చైనా కుబేరుడు జాక్ మాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. జిన్‌పింగ్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో అక్కడి సర్కారుకు టార్గెట్‌గా మారిపోయారు. ప్రభుత్వం కక్ష‍్య సాధింపు చర్యలతో జాక్ మా పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. తాజాగా, జాక్‌మా అధినేతగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాంట్ గ్రూప్‌కు డ్రాగన్ కంట్రీ 1 బిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని తప్పని సరిగా చెల్లించాల్సిందేనని హెచ్చరించింది. ఇంతకీ జిన్‌పింగ్ జాక్‌మాపై కక్ష పెంచుకోవడానికి అసలు కారణాలేంటీ?
అలిబాబా సహ వ్యవస్థాపకుడు, యాంట్ గ్రూప్ అధినేత జాక్‌మాపై జిన్‌పింగ్ ఆంక్షలు విధించడంతో ఆయన జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది. కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోనూ ఉండాల్సి వచ్చింది. అయితే, అంత అకస్మాత్తుగా ఆయన్ని ప్రభుత్వం టార్గెట్ చేయడానికి ఓ బలమైన కారణం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
అదే ఆయన పాలిట శాపమా
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే ఏదైనా ఒక్క పొరపాటు లేదా తప్పుడు నిర్ణయం కూడా మనిషిని ఉన్నత శిఖరాల నుంచి అగాధంలోకి నెట్టేస్తుంది. అపర కుబేరుడు జాక్ మా విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్‌తో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ కోటాను కోట్లు వెనకేసుకున్న దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవాలనే బుద్ధి పుట్టింది. అదే ఆయన పాలిట శాపమైంది.
జిన్‌పింగ్‌కు మింగుడు పడలేదు
2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడమే జాక్ మా కొంపముంచింది. చైనా ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే ట్రంప్‌తో భేటీ అయ్యారు. అంతేకాదు, అమెరికాలో 10లక్షల ఉద్యోగాలు సృష్టస్తామని హామీలిచ్చారు. అది సరిపోదున్నట్లు చైనాలో జరిగే ఓ బిజినెస్ సమ్మిట్‌లో దేశ ఆర్ధిక వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపారు. ఇదిగో ఈ తరహా ధోరణే చైనా పాలకులకు ఏమాత్రం మింగుడుపడలేదు. పైగా చైనాను కట్టడి చేసేలా అనేక చర్యలు తీసుకుంటున్న ట్రంప్‌ను కలవడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అదిగో అప్పటి నుంచి జాక్‌మాను చైనా ప్రభుత్వం వేధిస్తూ వస్తుంది.
రోజుకు 7వేల కోట్ల నష్టం
యాంట్ ఐపీవోను అడ్డుకుంది.టెక్నాలజీ, స్థిరాస్థి, గేమింగ్, విద్య, క్రిప్టోకరెన్సీ ఇలా అన్నీ వ్యాపారాలను ఆంక్షలతో కుదేలయ్యేలా చేసింది. ఏడాది తిరిగే లోపు దాదాపు రూ.25లక్షల కోట్లు నష్టపోయారు. అంటే రోజుకు రూ.7వేల కోట్లన్న మాట. అందుకే చైనాలో ప్రభుత్వాన్ని ఎదిరించి మనుగడ సాధించడం కష్టం. ఈ విషయం తెలుసుకున్న జాక్‌మా జిన్ పిన్ ప్రభుత్వంతో రాజీ పడ్డారు. దేశాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే
కానీ చైనా ప్రభుత్వం జాక్‌ను కనికరించలేదు. సరికాదా కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో జాక్‌మాకు చైనా ప్రభుత్వం ఫైన్ విధించింది. జరిమానా విధించినా..భవిష్యత్‌లో జాక్ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే వాదన వినిపిస్తుంది. చైనా టాప్ సెక్యూరిటీ రెగ్యులేటర్ పరిశ్రమలపై ఆంక్షల విధించే సమయం ముగియనుంది. కాబట్టే ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘలన పేరుతో జాక్ మాపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. మా’ 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని షరతు పెట్టింది.
ఊరట కలిగేనా
2020లో యాంట్‌పై అణిచివేత తర్వాత, దాని మాతృ సంస్థ అలీబాబా రికార్డు స్థాయిలో 2.8 బిలియన్ల యాంటీట్రస్ట్ పెనాల్టీని విధించిన డ్రాగన్ కంట్రీ అధికారులు. దీంతో పాటు రైడ్-హెయిలింగ్ కంపెనీ దీదీకి సైతం 1.2 బిలియన్ల జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం జాక్‌మాకు ఊరట కల్పిస్తుందా? లేదంటే మరింత ఇబ్బందులు పెడుతుందా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment