్ చేస్తోంది. -
అలీబాబా దోస్తీతో నెస్లే పరుగులు
చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో భాగస్వామ్యంలో ప్రపంచ అతిపెద్ద ఫుడ్ రిటైలర్ నెస్లే పరుగులు పెడుతోంది. ఆన్ లైన్ అమ్మకాలను పెంచుకోడానికి అలీబాబాతో భాగస్వామ్యాన్ని మొదలుపెట్టింది. కొత్త డిజిటల్ మార్కెటింగ్ విధానాలతో నెస్లే విభిన్న ఉత్పత్తులను అలీబాబాలో ఆవిష్కరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. కాఫీ నుంచి బేబీ ఫార్ములా వరకు 30 బ్రాండ్లను అలీబాబా ఫ్లాట్ ఫామ్ లో అమ్మకాలకు పెట్టనున్నట్లు తెలిపింది. వినియోగదారులను పెంచుకోడానికి అలీబాబాతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని ఆసియన్, ఓషియేసియన్, ఆఫ్రికన్ మార్కెట్లను పర్యవేక్షించే నెస్లే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెండ్ వాన్ లింగ్ మార్టె తెలిపారు. అంతర్జాతీయంగా అన్ని దేశాల కంటే చైనా మార్కెట్ ఆన్ లైన్ అమ్మకాల్లో ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే 150 ఏళ్ల మార్కెట్ వృద్ధికి చైనా మార్కెట్టే తగినదని.. సరి కొత్త మార్కెటింగ్ విధానాలను త్వరగా అర్థం చేసుకోవడంలో చైనా కస్టమర్లే ముందంజలో ఉన్నారని చెప్పారు. మ్యాగీ అమ్మకాలు మళ్లీ మార్కెట్లలోకి వచ్చాక, నెస్లే సంస్థ స్నాప్ డీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది చివర్లో అలీబాబాతోనూ భాగస్వామ్యం కుదుర్చుకుంది. చైనాలో సగం నెస్లే అమ్మకాలు ఆన్ లైన్ లోనే జరిగాయని కంపెనీ పేర్కొంది. చైనాలో ఆన్ లైన్ కొనుగోలు 2011 జనవరి నుంచి 2016 ఏప్రిల్ వరకు 12 రెట్లు పెరిగాయని, తలసరి వినియోగం కూడా 27శాతం పెరిగిందని అలీబాబా ఫైనాన్షియల్ సర్వీసు ప్లాట్ ఫామ్ యాంట్ ఫైనాన్షియల్, ప్రైవేట్ ఎకనామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. చాలా మంది యువత షాపింగ్ కు ఆన్ లైన్ నే ఆశ్రయిస్తున్నారని అలీబాబా సీఈవో ఝాంగ్ తెలిపారు. -
అలీబాబాలో వాటా విక్రయించనున్న సాఫ్ట్ బ్యాంక్
టోక్యో: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో ఉన్న తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నది సాఫ్ట్‌బ్యాంక్. రుణ భారం తగ్గించుకోవడం కోసం అలీబాబాలో ఉన్న వాటాలో దాదాపు 7.9 బిలియన్ డాలర్లకు సమానమైన భాగాన్ని విక్రయిస్తామని సాఫ్ట్‌బ్యాంక్ పేర్కొంది. సాఫ్ట్‌బ్యాంక్ ఇటీవల అమెరికాకు చెందిన మొబైల్ కంపెనీ స్ప్రింట్‌ను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం వంటి తదితర కారణాల వల్ల బ్యాంక్ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీని రుణ భారం మార్చి చివరి నాటికి 106 బిలియన్ డాలర్లుకు చేరినట్లు తెలుస్తోంది. అలీబాబాలోని పెద్ద షేర్హోల్డర్లలో సాఫ్ట్‌బ్యాంక్ కూడా ఒకటి. వాటా విక్రయం జరిగితే అలీబాబాలో 32.2%గా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ వాటా 28%కి తగ్గనున్నది. విక్రయించనున్న వాటాలో 2 బిలియన్ డాలర్ల విలువైన వాటాను అలీబాబానే కొనుగోలు చేసే అవకాశం ఉంది. -
గాలిలో మీ ఫోన్ ఫీచర్లు కనిపిస్తే..!
