VVIPS
-
అదృశ్యం అంటే.. ఇక అంతే
బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్‌లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్‌గాంగ్ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్‌గాంగ్ ఆచూకీపై మౌనం పాటించింది. చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్‌గాంగ్‌ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది. కొన్ని సమావేశాలకు వాంగ్ యీ హాజరయ్యారు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చిన్‌గాంగ్ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్ అన్న సందేశమే వస్తోంది. హాంగ్‌కాంగ్‌కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర సంబంధమే చిన్‌గాంగ్ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్గాంగ్ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్‌గాంగ్‌కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్‌గాంగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు. అదృశ్యమైన ప్రముఖులు వీరే హు జింటావో చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్‌లో చైనీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు. జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది. బావో ఫ్యాన్ చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు. గువో గ్వాంగ్‌చాంగ్ 2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ గువో గ్వాంగ్‌చాంగ్ ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్‌బాల్ క్లబ్‌కి యజమాని కూడా అయిన గ్వాంగ్‌చాంగ్‌ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. రెన్ జికియాంగ్ చైనాలో రియల్ ఎస్టేట్ టైకూన్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఫ్యాన్ బింగ్‌బింగ్ రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్ బింగ్‌బింగ్ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్‌బింగ్ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్లు జరిమానా చెల్లించారు. పెంగ్ షూయీ చైనా టెన్నీస్ క్రీడాకారిణి పెంచ్ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారి జాంగ్ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్‌లో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వివిఐపిల కోసం ఎయిర్ ఇండియా వన్
-
వీవీఐపీల రహస్య పర్యటనలకు చెక్..!
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రముఖులకు ఇచ్చే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నిబంధనలను కేంద్ర హోం శాఖ తాజాగా సవరించింది. ఇప్పటి నిబంధనల ప్రకారం వీవీఐపీలు ఇక నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఎస్పీజీ సిబ్బంది వారిని నీడలా వెన్నంటి ఉండాల్సిందే. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1985లో ఎస్పీజీని ఏర్పాటు చేశారు. భారత పార్లమెంటును రక్షించడానికి ఈ బృందాన్ని అంకితం చేస్తూ పార్లమెంటు 1988 లో ఎస్పీజీ చట్టాన్ని ఆమోదించింది. తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన ఎస్పీజీ రక్షణను 1989 లో విపీ సింగ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మాజీ ప్రధాని కుటుంబ సభ్యుల హోదాలో రాహుల్ గాంధీకి ఎస్పీజీ భద్రత ఉంది. అనునిత్యం ఆయనకు భద్రతా కమాండోలు రక్షణ కల్పిస్తుంటారు. అలాంటిది కనీసం ప్రస్తుతం వారిని కూడా తనతో విదేశాలకు రానివ్వడం లేదు. ఉన్నట్లుండి మాయమవడం.. అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. ఎక్కడ తిరుగుతారో ఎవరికీ తెలియనివ్వకపోవడం.. ఇది కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల తీరు..! రాహుల్ గాంధీ కాంబోడియా పర్యటన నిమిత్తం వెళ్లిన నేపథ్యంలో వీవీఐపీల భద్రతా నిబంధనలను ప్రభుత్వం సవరించడం చర్చనీయాంశమైంది.ఇప్పటిదాకా విదేశాలకు వెళ్తే ఎస్పీజీ సిబ్బందిని కొన్ని ప్రదేశాలకు వారితో రాకుండా వీవీఐపీలు నియంత్రించే వారు. కానీ సవరించని నిబంధనల కారణంగా ఇక ప్రతిక్షణం వీవీఐపీల వెన్నంటే ఉండనున్నారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తీసుకొంటున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఎస్పీజీ సిబ్బందిని అనుమతించకపోతే వారి విదేశీ పర్యటనలను ఇక నుంచి కేంద్రం నియంత్రించే అవకాశం ఉంది. గాంధీ కుటుంబీకులు ఇప్పటి దాకా విదేశాలకు వెళ్లినపుడు వారు మొదట గమ్యస్థానం చేరేవరకు ఎస్పీజీ సిబ్బంది వారిని అనుసరిస్తూ రక్షణ కల్పించేవారు. అక్కడినుంచి ఎస్పీజీ సిబ్బందిని వెనక్కి పంపి వారు వెళ్లాల్సిన ప్రదేశాలకు వెళ్లి పర్యటనలు ముగించకొని వచ్చేవారు. అలా చేసే కొన్ని సందర్భాలో వీరు భద్రతాపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సవరించిన భద్రతా నియమాల కారణంగా వీవీఐపీల రహస్య పర్యటనలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. -
వీవీఐపీల వాహనాలకూ ఇవి తప్పనిసరి..
