China's Alibaba Sack Woman Employee Over Sexual Assault Allegations: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కామ పిశాచాలపై చర్యలకు ఉపక్రమించకపోగా.. వాళ్లకు అనుగుణంగా మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తోంది. పైగా ఉద్యోగుల మీదే రివెంజ్ తీర్చుకుంటోంది. ఆమధ్య తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి ఆరోపించగా.. ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఉద్యోగంలోంచి ఆ యువతిని తొలగించింది కంపెనీ. పైగా ఆమె ఆరోపణలు అవాస్తవమంటూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది.
చైనా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబాను లైంగిక ఆరోపణల పర్వం కుదిపేస్తోంది. ప్రతీ ఏడాది ఆరోపణల కేసులు పెరిగిపోతున్నాయి. గత ఆగష్టులో ఓ ఉద్యోగిణి అత్యాచార ఆరోపణలతో మీడియాకు ఎక్కగా.. ఇప్పుడు ఆ యువతికి షాక్ ఇచ్చింది అలీబాబా. తప్పుడు ప్రచారంతో కంపెనీ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని, అందుకే ఆమెను తొలగిస్తున్నాం అంటూ ప్రకటించింది అలీబాబా.
ఇదిలా ఉంటే ఓ బిజినెస్ ట్రిప్ సందర్భంగా మేనేజర్ లెవల్ అధికారి(మిస్టర్ వాంగ్!), ఓ క్లయింట్ బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసింది సదరు యువతి. కానీ, కంపెనీ నుంచి స్పందన రాలేదు. దీంతో తోటి ఉద్యోగుల మద్ధతుతో ఆమె ‘స్క్రీన్ షాట్స్’ ఉద్యమాన్ని నడిపించింది. ఆ టైంలో ఆమెకు అండగా నిలిచిన పది మంది ఉద్యోగుల్ని డిస్మిస్ చేసేసింది అలీబాబా కంపెనీ.
ఈ నిర్ణయంపై విమర్శలు వెత్తడంతో తగ్గిన అలీబాబా గ్రూప్.. ఆ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి చేర్చుకుంది. అంతేకాదు బాధితురాలికి తాత్కాలిక ఉపశమనం ఇస్తూ.. నిందితుడిపై వేటు వేసింది. (అదే సమయంలో అతడిపై పెట్టిన క్రిమినల్ కేసును సైతం ఎత్తేయించింది.. క్లయింట్ మీద మాత్రం దర్యాప్తు కొనసాగించింది). ఇక యువతి ఫిర్యాదుపై సకాలంలో స్పందించని మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌ను సస్పెండ్ కూడా చేసింది.
లైంగిక ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే.. బాధితురాలిని అర్ధాంతరంగా ఉద్యోగంలోంచి తొలగించింది అలీబాబా గ్రూప్. ఆమెవి కేవలం ఆరోపణలే అని , కంపెనీ పేరు ప్రతిష్టలను బజారుకీడ్చిందంటూ చెబుతూ తాజాగా సదరు ఉద్యోగిణిపై వేటు వేసింది అలీబాబా. మరోవైపు చర్యలు తీసుకున్న అధికారుల్ని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
మొత్తం రెండున్నర లక్షల ఉద్యోగులు పని చేస్తున్న అలీబాబా కంపెనీలో.. కిందటి ఏడాది యాభై మందికిపైగా ఉద్యోగిణులు.. తమ హెడ్‌లపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం విశేషం. ఈ ఏడాది లైంగిక వేధింపుల ఫిర్యాదులు 75 పైనే వచ్చాయి. ఇంకోవైపు తోటి ఉద్యోగుల నుంచి వేధింపులపై సుమారు 1,500 దాకా ఫిర్యాదు అందినట్లు స్థానిక మీడియా ఒకటి కథనం వెలువరించింది. చైనా ప్రభుత్వానికి భయపడే.. ఇలాంటి ఫిర్యాదులపై చర్యలకు కంపెనీ అధినేత జాక్ మా వెనకంజ వేస్తున్నాడంటూ విమర్శలూ వినిపిస్తున్నాయి.
సంబంధిత కథనం: రేప్ విక్టిమ్‌కు అండగా పోస్టులు.. పది మంది అలీబాబా ఎంప్లాయిస్ డిస్మిస్
Comments
Please login to add a commentAdd a comment