మన ఫోన్లోని ఫీచర్స్‌ని స్క్రీన్ మీద కాకుండా త్వరలో గాలిలో చూడబోతున్నామా? అంటే అవుననే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా వర్చువల్ స్ర్కీన్ పేరు విన్నారా? అదేనండీ ఎదురుగా కంటికి కనిపించకపోయినా సాఫ్ట్వేర్ సాయంతో చూపడం. ప్రస్తుతం పరిశోధనలో ఉన్న ఈ టెక్నాలజీని ఉపయోగించే మేజిక్ లీప్ అనే అమెరికన్ స్టార్టప్ మనకు కావలసినప్పుడు అవసరమైన చోట దీన్ని ఉపయోగించుకునేలా తయారుచేయడానికి నిర్ణయించుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో గాలిలోనే యాప్స్ సాయంతో వర్క్, ఆన్లైన్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ తదితరాలను చేసుకోవడం ఉంది. ఈ వీడియో అంతా ఒక గదిలోనే చిత్రించడం వల్ల పగటిపూట ఎలా పనిచేస్తుందోననే అనుమానాలూ ఉన్నాయి. అయితే, కంపెనీ దీని గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా ప్రకటించకపోయినా కళ్లజోడు లేక కాంటక్ట్ లెన్స్‌లను ఉపయోగించడం వల్ల పగటిపూట కూడా ఈ టెక్నాలజీని వాడేందుకు ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇది మైక్రోసాఫ్ట్ 2015లో విడుదల చేసిన హాలోగ్రామ్(కాంతితో ఏ ఆకారన్నయినా తయారుచేసుకోవడం)ను పోలినట్లుగా ఉంది. ఇప్పటికే గూగుల్ ఈ టెక్నాలజీ మీద పరిశోధనలు చేస్తూ 3డి కళ్లజోడు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి 2015లోనే విడుదల కావాల్సిన గూగుల్ కళ్లజోడుకు మరికొన్ని ఫీచర్స్‌ను జతచేసేందుకు ఆ పనిని విరమించుకుంది. ప్రస్తుతం గూగుల్‌తో పాటు ఆలీబాబా, క్వాల్కామ్లు ఈ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. -
పనిరాక్షసుడి పనిష్మెంట్ ఇంత ఘోరమా!
ప్రపంచంలోనే క్రూరమైన పనిరాక్షసులు ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకునేముందు మిగతావాళ్లు ఏవిధంగా పనిచేస్తున్నారో చూద్దాం. 'వారం ఐదు నాళ్లు శ్రమకే జీవితం.. చివరి రెండు రోజులు ప్రకృతికి అంకితం' అంటూ అమెరికా లాంటి పశ్చిమదేశాల్లో ఉద్యోగాలు ఎంత హాయిగాచేసుకోవచ్చో వివరిస్తారు 'కొలంబస్.. కొలంబస్'పాటలో. ఇక మన దేశంలో పనిదినాలు వారానికి ఆరురోజులైనా ఆదివారాన్ని మాత్రం మన నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. 'త్వరలోనే ఐదు రోజుల పనివిధానాన్ని అమలులోకి తెస్తాం' అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం మరో సంతోషకరమైన విషయం. ఇక భూగోళానికి తూర్పున ఉండే జపాన్, చైనాలంటారా.. పనిలో రాక్షసత్వాన్ని సాధ్యమైనంత ఎక్కువస్థాయిలో ప్రదర్శిస్తుంటాయి. ప్రధానంగా చైనీయులు 'ప్రపంచంలోనే ఘోరమైన పనిరాక్షసులు' అని పేరు తెచ్చుకున్నారు. వాళ్ల పనివిధానం ఎంత కఠినంగా ఉంటుందో ఈ కామర్స్ దిగ్గజం జాక్ మా జీవితకథలో మరోసారి వెల్లడైంది. ప్రదేశం నుంచి 15 నిమిషాల దూరంలో ఉంటున్నాడని ఓ ఉద్యోగిని నిర్ధాక్షణ్యంగా పనిలో నుంచి తీసేశాడట పనిలో రాక్షసుడైన జాక్ మా! ఏదైనా కంపెనీలో పనిచేస్తే దానికి దగ్గరలోనే నివసించాలనే నిబంధనను చైనా కంపెనీలు ఎప్పటినుంచో అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. 1999లో ఈ కామర్స్ స్టార్ట్ అప్ గా ప్రారంభమైన ఆలీబాబా కంపెనీ అనతికాలంలోనే 200 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిందంటే దానికి ఆ సంస్థ సీఈవో జాక్ మా పనిరాక్షసత్వమే కారణమట. జాక్ మా జీవితంపై రచయిత డీకన్ క్లార్క్ రాసిన 'ఆలీబాబా: ద హౌస్ దట్ జాక్ మా బిల్ట్' అనే పుస్తకంలో ఈ కఠిన వాస్తవాలు వెల్లడయ్యాయి. 'రోజుకు కనీసం 21 గంటలు పనిచేసే అలీబాబా ఉద్యోగులు తాము నివసించే ప్రదేశం ఆఫీస్ నుంచి కేవలం పదంటే పది నిమిషాల దూరంలో ఉండాలనే నిబంధన కఠినంగా అమలయ్యేది. 15 నిమిషాల దూరంలో ఉంటున్నాడన్న కారణంతో సంస్థలో మొదటిగా చేరిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలిగించారు. ఈ కామర్స్ రంగంలో టైమ్ చాలా విలువైనది. అందుకే మా సంస్థలో పనిచేసేవారికి ఆఫీసుల్లోనే భోజనాలు వగైరా ఏర్పాట్లు చేస్తుంటాం. 24 గంటలూ ఉద్యోగులు మాకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కాల్ చేసినా అటెండ్ చేయాల్సిందే. అయితే కంపెనీ లాభాలబాట పట్టాక దశలవారీగా ఆ కఠిన నిబంధనలను ఎత్తేశాం' అని కంపెనీ ప్రారంభంలో మేనేజ్ మెంట్ ఎంత కఠినంగా ఉండేదో వివరిస్తారు అలీబాబా అధికార ప్రతినిధి. ఇప్పుడు మళ్లీ చెప్పండి.. ప్రపంచంలోనే క్రూరమైన పనిరాక్షసులు ఎవరు? -
వాల్‌మార్ట్ ను దాటనున్న ఆలీబాబా
బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ ప్లాట్‌ఫాంగా అమెరికా సంస్థ వాల్‌మార్ట్‌ను.. చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా త్వరలోనే అధిగమించగలదని అంచనాలు నెలకొన్నాయి. మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 463.3 బిలియన్ డాలర్ల ట్రేడింగ్ పరిమాణం సాధిస్తామని ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ తెలిపింది. జనవరి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం వాల్‌మార్ట్ నమోదు చేసిన 478.6 బిలియన్ డాలర్ల నికర అమ్మకాలకు ఇది దాదాపు సమీపంలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వాల్‌మార్ట్‌ను ఆలీబాబా అధిగమించే రోజు దగ్గర్లోనే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 2020 నాటికల్లా తమ వార్షిక ట్రేడింగ్ పరిమాణం దాదాపు 980 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగదలని అంచనా వేస్తున్నట్లు ఆలీబాబా సీఈవో ఝాంగ్ యాంగ్ తెలిపారు. -
అలీ బాబా ఒక రోజు అమ్మకాలు రూ.91 వేల కోట్లు
బీజింగ్: చైనా ఈ కామర్స్ జెయింట్ అలీబాబా గ్రూప్ తన రికార్డును తానే బద్ధలుకొట్టేసుకుంది. గత ఏడాది ఒక రోజు జరిపిన అమ్మకాలకన్న ఈ ఏడాది ఒకే రోజు రికార్డు శాతంలో అమ్మకాలు జరిపి దాదాపు 50శాతం అధిక ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఈ సంస్థ ఒకరోజు ఆన్ లైన్ ద్వారా దాదాపు 9.3 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించగా ఈసారి దానిని అధిగమించి 13.8 బిలియన్ డాలర్లు(దాదాపు.రూ.91,00,00,00,000) అమ్మకాలు జరిపి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని చైనాకు చెందిన బీడీఏ అనే సంస్థ చైర్మన్ డంకన్ క్లార్క్ స్పష్టం చేశారు. 'చైనా ఈ కామర్స్ మార్కెట్ లో అలిబాబా నంబర్ వన్ స్థానంలో నిల్చుంది. దీనిని అలాగే కొనసాగించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం' అని అలీ బాబా ప్రతినిథులు తెలిపారు. 'మరో ఐదేళ్లలోగా చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థగా మారనుంది. ఏరకమైనా వస్తువునైనా ఎగుమతి చేసే సామర్థ్యంతో ఉంటుంది' అని మైఖెల్ ఈవాన్స్ అనే అలీ బాబా ప్రతినిధి వివరించారు. మిగితా సంస్థలు కూడా తమతో పోటీ పడి ఆన్ లైన్ విక్రయాలు జరుపుతున్నా అవి స్పష్టతను కొనసాగించడంలో విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. -
అలీబాబా సినిమా ఫ్యాక్టరీ
బీజింగ్: ఈ కామర్స్ రంగంలో చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్‌కు చెందిన సినిమా రంగ సంస్థ అలీబాబా పిక్చర్స్. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు తీయాలనే ఆసక్తి గల వారికి శిక్షణ ఇవ్వడానికి ఫిల్మ్ మేకర్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పనుంది. దీనికోసం 1 బిలియన్ యువాన్లను వెచ్చించడానికి అలీ బాబా గ్రూప్ మరో రెండు సంస్థలతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. గతంలో చైనా విజన్ మీడియా పేరుతో కార్యకలాపాలు నిర్వహించిన అలీ బాబా పిక్చర్స్ ప్రస్తుతం చైనాలోనే ఎక్కువ మార్కెట్ విలువగల ఫిల్మ్ కంపెనీ. దీని మార్కెట్ విలువ 9.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంస్థలో శిక్షణ పొందడానికి ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంపై ఆసక్తి గల 45 సంవత్సరాలలోపు గల వారిని అర్హులుగా తెలిపింది. ఈ శిక్షణ సంస్థలో ఆస్కార్ అవార్డ్ గ్రహితలతో పాటు ప్రముఖ హాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు శిక్షణ నిర్వహించనున్నారు. యానిమేషన్, ఫిల్మ్ డిజైన్, స్పెషల్ ఎఫెక్ట్స్ తదితర అంశాలలో శిక్షణ కొనసాగనుంది. అడుగు పెట్టిన ప్రతిరంగంలో దూసుకుపోతున్న ఆలీ బాబా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగ ప్రియులు ఉత్సాహం చూపిస్తారనడంలో సందేహం లేదు. -
స్నాప్‌డీల్‌లో రూ.3,269 కోట్ల తాజా పెట్టుబడులు
సాఫ్ట్‌బ్యాంక్, ఆలీబాబా, ఫాక్స్‌కాన్ నుంచి నిధులు న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ తాజాగా 50 కోట్ల డాలర్లు(రూ.3,269 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా, తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ఫాక్స్‌కాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ల నుంచి ఈ నిధులు సమీకరించామని స్నాప్‌డీల్ తెలి పింది. ఇప్పటికే తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన టిమసెక్, బ్లాక్‌రాక్, మైరాయిడ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ల నుంచి కూడా ఈ తాజా రౌండ్ నిధుల సమీకరణలో పెట్టుబడులు వచ్చాయని స్నాప్‌డీల్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన కునాల్ బహాల్ చెప్పారు. ఇప్పటికే ఈ సంస్థ వంద కోట్ల డాలర్లుకు పైగా పెట్టుబడులను సాఫ్ట్బాంక్(62.7 కోట్ల డాలర్లు), పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాల నుంచి రాబట్టింది. కాగా పెట్టుబడి వివరాలను స్నాప్‌డీల్ వెల్లడించలేదు. అయితే ఫాక్స్‌కాన్‌కు చెందిన ఎఫ్ఐహెచ్ మొబైల్ సంస్థ స్నాప్‌డీల్‌లో 4.27 శాతం వాటాను 20 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశామని పేర్కొంది. ఈ లెక్కన స్నాప్‌డీల్ విలువ 400-500కోట్ల డాలర్లు(రూ.25,200-31,500 కోట్లు) ఉంటుందని అంచనా. -
మైక్రోమాక్స్ ప్రమోటర్లకు జాక్‌పాట్!
మొబైల్ అమ్మకాల్లో దూసుకెళుతున్న దేశీ దిగ్గజం మైక్రోమాక్స్.. త్వరలో చేతులు మారనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం టాప్‌గేర్‌లో ఉండటంతో ఇదే అవకాశంగా మంచి రేటుకు విక్రయించి బయటపడేలా ప్రమోటర్లు ప్రణాళికలు వేస్తున్నారు. కంపెనీకి ప్రస్తుతం రూ.21,000 కోట్ల వేల్యుయేషన్ లభించినట్లు సమాచారం. కేవలం మొబైల్స్‌ను అసెంబుల్ చేసి విక్రయించే దేశీ కంపెనీకి ఇంత భారీ విలువ రావటం... మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ⇒వాటా విక్రయానికి తహతహ.. ⇒కంపెనీ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా ⇒సాధ్యమైతే పూర్తిగా కంపెనీని అమ్మేసే ప్రణాళిక! ⇒అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు దేశీ మొబైల్స్ మార్కెట్లో మైక్రోమాక్స్ ఒక కెరటం. శామ్సంగ్ లాంటి దిగ్గజాలతో పోటీగా సెల్ఫోన్లను హాట్‌కేకుల్లా అమ్మేస్తున్న ఈ కంపెనీ ప్రమోటర్లు... సరైన భాగస్వామి లభిస్తే కొంత వాటాను విక్రయించాలని, లేదంటే పూర్తిగా వేరొకరికి అమ్మేసి కంపెనీ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే ప్రపంచ ఈ-కామర్స్ అగ్రగామి అలీబాబా, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం కంపెనీ విలువను ప్రమోటర్లు 3-3.5 బిలియన్ డాలర్లుగా (గరిష్టంగా రూ.21,000 కోట్లు) లెక్కగట్టారు. ఇది 2013-14లో మైక్రోమాక్స్ ఆదాయానికి 2.5-2.9 రెట్లు కావడం గమనార్హం. ఐదేళ్లలో 14 రెట్లు జూమ్... మైక్రోమాక్స్ వాటా విక్రయంతో అటు ప్రమోటర్లతో పాటు పెట్టుబడిపెట్టిన ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లకు కూడా లాభాల పంట పండనుంది. ప్రస్తుతం ప్రమోటర్ల తర్వాత మైక్రోమాక్స్‌లో టీఏ అసోసియేట్స్ 15 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. 2010లో ఈ కంపెనీ రూ.225 కోట్లను పెట్టుబడిగా పెట్టి బోర్డులో చోటు దక్కించుకుంది. అప్పటి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మైక్రోమాక్స్ వేల్యుయేషన్ రూ.1,500 కోట్లు మాత్రమేనని అంచనా. ఇప్పుడు ఏకంగా దీనికి 14 రెట్ల విలువను ప్రమోటర్లు ఆశిస్తుండటం గమనార్హం. సెకోయా క్యాపిటల్, శాండ్‌స్టోన్ క్యాపిటల్‌తో పాటు మాడిసన్ ఇండియా క్యాపిటల్‌కు స్వల్ప వాటాలున్నాయి. చైనాకు చెందిన స్ప్రెడ్ట్రమ్ కమ్యూనికేషన్స్ కోటి డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ప్రమోటర్ల అంచనా ప్రకారం సంస్థ అమ్ముడుపోతే ఇన్వెస్టర్లకు బొనాంజా తగిలినట్లే. పదిహేనేళ్ల ప్రస్థానం... 2000వ సంవత్సరంలో నోకియా కంపెనీకి మొబైల్ విడిభాగాల సరఫరాదారుగా మైక్రోమాక్స్ ప్రస్థానం మొదలైంది. రాహుల్ శర్మ, రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్... ఈ నలుగురూ దీన్ని ఏర్పాటు చేశారు. 2008లో హ్యాండ్సెట్ విక్రయాల్లోకి అడుగుపెట్టింది. అనేక ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ హ్యాండ్సెట్లను చౌక రేటుకు అందించడంతో మైక్రోమాక్స్‌కు విశేష ఆదరణ లభించింది. తర్వాత స్మార్ట్ఫోన్లలోనూ వేగంగా కొత్త మోడళ్లను పరిచయం చేయడం కంపెనీకి కలిసొచ్చింది. ప్రస్తుతం నెలకు 30 లక్షలకుపైగా హ్యాండ్సెట్లను విక్రయిస్తోంది. ఇందులో స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతంగా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా దాదాపు 80 శాతం. అంటే తాజా వేల్యుయేషన్ ప్రకారం ఈ నలుగురికీ రూ.16,000 కోట్లకుపైగా లభిస్తాయి. మరోవంక మొబైల్స్ రంగంలో ఉద్ధండులైన ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవడం ద్వారా వాటా విక్రయానికి ముందు బ్రాండ్ విలువను మరింత పెంచుకునేలా కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. భారతీ ఎయిర్టెల్ సీఈఓ సంజయ్ కపూర్, శామ్సంగ్ ఇండియా మొబైల్ హెడ్ వినీత్ తనేజా తదితరులు గతేడాది మైక్రోమాక్స్‌లో చేరారు. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,100 కోట్లను సమీకరించేందుకు సన్నాహాలు కూడా చేశారు. అయితే, ఇప్పుడు ప్రమోటర్లు ఐపీఓ కంటే వ్యూహాత్మక భాగస్వామి లేదా పూర్తి వాటా విక్రయంపైనే దృష్టిపెడుతున్నట్లు సమాచారం. భవిష్యత్తు వృద్ధి పథంలో కంపెనీని ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్(కంపెనీ) చేతికి అప్పగించాలనేది ప్రమోటర్ల వ్యూహంగా చెబుతున్నారు. ⇒ భారత్‌లో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి మొబైల్ ఫోన్ కంపెనీగా... డ్యుయల్ సిమ్ ఫోన్లను దేశంలో ప్రవేశపెట్టిన తొలి హ్యాండ్సెట్ సంస్థగా మైక్రోమాక్స్ నిలిచింది. ⇒ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో సైనోజెన్ ఓఎస్‌తో(యురేకా బ్రాండ్) తొలిసారిగా చౌక 4జీ ఫోన్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. ⇒ భారత్‌లో పెట్టుబడులకు ఉరకలేస్తున్న అలీబాబా... ఇటీవలే ఎం-కామర్స్ దిగ్గజం పేటీఎంలో 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దేశీ మార్కెట్లోకి నేరుగా అడుగుపెట్టింది. ⇒ సాఫ్ట్‌బ్యాంక్ కూడా వచ్చే కొన్నేళ్లలో భారతీయ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల్లో 10 బిలియన్ డాలర్లను వెచ్చించే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే స్నాప్‌డీల్, హౌసింగ్.కామ్, ఓలా క్యాబ్స్ తదితర కంపెనీల్లో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులుపెట్టింది. ⇒ దాదాపు ఏడాది క్రితం భారత్‌లోకి అడుగుపెట్టిన చైనా ‘యాపిల్’ షియోమి ప్రస్తుత వేల్యుయేషన్ 45 బిలియన్ డాలర్లుగా అంచనా. 2012లో దీని విలువ 4 బిలియన్ డాలర్లే. -
భారత్‌లోకి అలీబాబా ఎంట్రీ
పేటీఎంలో 25 శాతం వాటా కొనుగోలు... * వన్97 సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం.. * డీల్ విలువ రూ. 3,000 కోట్ల పైనే! న్యూఢిల్లీ: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం, చైనాకు చెందిన అలీబాబా... భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ షాపింగ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మొబైల్ కామర్స్, చెల్లింపుల సేవల సంస్థ పేటీఎంను ఇందుకు వేదికగా ఎంచుకుంది. పేటీఎం మాతృ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌లో 25 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు అలీబాబా గ్రూప్‌లో భాగమైన యాంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో మొబైల్ పేమెంట్, మొబైల్ కామర్స్ విభాగంలో వృద్ధికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని తెలిపింది. కాగా, ఈ డీల్ విలువ ఎంతనేది ఇరు సంస్థలూ వెల్లడించనప్పటికీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 50 కోట్ల డాలర్లకుపైగా (రూ.3,000 కోట్ల పైమాటే) ఉండొచ్చని అంచనా. దీనిప్రకారం చూస్తే వన్97 కంపెనీ విలువ(వేల్యుయేషన్) రూ. 12,000 కోట్లుగా లెక్కతేలుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో అలీబాబా అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్(నాస్డాక్)లో లిస్టింగ్ ద్వారా 25 బిలియన్ డాలర్లను సమీకరించడం తెలిసిందే. తద్వారా ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓగా కూడా కొత్త రికార్డు సృష్టించింది. భారత్‌లో తొలి పెట్టుబడి... భారతీయ కంపెనీల్లో ఇదే తమ తొలి పెట్టుబడి అని యాంట్ ఫైనాన్షియల్ వెల్లడించింది. ఈ నిధులను పేటీఎం.. తమ మొబైల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరించేందుకు, ఎం-కామర్స్ కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఉపయోగించనుందని వివరించింది. పే టీఎం బిజినెస్‌కు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతికపరమైన తోడ్పాటుకు కూడా అందించనున్నట్లు యాంట్ ఫైనాన్షియల్ వైస్ ప్రెసిడెంట్ సైరిల్ హన్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘100 కోట్లకుపైగా జనాభా కలిగిన భారత్‌లోని మొబైల్ పేమెంట్ మార్కెట్లో అపార అవకాశాలున్నాయి. ఇక్కడ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అంతకంతకూ పెరుగుతున్నారు. ఎం-కామర్స్, పేమెంట్స్‌కు ఇది అత్యంత సానుకూలాంశం. అందుకే ఈ రంగంలో అత్యుత్తమ సంస్థగా నిలుస్తున్న పే టీఎంను వ్యూహాత్మక పెట్టుబడి కోసం ఎంచుకున్నాం’ అని హన్ వివరించారు. యాంట్, పే టీఎంల భాగస్వామ్యంతో మొబైల్ వాలెట్ విభాగంలో భారతీయ కస్టమర్లకు మరింత అత్యుత్తమ సేవలను అందించేందుకు దోహదం చేయనుందని, కస్టమర్లను గణనీయంగా పెంచుకునేందుకు వీలవుతుందని వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. ఈ డీల్‌కు సిటీ, గోల్డ్‌మన్ శాక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా వ్యవహరించాయి. పేటీఎం సంగతిదీ: మొబైల్ ఫోన్ కస్టమర్లకు విలువ ఆధారిత సేవలు అందించే సంస్థగా వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్థానం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దీని ప్రధాన బ్రాండ్ పేటీఎం. 2009లో ఈ పోర్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిం ది. దీని ద్వారా తొలుత ఆన్లైన్లో రీచార్జ్ సేవలను మొదలుపెట్టింది. ఈ విభాగంలో పే టీఎం భారత్‌లో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం మొబైల్ కామర్స్‌తో పాటు ఇతర ఆన్లైన్ షాపింగ్ సంస్థలకు మొబైల్ ద్వారా చెల్లింపుల ప్రొవైడర్‌గా వ్యవహరిస్తోంది. వన్97లో ఇప్పటికే సెయిఫ్ పార్ట్నర్స్, సఫైర్ వెంచర్స్, సామా క్యాపిటల్, ఇంటెల్ క్యాపిటల్ వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 1,000 మందికిపైగా ఉద్యోగులు వన్97లో పనిచేస్తున్నారు. కాగా, గతేడాది అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా భారత్‌కు వచ్చిన సందర్భంగా ఇక్కడి టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్స్‌కు తోడ్పాటునందిస్తామని.. భారతీయ కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పే టీఎం రూపంలో ఇది సాకారమైంది. 2014 అక్టోబర్‌లో అలీబాబా గ్రూప్ ఏర్పాటు చేసిన యాంట్ ఫైనాన్షియల్స్... చైనాలో అతిపెద్ద మొబైల్ పేమెంట్ సేవల సంస్థ ‘అలీ పే వాలెట్’ను నిర్వహిస్తోంది. దీనికి 19 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు అంచనా. చిన్న స్థాయి సంస్థల(ఎస్ఎంఈ)పై కూడా ఎక్కువగా దృష్టిపెడుతోంది. -
భారత్ పై అలీబాబా కన్ను..!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో జగజ్జేతగా దూసుకెళ్తున్న చైనా దిగ్గజం అలీబాబా... భారత్ ఆన్లైన్ మార్కెట్‌పై దృష్టి సారిస్తోంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడంతోపాటు టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్లతో కలిసి పనిచేస్తామని అలీబాబా వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ జాక్ మా పేర్కొన్నారు. భారత్‌లో తొలి పర్యటనలో భాగంగా బుధవారమిక్కడ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అలీబాబా కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూతో రికార్డు సృష్టించి 25 బిలియన్ డాలర్ల మొత్తాన్ని సమీకరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 300 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. చిన్న వ్యాపారులకు అండదండలు... ‘ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అపార అవకాశాలున్న నవ వ్యాపారం. అంతేకాదు ఇది యువత నైపుణ్యంతో దూసుకెళ్తున్న వ్యాపారం కూడా. కోట్లాది మంది యువశక్తితో తొణికిసలాడుతున్న గొప్ప దేశం భారత్. నేను పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడిగా పనిచేశా. ఇంటర్నెట్ అనేది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. భారత్ రూపురేఖలను కూడా ఇదే ఇంటర్నెట్ సమూలంగా మార్చేయగలదని నేను కచ్చితంగా చెప్పగలను. అందుకే ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు నేను కట్టుబడి ఉన్నా. భారతీయ ఔత్సాహిక వ్యాపారవేత్తలు(ఎంట్రప్రెన్యూర్స్), టెక్నాలజీ సంస్థలు, నిపుణులతో కలిసి పనిచేస్తా’ అని జాక్ మా పేర్కొన్నారు. అనేక భారతీయ వ్యాపార సంస్థలు తమ వెబ్సైట్లలో సెల్లర్లుగా నమోదై ఉన్నారని.. భారత్‌కు చెందిన చాక్లెట్లు, సుగంధ ద్రవ్యాలు, టీ ఇతరత్రా ఉత్పత్తులను 4 లక్షలకు పైచిలుకు చైనా కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మరిన్ని అద్భుత ఉత్పత్తులను చైనాకు విక్రయించే సత్తా భారత్ ఉందని కూడా జాక్ మా అభిప్రాయపడ్డారు. స్నాప్‌డీల్‌లో వాటాపై కన్ను! భారత్ పర్యటనలో ఇక్కడి స్థానిక వ్యాపారులతో జాక్ మా భేటీ కానున్నారు. తద్వారా మరిన్ని భారతీయ ఉత్పత్తులను అలీబాబా ద్వారా విక్రయించేందుకు వీలుకల్పించనున్నారు. అదేవిధంగా దేశీ ఈ-కామర్స్ మార్కెట్లోకి కూడా అడుపెట్టే సన్నాహాల్లో అలీబాబా ఉంది. ప్రస్తుతం భారత్‌లో ఆన్లైన్ పరిశ్రమ జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. దేశీ కంపెనీ అయిన స్నాప్‌డీల్‌లో అలీబాబా ఇన్వెస్ట్‌చేసే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. చైనా అపర కుబేరుడు... 50 ఏళ్ల జాక్ మా.. కంపెనీ పబ్లిక్ ఇష్యూ తర్వాత చైనా అపర కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద విలువ 24.4 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.1,50,000 కోట్లు)గా అంచనా. 1999లో అలీబాబాను చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని అయిన హోంగ్ఝూలో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఆయన నెలకొల్పారు. రీసెర్చ్ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం అలీబాబా ప్రపంచలోనే అతిపెద్ద ఆన్లైన్, మొబైల్ కామర్స్ కంపెనీగా అవతరించింది. 2013 సంవత్సరంలో కంపెనీ స్థూల లావాదేవీల విలువ(జీఎంవీ) ఆధారంగా దీన్ని నిర్ణయించారు. కాగా, చైనా రిటైల్ మార్కెట్లో ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదికి అలీబాబా గ్రూప్ వెబ్సైట్లకు 30.7 కోట్ల మంది వార్షిక యాక్టివ్ కొనుగోలుదారులు నమోదయ్యారు. నెలవారీ యాక్టివ్ కస్టమర్లు కూడా 21.7 కోట్లకు పెరిగినట్లు ఐడీసీ అంచనా. అలీబాబా పేరు వెనుక... అలీబాబా.. అరేబియన్ జానపద కథల్లో సుప్రసిద్ధమైన ఈ పేరును ఒక చైనా కంపెనీ వాడుకోవడమేంటి? దీని వెనుక పెద్ద కథే ఉంది. పేరు గురించి జాక్ మా ఏమన్నారంటే... ‘అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక కాఫీ షాపులో ఉండగా.. ఈ పేరును నా కంపెనీకి పెడితే చాలా బాగుంటుందని భావించా. వెంటనే అక్కడ వెయిట్రెస్‌ను పిలిచి అలీబాబా ఎవరో నీకు తెలుసా అంటే వెంటనే అవునని సమాధానం చెప్పింది. ఏం తెలుసని అడిగా. ‘ఓపెన్ సెసేమ్(అలీబాబా నలభై దొంగలు కథలో నిధి ఉన్న గుహను తెరిచేందుకు వాడే మంత్రం)’ అని చెప్పింది. అప్పుడే అనుకున్నా ఇదే సరైన పేరని. ఆతర్వాత ఆ వీధిలోని మరో 30 మందిని కూడా ఈ పేరు గురించి వాకబు చేశా. ఇందులో జర్మన్లు, భారతీయులు, జపనీస్, చైనీస్ ఇలా అన్ని దేశాలవారూ ఉన్నారు. వాళ్లంతా కూడా తమకు తెలుసనే చెప్పారు. ఇది సులభంగా పలికేందుకు వీలుండటమేకాకుండా.. ప్రపంచమంతటికీ పరిచయం ఉన్న పేరు కాబట్టే మా వెబ్‌సైట్‌కు దీన్ని ఖాయం చేశాను. మా దృష్టిలో అలీబాబా... ఓపెన్ సెసేమ్ అంటే.. చిన్న వ్యాపార సంస్థలకు ఇదో నిధి, గేట్‌వే లాంటిదని అర్థం.’ అని వివరించారు. మోదీపై ప్రశంసల జల్లు... భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై జాక్ మా ప్రశంసలు కురిపించారు. ‘మోదీ ప్రసంగాన్ని నేను విన్నా. చాలా ఉత్తేజభరితంగా, స్ఫూర్తినింపేలా ఉంది. ఒక వ్యాపారవేత్తగా నేను కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. గొప్ప దేశాలైన భారత్, చైనా కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అందుకు ఇదే సరైన సమయం. ఇరు దేశాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు కూడా ఇది గొప్ప అవకాశంగా నిలుస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
ఎంటర్ ద ‘డ్రాగన్’...
అలీబాబా రికార్డు లిస్టింగ్ * అమెరికాలో అతి పెద్ద ఐపీఓగా చరిత్ర * ఐపీఓ ధర 68; 92.70 డాలర్ల వద్ద లిస్ట్ * మార్కెట్ క్యాప్ 200 బిలియన్ డాలర్ల పైకి న్యూయార్క్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.... అమెరికా స్టాక్ మార్కెట్లో చరిత్రలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) రికార్డును సొంతం చేసుకుంది. ఒక్కో షేరుకు 68 డాలర్ల ఆఫర్ ధర చొప్పున 21.8 బిలియన్ డాలర్లను(రూ.1,30,800 కోట్లు) సమీకరించింది. శుక్రవారం న్యూయార్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్(నాస్డాక్)లో ఏకంగా 92.70 డాలర్లకు కంపెనీ షేరు లిస్ట్ కావడంతో ఈ షేర్లను దక్కించు కున్న ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. ఐపీఓ ద్వారా మొత్తం 32 కోట్ల షేర్లను ఆఫర్ చేశారు. లిస్టింగ్ ప్రారంభ ధర ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్-మొత్తం షేర్ల విలువ) తొలిరోజే 228 బిలియన్ డాలర్లను (రూ.13,68,000 కోట్లు) తాకడం విశేషం. ఆఫర్ ధర ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ 168 బిలియన్ డాలర్లు. వీసా, ఫేస్‌బుక్‌లు వెనక్కి... ఇప్పటిదాకా అమెరికా స్టాక్ మార్కెట్లో విసా ఇన్కార్పొరేటెడ్ అతిపెద్ద ఐపీఓగా నిలుస్తూ వస్తోంది. 2008లో ఐపీఓకి వచ్చిన ఈ కంపెనీ 19.7 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఇక 2012లో వచ్చిన ఫేస్బుక్ ఐపీఓ సమీకరణ విలువ 16 బిలియన్ డాలర్లు. ఫేస్ బుక్ ఒక్కో షేరును గరిష్టంగా 38 డాలర్లకు ఆఫర్ చేయగా.. లిస్టింగ్ రోజున షేరు ధర గరిష్టంగా 45 డాలర్లకు ఎగసింది. చివరకు 38 డాలర్ల స్థాయిలోనే ముగిసింది. దీని ప్రకారం ఫేస్బుక్ మార్కెట్ విలువ 104 బిలియన్ డాలర్లు(రూ.6,24,000 కోట్లు). తాజాగా(లిస్టింగ్‌కు రెండేళ్ల తర్వాత) ఈ కంపెనీ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లను అధిగమించడం తెలిసిందే. అయితే, అలీబాబా ఐపీఓ లిస్టింగ్ తొలి రోజే 200 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించడం విశేషం. ఇప్పటిదాకా ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓగా చైనాకు చెందిన అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా నిలిచింది. ఇప్పుడు రెండో అతిపెద్ద ఐపీఓగా కూడా చైనా కంపెనీ అలీబాబాయే నిలవడం విశేషం. 2010లో హాంకాంగ్ మార్కెట్లో లిస్టయిన అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా... 22.1 బిలియన్ డాలర్లను సమీకరించింది. కాగా, ఇప్పటిదాకా అమెరికాలోని టెక్నాలజీ ఐపీఓల్లో ఫేస్బుక్ నంబర్ వన్ స్థానంలో నిలుస్తూవస్తుండగా... దీన్ని కూడా అలీబాబా వెనక్కినెట్టింది. కాగా, నాస్డాక్లో ‘బాబా’ పేరుతో అలీబాబా స్టాక్ ట్రేడవుతోంది. మరోపక్క, మార్కెట్ విలువ పరంగా ప్రపంచ టెక్నాలజీ కంపెనీల్లో నాలుగో స్థానానికి అలీబాబా చేరింది. తొలి మూడు స్థానాల్లో యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కొనసాగుతున్నాయి. యాహూకి జాక్‌పాట్.. అమెరికాలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)గా చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా రికార్డు సృష్టిస్తే.. అందులో కీలక వాటాదారుగా ఉన్న యాహూ కంపెనీ బంపర్ జాక్పాట్తో బిలియన్లకొద్దీ డాలర్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఐపీఓ లిస్టింగ్ ద్వారా గరిష్టంగా 140 మిలియన్ షేర్లకుపైగా విక్రయించిన యాహూకి సుమారు 8.3-9.5 బిలియన్ డాలర్ల మొత్తం(పన్ను చెల్లింపునకు ముందు) లభించనున్నట్లు అంచనా. ఐపీఓలో వాటా విక్రయం తర్వాత కూడా యాహూ అలీబాబాలో దాదాపు 16 శాతం వాటాను(దాదాపు 40 కోట్ల షేర్లు) కొనసాగించనుంది. అపార్ట్మెంట్ నుంచి అగ్రస్థానానికి.. * చైనాలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా వెలుగొందుతున్న అలీబాబాను చైనా ఎంట్రప్రెన్యూర్ జాక్ మా... హాంగ్ఝూలోని చిన్న అపార్ట్మెంట్ కేంద్రంగా ప్రారంభించారు. * 1999లో తొలిసారిగా అలీబాబా.కామ్ పేరుతో ఈ-కామర్స్(బిజినెస్ టు బిజినెస్.. అంటే ఉత్పత్తిదారులకు, ట్రేడర్లకు అనుసంధానకర్తగా) పోర్టల్‌ను మొదలుపెట్టారు. * చైనాలోని ఆన్లైన్ షాపింగ్ మార్కెట్లో అలీబాబా వాటా ఇప్పుడు 80%కిపైనే. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ స్థాయికి ఎగబాకింది కూడా. * అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఈ-బేల మొత్తం స్థూ అమ్మకాల విలువ కంటే జూన్‌తో ముగిసిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో అలీబాబా అమ్మకాల విలువే(276 బిలియన్ డాలర్లు) ఎక్కువ. * కాగా, 2013-14 ఏడాది(మార్చి 31తో ముగిసిన)లో కంపెనీ నికర లాభం 3.77 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం ఆదాయం 8.46 బిలియన్ డాలర్లలో లాభం 44.7%. * కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్న జాక్ మా(49 ఏళ్లు) ప్రస్తుతం వాటా 9 శాతంగా ఉంది. ఆఫర్ షేరు ధర 68 డాలర్ల ప్రకారం దీని విలువ 10 బిలియన్ డాలర్లుగా అంచనా. * ఐపీఓ ద్వారా 12.8 మిలియన్ షేర్లను మా విక్రయించారు. దీని విలువ(షేరుకి 68 చొప్పున) 86.7 కోట్ల డాలర్లుగా అంచనా.