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్లకూ రిజిస్ర్టేషన్ నెంబర్లు విధిగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. వారితో పాటు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల వాహనాలకూ రిజిస్ర్టేషన్ నెంబర్లను డిస్ప్లే చేయాలని, సంబంధిత అథారిటీ వద్ద రిజిస్టర్ చేయించాలని పేర్కొంది. అత్యున్నత రాజ్యాంగ పదవులు నిర్వర్తించే వారి వాహనాలపై కేవలం ఇండియా ఎంబ్లమ్కు బదులు రిజిస్ట్రేషన్ నెంబర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు వెల్లడించింది. రిజిస్ర్టేషన్ నెంబర్‌కు బదులు నాలుగు సింహాలతో కూడిన దేశ ఎంబ్లమ్‌ను ప్రదర్శిస్తుండటంతో ఆయా పదవులు చేపడుతున్న వారు ఉగ్రవాదులకు సులభంగా టార్గెట్ అవుతున్నారని ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఎంబ్లమ్ ఉన్న వాహనాలను వీవీఐపీల వాహనాలుగా భావించి పోలీసు అధికారులు పరిశీలించని కారణంగా నేరపూరిత కార్యకలాపాల కోసం ఉగ్రవాదులు, నేరస్తులు ఈ వాహనాలను దుర్వినియోగపరిచే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. ఇక రిజిస్ర్టేషన్ నెంబర్ చూపని వాహనాలు చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టేనని కోర్టుకు నివేదించారు. -
మిస్టరీ మాల్వేర్ : వీవీఐపీల ఐఫోన్లే టార్గెట్
హైదరాబాద్ : ఇటీవల మాల్వేర్ వైరస్లు ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయో చూస్తున్నాం. వ్యక్తిగత డేటాలను చోరి చేస్తూ.. మాల్వేర్లు విజృంభిస్తున్నాయి. తాజాగా భారత్‌లో 13 ఐఫోన్లపై అనుమానిత అప్లికేషన్ దాడి చేసిందట. డేటాను, సమాచారాన్ని ఆ అప్లికేషన్ దొంగలించేసింది. 13 ఐఫోన్లే కదా..! లక్షల ఫోన్ల మాదిరి చెప్పారేంటి అనుకుంటున్నారా? కానీ చోరికి గురైనా ఆ ఐఫోన్లు వీవీఐపీలవి అంట. వీవీఐపీ స్మార్ట్ఫోన్లను టార్గెట్ చేసి, ఓ మిస్టరీ మాల్వేర్ అటాక్ చేసినట్టు సిస్కో టాలోస్ కమర్షియల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ మాల్వేర్ రీసెర్చర్లు, అనాలిస్టులు బహిర్గతం చేశారు. అయితే ఈ వీవీఐపీలు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. భారత్‌లో ఉండే ఈ దాడి జరిపిన అటాకర్, రష్యాలో ఉన్నట్టు నమ్మిస్తున్నట్టు సిస్కో నిపుణులు చెప్పారు. రష్యన్ పేర్లు, ఈమెయిల్ డొమైన్లను ఇతను వాడుకున్నట్టు పేర్కొన్నారు. దాడికి రెండు వ్యక్తిగత డివైజ్‌లను వాడిన అటాకర్, భారత్‌లో వొడాఫోన్ నెట్‌వర్క్‌తో రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నెంబర్‌ను వాడినట్టు చెప్పారు. ఓపెన్ సోర్స్ మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎండీఎం)ను ఫోన్లలోకి చొప్పించి, ఆ 13 డివైజ్‌లలోకి అటాకర్ ఎన్రోల్ అయినట్టు టాలోస్ ఇంటెలిజెన్స్ నిపుణులు తమ బ్లాగ్‌లో రివీల్చేశారు. వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్‌లోకి ఫీచర్లను యాడ్ చేయడం కోసం పలు టెక్నికల్స్‌ను వాడటం, టార్గెట్ చేసిన డివైజ్‌లలోకి ఎండీఎం చెందిన టెలిగ్రామ్‌ను చొప్పించడం ద్వారా ఈ దాడికి పాల్పడినట్టు సిస్కో మాల్వేర్ రీసెర్చర్ ఆడ్రూ విలియమ్స్, మాల్వేర్ అనాలిస్ట్ పౌల్ చెప్పారు. మాల్వేర్, టార్గెట్ చేసిన ఐఫోన్ డివైజ్‌ల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను సేకరించడం, ఎస్ఎంఎస్లను, యూజర్ల ఫోటోలను, కాంటాక్ట్‌లను, లొకేషన్, సీరియల్ నెంబర్, ఫోన్ నెంబర్ లాంటి సమాచారాన్ని దొంగలించడం చేసిందని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని బ్లాక్మెయిల్ లేదా అవినీతికి ఉపయోగిస్తున్నట్టు లైనక్స్/యునిక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆన్లైన్ కమ్యూనిటీ నిక్స్క్రాఫ్ట్ చెప్పినట్టు టాలోస్ రీసెర్చ్ కోట్ చేసింది. దీని బారిన పడిన ఐఓఎస్ డివైజ్ యూజర్లకు కనీసం దీని గురించే అర్థం కాదని చెప్పింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ ఆపరేషన్‌ను కనీసం గుర్తించలేకపోయామని చెప్పారు. ‘ఐఫోన్ ప్రమాదబారిన పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ మాల్వేర్ ప్రభావితం బారిన పడటం తక్కువగా నమోదవుతుంటుంది. దీనిలో యూజర్ల తప్పిదం కూడా ఉంటుంది. అటాకర్లు సోషల్ ఇంజనీరింగ్ వాడుకుని ఐఫోన్లలోకి చొప్పించి ఉంటారు’ అని తెలంగాణ సీఐడీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు యూ రామ్మోహన్ చెప్పారు. -
మూడు రకాల భోజనాలు
- వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక మెనూ - శంకుస్థాపననాడు ఇదీ సంగతి సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపనకు వచ్చే వారి కోసం ప్రభుత్వం మూడు కేటగిరీల భోజనాలను తయారు చేయిస్తోంది. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకమైన మెనూ, రైతులు, ప్రజలకు సాధారణ మెనూ ఖరారు చేశారు. దేశవిదేశాల నుంచి వచ్చే అత్యంత ముఖ్యులకు(వీవీఐపీ) ప్రత్యేకమైన తెలుగు సంప్రదాయ వంటకాలను రుచి చూపించనున్నారు. ఒక్కో భోజనం ఖర్చు రూ.1,250 చొప్పున 1,000 మంది కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. వీఐపీల కేటగిరీలో 10,000 మందికి మరో ప్రత్యేకమైన మెనూను ఆర్డర్ ఇచ్చింది. ఈ భోజనానికి రూ.650 వంతున చెల్లిస్తారు. నిజానికి వీఐపీల కేటగిరీలో 1,500 మందికి ఆహ్వానాలు పంపారు. ఆ సంఖ్య కొంత పెరిగినా ఇబ్బంది లేకుండా వేదిక ముందు 2,000 సీట్లను కేటాయిస్తున్నారు. ఈ కేటగిరీలో 10వేల భోజనాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇందుకు రూ.77.5 లక్షలు ఖర్చు కానుంది. లక్షన్నర మందికి సాధారణ భోజనం శంకుస్థాపన కార్యక్రమానికి లక్షన్నర మంది రైతులు, ప్రజలు హాజరవుతారని అంచనా. వీరికి సాధారణ భోజనమే అందించనున్నారు. ఒక్కో భోజనానికి రూ.150 చొప్పున చెల్లిస్తున్నారు.సాధారణ భోజనాలకు రూ.2.25 కోట్లు ఖర్చవుతోంది. అంటే మొత్తం భోజనాల కోసం ప్రభుత్వం రూ.3 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది.