న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్‌లో వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన కేసు దర్యాప్తును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు యాక్టింగ్ సీజే మన్మోహన్, జస్టిస్ తుషార్‌రావులతో కూడిన ధర్మాసనం సూచించింది.
ఇంత పెద్ద ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని సమాజానికి భరోసా ఇచ్చేందుకే కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు విద్యార్థులు భవనం కింద వరద నీటిలో మునిగి మృతి చెందడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.
ఇంకా నయం.. వరద నీటిని అరెస్టు చేయలేదు..
విధులు సరిగా నిర్వహించకపోవడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు మందలించింది. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులను విచారించకుండా ఘటన జరిగిన సమయంలో కోచింగ్‌సెంటర్ పక్కనుంచి వెళ్లిన కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేయడమేంటని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టింది. దయతలచి భవనం కిందకు వచ్చిన వరద నీటిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టారని పోలీసులపై కోర్టు సెటైర్లు వేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment