రోడ్లపై నిత్యం విభిన్న రకాల వాహనాలను గమనిస్తుంటాం. అందులో కొన్ని వెహికిల్స్ నంబర్‌ప్లేట్లు(Number Plate) సాధారణంగా కాకుండా భిన్నంగా ఉంటాయి. వాటిపై నంబర్లు, రంగులో తేడా ఉండడం గమనిస్తుంటాం. కొన్ని నంబర్‌ప్లేట్లు తెలుపు రంగులో ఉంటే, మరికొన్ని ఆకుపచ్చ రంగులో, ఇంకొన్ని పసుపు రంగులో.. ఇలా వేర్వేరుగా ఉంటాయి. అయితే ఒక్కో రంగు ప్లేట్ వాహనానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
తెలుపు రంగు ప్లేట్
ఈ ప్లేట్లను వాణిజ్యేతర వాహనాలకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఎక్కువగా ఇలాంటి నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు కనిపిస్తాయి. తెలుపు రంగు ప్లేట్‌పై నలుపు అక్షరాలుంటాయి. ఇది ప్రైవేట్ యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఈ వాహనాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించలేరు.
ఆకుపచ్చ నంబర్ ప్లేట్
పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్(Green Plate) నంబర్ ప్లేట్లు కేటాయించారు. అవి తెల్లని అక్షరాలను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, ఈ-రిక్షాలు, బస్సులు వంటి ఎలక్ట్రిక్ వాహనాలకు దీన్ని ఉపయోగిస్తారు.
పసుపు రంగు ప్లేట్
పసుపు రంగు ప్లేట్‌పై నలుపు అక్షరాలుంటాయి. ఈ ప్లేట్లు కలిగి ఉన్న వాహనాలను అద్దె కోసం ఉపయోగించుకోవచ్చు.
బ్లూ నంబర్ ప్లేట్
విదేశీ దౌత్యవేత్తలు ఉపయోగించే వాహనాలకు తెలుపు అక్షరాలతో బ్లూ కలర్ ప్లేట్లు కేటాయిస్తారు.
ఎరుపు రంగు ప్లేట్
ఎరుపు రంగు ప్లేట్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్న వాహనాన్ని సూచిస్తుంది. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ సాధారణంగా ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది.
పైకి బాణం ఉన్న నంబర్ ప్లేట్
ఈ ప్లేట్‌లు సైనిక వాహనాలకు చెందినవి. వాహనం కొనుగోలు చేసిన సంవత్సరంతో పాటు పైకి సూచించే బాణాన్ని కలిగి ఉంటాయి. ఈ నంబరింగ్ సిస్టమ్ రక్షణ మంత్రిత్వ శాఖకు(Defence) ప్రత్యేకమైంది.
జాతీయ చిహ్నంతో ఎరుపు రంగు ప్లేట్
భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు ఉపయోగించే వాహనాలు భారత జాతీయ చిహ్నంతో కూడిన ఎరుపు పలకను కలిగి ఉంటాయి.
ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?
భారత్ నంబర్ ప్లేట్
రాష్ట్రాల మధ్య తరచుగా ప్రయాణించే వారి కోసం వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకునేందుకు వీలుగా భారత్ నంబర్ ప్లేట్‌ను 2021లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వేరే రాష్ట్రానికి వెళ్లేటప్పుడు మళ్లీ రిజిస్టర్ చేయవలసిన అవసరం ఉండదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, దేశ వ్యాప్తంగా బహుళ కార్యాలయాలు కలిగిన కంపెనీల్లో పని చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment