అలీబాబా సినిమా ఫ్యాక్టరీ
బీజింగ్: ఈ కామర్స్ రంగంలో చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్కు చెందిన సినిమా రంగ సంస్థ అలీబాబా పిక్చర్స్. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు తీయాలనే ఆసక్తి గల వారికి శిక్షణ ఇవ్వడానికి ఫిల్మ్ మేకర్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ను నెలకొల్పనుంది. దీనికోసం 1 బిలియన్ యువాన్లను వెచ్చించడానికి అలీ బాబా గ్రూప్ మరో రెండు సంస్థలతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. గతంలో చైనా విజన్ మీడియా పేరుతో కార్యకలాపాలు నిర్వహించిన అలీ బాబా పిక్చర్స్ ప్రస్తుతం చైనాలోనే ఎక్కువ మార్కెట్ విలువగల ఫిల్మ్ కంపెనీ. దీని మార్కెట్ విలువ 9.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ సంస్థలో శిక్షణ పొందడానికి ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంపై ఆసక్తి గల 45 సంవత్సరాలలోపు గల వారిని అర్హులుగా తెలిపింది. ఈ శిక్షణ సంస్థలో ఆస్కార్ అవార్డ్ గ్రహితలతో పాటు ప్రముఖ హాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు శిక్షణ నిర్వహించనున్నారు. యానిమేషన్, ఫిల్మ్ డిజైన్, స్పెషల్ ఎఫెక్ట్స్ తదితర అంశాలలో శిక్షణ కొనసాగనుంది. అడుగు పెట్టిన ప్రతిరంగంలో దూసుకుపోతున్న ఆలీ బాబా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగ ప్రియులు ఉత్సాహం చూపిస్తారనడంలో సందేహం లేదు.