సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్లకూ రిజిస్ర్టేషన్ నెంబర్లు విధిగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. వారితో పాటు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల వాహనాలకూ రిజిస్ర్టేషన్ నెంబర్లను డిస్‌ప్లే చేయాలని, సంబంధిత అథారిటీ వద్ద రిజిస్టర్ చేయించాలని పేర్కొంది. అత్యున్నత రాజ్యాంగ పదవులు నిర్వర్తించే వారి వాహనాలపై కేవలం ఇండియా ఎంబ్లమ్‌కు బదులు రిజిస్ట్రేషన్ నెంబర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు వెల్లడించింది.
రిజిస్ర్టేషన్ నెంబర్‌కు బదులు నాలుగు సింహాలతో కూడిన దేశ ఎంబ్లమ్‌ను ప్రదర్శిస్తుండటంతో ఆయా పదవులు చేపడుతున్న వారు ఉగ్రవాదులకు సులభంగా టార్గెట్ అవుతున్నారని ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఎంబ్లమ్ ఉన్న వాహనాలను వీవీఐపీల వాహనాలుగా భావించి పోలీసు అధికారులు పరిశీలించని కారణంగా నేరపూరిత కార్యకలాపాల కోసం ఉగ్రవాదులు, నేరస్తులు ఈ వాహనాలను దుర్వినియోగపరిచే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. ఇక రిజిస్ర్టేషన్ నెంబర్ చూపని వాహనాలు చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టేనని కోర్టుకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment