Jack Ma's Surprise Visit To Pakistan Ignites Speculation - Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో

Published Mon, Jul 3 2023 9:28 AM | Last Updated on Mon, Jul 3 2023 9:52 AM

Jack Ma Surprise Visit To Pakistan - Sakshi

చైనా అపర కుబేరుడు, అలీబాబా వ్యవస్తాపకుడు జాక్‌మా పాకిస్తాన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ ఇంగ్లీష్‌ మీడియా సంస్థ ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ తెలిపింది.  పాక్‌లో జాక్‌మా అడుగు పెట్టినట్లు బోర్డ్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (boi) మాజీ ఛైర్మన్‌ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ చెప్పినట్లు పాక్‌ మీడియా సంస్థ వెల్లడించింది. 

జాక్‌మా పాక్‌కు రాకముందు జూన్‌ 27న నేపాల్‌ రాజధాని ఖాట్మండూ తర్వాత బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలలో పర్యటించారు. ఇలా వరుస పర్యటనలతో మా ప్రపంచ దేశాల్లో చర్చాంశనీయంగా మారారు. నేపాల్, బంగ్లాదేశ్‌లలో పర్యటనలలో ఈ చైనా అపర కుబేరుడితో పాటు మరో ఏడుగురు వ్యాపార వేత్తలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఐదుగురు చైనా పౌరులు, ఒకరు యూరప్‌ దేశమైన డెన్మార్క్‌కు చెందిన డానిష్‌ వ్యక్తి, మరొకరు అమెరికా దేశస్తుడు ఉన్నట్లు తెలిపాయి.

తాజాగా, స్విర్జర్లాండ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే విమానయాన సంస్థ జెట్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ ఫ్లైట్‌ వీపీ-సీఎంఏలో పాకిస్తాన్‌కు చేరుకున్నారు. జూన్‌ 29న లాహోర్‌లో అడుగు పెట్టిన జాక్‌మా 24 గంటల పాటు అక్కడే ఓ ప్రైవేట్‌ ప్రాంతంలో గడిపారు. అనంతరం, అదే విమానంలో ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లారు.  

మీడియాలో అనేక ఊహాగానాలు
జాక్‌మా,అతని బృందం పాకిస్తాన్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు పర్యటించినట్లు అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇందులో భాగంగా బిజినెస్‌ చేసేందుకు అనువైన ప్రాంతాల గురించి ఆరాతీయడంతో పాటు, ఆ దేశంలో వ్యాపార వేత్తలతో భేటీ, వివిధ వాణిజ్య ఛాంబర్‌ల అధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, నిర్దిష్ట వ్యాపార ఒప్పందాలు,సమావేశాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. 

ఆయన వ్యక్తిగతమే 
జాక్‌మా పర్యటన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని బోవోఐ మాజీ ఛైర్మన్‌ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ ట్వీట్‌ చేశారు. మా’ పర్యటన చైనా రాయబార కార్యాలయ అధికారులకు కూడా తెలియదని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

చైనాపై విమర్శలు చేసి
ఈ-కామర్స్‌, టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రముఖ వాణిజ్య వేత్తగా జాక్‌మా సుపరిచితులు. అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో జరిగిన ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో చైనా రెగ్యులేటరీ సిస్టంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో  చైనా అధికారులు జాక్‌మాను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు. ఆయన  కంపెనీలపై చైనా దర్యాప్తు సంస్థలు వరుసగా దాడులు చేశాయి. ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ప్రభుత్వ ఆగ్రహంతో అలీబాబా, యాంట్‌ గ్రూప్‌ తీవ్రంగా నష్టపోయాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో 2021 చివర్లో జాక్‌మా చైనాను వీడారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏడాది పాటు బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన చైనా బిలియనీర్‌ ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ దేశాల్లో అప్పుడప్పుడు కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు వరుస ప్రపంచ దేశాల పర్యటనలతో జాక్‌మా భవిష్యత్‌లో ఏం చేయనున్నారోనని ప్రపంచ దేశాల వ్యాపార వేత్తలు, దేశాది నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చదవండి : ఎవరీ లలితాజీ.. సర్ఫ్‌ ఎక్సెల్‌ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement