China Disappeared: High-profile Figures Missing In China, Here Are Figures Who Went Off Radar - Sakshi
Sakshi News home page

Missing Celebrities Of China: అదృశ్యం అంటే.. ఇక అంతే

Published Fri, Jul 28 2023 4:51 AM | Last Updated on Fri, Jul 28 2023 9:23 AM

China disappeared: high-profile Figures Missing In China - Sakshi

బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్‌లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్‌గాంగ్‌ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్‌ యీని విదేశాంగ  మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్‌గాంగ్‌ ఆచూకీపై మౌనం పాటించింది.  

చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్‌గాంగ్‌ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్‌ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది.

కొన్ని సమావేశాలకు వాంగ్‌ యీ హాజరయ్యారు. చైనా సోషల్‌ మీడియాలో నెటిజన్లు చిన్‌గాంగ్‌ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్‌ అన్న సందేశమే వస్తోంది. హాంగ్‌కాంగ్‌కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర సంబంధమే చిన్‌గాంగ్‌ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది.

ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్‌గాంగ్‌ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె  కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్‌గాంగ్‌కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్‌గాంగ్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు.

అదృశ్యమైన ప్రముఖులు వీరే  
హు జింటావో  
చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్‌లో చైనీస్‌ కాంగ్రెస్‌ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్‌ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్‌లో చైనా నాయకుడు జియాంగ్‌ జెమిన్‌ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు.  

జాక్‌ మా  
చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్‌ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్‌ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది.

బావో ఫ్యాన్‌  
చైనాకు చెందిన టెక్నాలజీ డీల్‌ మేకర్‌ బావో ఫ్యాన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్‌ హోల్డింగ్స్‌ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు.

గువో గ్వాంగ్‌చాంగ్‌  
2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో ఫోసన్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ చైర్మన్‌ గువో గ్వాంగ్‌చాంగ్‌  ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్‌బాల్‌ క్లబ్‌కి యజమాని కూడా అయిన గ్వాంగ్‌చాంగ్‌ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి.

రెన్‌ జికియాంగ్‌  
చైనాలో రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌ రెన్‌ జికియాంగ్‌ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు.  

ఫ్యాన్‌ బింగ్‌బింగ్‌
రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్‌ బింగ్‌బింగ్‌ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్‌ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్‌బింగ్‌ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్‌లు జరిమానా చెల్లించారు.

పెంగ్‌ షూయీ  
చైనా టెన్నీస్‌ క్రీడాకారిణి పెంచ్‌ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారి జాంగ్‌ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్‌లో ఉన్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement