Government policy
-
అదృశ్యం అంటే.. ఇక అంతే
బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్‌లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్‌గాంగ్ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్‌గాంగ్ ఆచూకీపై మౌనం పాటించింది. చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్‌గాంగ్‌ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది. కొన్ని సమావేశాలకు వాంగ్ యీ హాజరయ్యారు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చిన్‌గాంగ్ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్ అన్న సందేశమే వస్తోంది. హాంగ్‌కాంగ్‌కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర సంబంధమే చిన్‌గాంగ్ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్గాంగ్ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్‌గాంగ్‌కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్‌గాంగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు. అదృశ్యమైన ప్రముఖులు వీరే హు జింటావో చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్‌లో చైనీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు. జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది. బావో ఫ్యాన్ చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు. గువో గ్వాంగ్‌చాంగ్ 2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ గువో గ్వాంగ్‌చాంగ్ ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్‌బాల్ క్లబ్‌కి యజమాని కూడా అయిన గ్వాంగ్‌చాంగ్‌ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. రెన్ జికియాంగ్ చైనాలో రియల్ ఎస్టేట్ టైకూన్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఫ్యాన్ బింగ్‌బింగ్ రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్ బింగ్‌బింగ్ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్‌బింగ్ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్లు జరిమానా చెల్లించారు. పెంగ్ షూయీ చైనా టెన్నీస్ క్రీడాకారిణి పెంచ్ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారి జాంగ్ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్‌లో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఉగ్ర’ దేశాలపై ఆర్థిక ఆంక్షలు: అమిత్ షా
న్యూఢిల్లీ: ఉగ్రవాద మూకలకు స్వర్గధామాలుగా మారిపోయిన దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించాల్సిందేనని కేంద్రం హోంశాఖ మత్రి అమిత్ షా అన్నారు. పరోక్షంగా పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్నాయని ఆరోపించారు. ఆయన శనివారం ఢిల్లీలో ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ సరిహద్దులుండవు. దాని నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలి. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలి. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నాయి. వారి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయి’’ అని పాకిస్తాన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ‘‘టెర్రరిజం రాజకీయ అంశం కాదు. పౌరుల రక్షణ, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించినది. లాభాపేక్ష లేని సంస్థల ముసుగులో ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేయకుండా చర్యలు తీసుకోవాలి. కౌంటర్–టెర్రర్, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను బలోపేతం చేసుకోవాలి’’ అని అమిత్ షా తెలిపారు. -
మా లక్ష్మణరేఖ తెలుసు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖపై తమకు పూర్తిగా అవగాహన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా 2016లో మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నోట్ల రద్దు వ్యర్థ ప్రయాసగా మిగిలిపోయిందా, ఏమైనా ప్రభావం చూపిందా అన్నదానిపై అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని న్యాయమూర్తి ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం బుధవారం వివరించింది. ఇలాంటి అకడమిక్ అంశాలపై కోర్టు తన సమయం వృథా చేసుకోరాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. ఏ అంశమైనా రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు పరిశీలించి తగిన సమాధానమివ్వడం తమ బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు సూచించింది. విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. -
అది ప్రభుత్వ విధాన నిర్ణయం
సాక్షి, అమరావతి: జిల్లాకు ఏ పేరు పెట్టాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. జిల్లాకు ఫలానా వ్యక్తి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం న్యాయస్థానం పని కాదని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఏదైనా జిల్లాకు లేదా పట్టణానికి రాజకీయ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, యోగి, ఇతర ప్రఖ్యాత వ్యక్తి పేరు పెట్టడం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టంచేసింది. ఒకవేళ కోర్టు అలాంటి ఆదేశం ఇవ్వాలంటే, రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు లేదా ప్రజల చట్టబద్ధ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పిటిషనర్ నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది. జిల్లాలకు పేరు పెట్టే విషయంలో నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన చట్టం ఏదీ లేదని చెప్పింది. కాబట్టి ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీవీఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. -
పొగడ్తలతో ముంచెత్తే వార్తలొద్దు.. విమర్శించండి సరి చేసుకుంటాం
సాక్షి, చెన్నై: ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే విధంగా వార్తలు, కథనాలు ప్రచురించాలని తాను ఎన్నడూ ఆదేశించలేదని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లు, విమర్శలు ఉంటే ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నేతృత్వంలో ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. చదవండి: (ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి డీఎంకే మోడల్ అని, ఆ దిశగానే తమ పయనం సాగుతోందని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చామని, పారిశ్రామిక రంగానికి పునర్జీవం పోశామ ని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని పారిశ్రామిక ఎగుమతుల్లో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్టు గుర్తు చేశారు. తమిళనాడు పారిశ్రామిక పెట్టుబడులకు నెలవు అని, ఇక్కడ అన్ని రకాల వసతులు, అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. చదవండి: (నేనొస్తున్నా.. అన్నాడీఎంకే అందరిదీ అందరూ సమానమే: శశికళ) ప్రభుత్వ పథకాలను, తమ పనితీరును పొగడ్తలతో ముంచెత్తాలని తాను ఎన్నడూ మీడియాను ఆదేశించ లేదన్నారు. విమర్శలు ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. అలాగే, రూ. 2 లక్షల కోట్లు పబ్లిక్ రంగ సంస్థలు సైతం అప్పుల్లో ఉన్నట్టు వివరించారు. నిధుల సమీకరణకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, జీఎస్టీ రూపంలో రాష్ట్రాల హక్కుల్ని యూనియన్ ప్రభుత్వం కాల రాసి, ఆ నిధుల్ని తన్నుకెళ్తోందని ధ్వజమెత్తారు. -
సమ్మె సైరెన్
కరీంనగర్: కేంద్రప్రభుత్వ విధానాలకు నిరసనగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు కార్మికలోకం సన్నద్ధమైంది. కేంద్రం కార్మిక చట్టాల సవరణ నిలిపివేయాలని, రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని తొమ్మిది కార్మిక సంఘాలతోపాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రక్షణ, ఫార్మారంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఫెడరేషన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు జిల్లావ్యాప్తంగా ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, ఏఐయూటీసీ కార్మికల సంఘాలు సిద్ధమయ్యాయి. కార్మికులను సమ్మెలో భాగస్వాములను చేసేందుకు నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశాలు, మోటర్ సైకిల్ ర్యాలీలు, కరపత్రాల పంపిణీలు, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించారు. కార్మికులు పనిచేసే సంస్థలకు సమ్మె నోటీసులు అందజేశారు. ఇప్పటికే జిల్లాస్థాయి సన్నాహక సదస్సు ఏర్పాటు చేసి సార్వత్రిక సమ్మె రోజున జిల్లాకేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. షాపింగ్‌మాల్స్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే కార్మికులకు కూడా ప్రత్యేక టీంల ద్వారా సమ్మె ప్రాధాన్యతను వివరించారు. జిల్లాలో కార్మికులు జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో 1.8 లక్షలమంది కార్మికులు, ఇతర రంగాలలో మరో 1.5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. రైస్‌మిల్లు కార్మికులు 40 వేల మంది, ఐసీడీఎస్ 11 వేల మంది, ఐకేపీ 4,720 మంది, గ్రామపంచాయతీ కార్మికులు 8 వేల మంది, ఆశ కార్యకర్తలు 6,470 మంది, ఫీల్డ్ అసిస్టెంట్లు 7,460 మంది సమ్మెలో పాల్గొననున్నారు. కరోనాకాలంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు తీవ్ర దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొన్ని కంపెనీలు అసలు జీతాలు ఇవ్వకుండానే కార్మికులను తొలగించాయి. మరికొన్ని కంపెనీలు సగం జీతంతో పని చేయించాయి. దీంతో కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా సమ్మెతప్ప మరో మార్గం లేదని నిర్ణయానికి వచ్చి సమ్మెకు సై అంటున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్, స్కీంవర్కర్లకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనాకాలంలో భవన నిర్మాణ కార్మికులకు రూ.1500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వేలాదిమంది నిరాశకు లోనయ్యారు. ప్రధాన డిమాండ్లు ∙ లేబర్కోడ్లను, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. ∙ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం నిలిపివేయాలి. ∙ అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. ∙ కోవిడ్‌ను సాకుగా చూపి ఉద్యోగాల నుంచి తొలగించడం, వేతనాల్లో కోత పెట్టడం నిలిపివేయాలి. ∙ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను, రైల్వే, రక్షణ, ఎల్ఐసీ, బ్యాంకులు ప్రైవేటీకరించరాదు. ∙ వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి ఆహారభద్రతను దెబ్బతీసే చట్టాలను రద్దు చేయాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తోంది. సంఘం ఏర్పాటు చేసుకోవడం నుంచి సమ్మె చేయడం వరకు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ ఒక్కొక్కటిగా సంస్కరణల పేరిట నిర్వీర్యం చేస్తోంది. సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని కార్మికుల శక్తిని చాటాలి. – పొనగంటి కేదారి,సీపీఐ జిల్లా కార్యదర్శి రాజ్యాంగబద్ధంగా కార్మికులకు చెందాల్సిన హక్కులను కాలరాయడం అప్రజాస్వామికం. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మిక చట్టాలు నిర్వీర్యమయ్యాయి. ఎల్ఐసీ, బ్యాంకింగ్ రంగ సంస్థ, బీఎస్ఎన్ఎల్, విమానాయానం లాంటి సంస్థలనే ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం. సార్వత్రికసమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. – గీట్ల ముకుందరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి -
'ప్రభుత్వ విధానం తప్పులతడక'
ఇసుక రవాణ అంశంపై ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం తప్పుల తడకగా ఉందని అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఆలూరి సాంబశివారెడ్డి మంగళవారం విమర్శించారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వ నియమాలను సడలించాలని బుధవారం అనంతపురం జిల్లా సింగమల మండలం ఉలికల్లులో వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు ఆలూరి సాంబశివారెడ్డి, సీపీఐ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డితో పాటు సీపీఎం నాయకులు పాల్గొన్నారు. -
అధికార పక్షంలో ఉంటేనే ఎమ్మెల్యేనా?
అవగాహన సదస్సులో నిలదీసిన చెవిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘‘అధికార పక్షంలో ఉంటేనే ఎమ్మెల్యేనా? ప్రతిపక్షంలో ఉంటే కాదా? ఇలాంటి వ్యవహారశైలితో ప్రభుత్వం మా నుంచి సహకారాన్ని, సమన్వయాన్ని ఎలా ఆశిస్తుంది? ప్రజా సమస్యలను పట్టించుకోని ఇలాంటి అధికారపక్షంతో కలసికట్టుగా నడవాలా?’’ అని వైఎస్సార్సీపీకి చెందిన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నిం చారు. శుక్రవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన సదస్సు సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి ఆయన ఈ ప్రశ్న వేశారు. ప్రతిపక్షం, అధికారపక్షం సమన్వయం, సహకారం, ఏకాభిప్రాయం తో నడవాలని మంత్రి చేసిన సూచనపై చెవిరెడ్డి ఇలా స్పందించారు. దీనికి ఆయన సూటిగా సమాధానం చెప్పలేక... ‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాటించాల్సిన కొన్ని నిబంధనలు, పద్ధతులు ఉన్నా యి. అందరూ వాటి ప్రకారం నడుచుకోవలసిందే’’ అంటూ దాటవేశారు. ఈ పరిణామంతో వేదికపై ఉన్న చంద్రబాబు ఒకింత ఇబ్బందికి గురయ్యారు. -
ఎందుకింత తొందర?!
సరైన నియంత్రణ వ్యవస్థలు లేని మనలాంటి దేశంలో జన్యుమార్పిడి పంటలకు అనుమతినిస్తే అది వ్యవసాయరంగానికి మృత్యు ఘంటికను మోగించినట్టే అవుతుందని రెండేళ్లక్రితం పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టంచేసింది. ఈ తరహా పంటలపై క్షేత్రస్థాయి ప్రయోగాలను పదేళ్లపాటు నిషేధించాలని సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల సంఘం కూడా అభిప్రాయపడింది. కానీ, యూపీఏ ప్రభుత్వానికి ఇలాంటి హితవచనాలు తలకెక్కలేదు. మరికొన్ని రోజుల్లో తాను అధికారం నుంచి వైదొలగక తప్పదని తెలిసి కూడా అత్యంత కీలకమైన జన్యుమార్పిడి పంటల విషయంలో హడావుడి నిర్ణయం తీసుకుంది. ఆ పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని జన్యు సాంకేతిక అనుమతుల సంఘం (జీఈఏసీ) గోధుమ, వరి, మొక్కజొన్న, పత్తితోసహా 11పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలకు పచ్చజెండా ఊపింది. జయంతి నటరాజన్‌ను పర్యావరణ శాఖనుంచి తప్పించి, ఆ శాఖను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీకి కట్టబెట్టిన తర్వాత రూ. 6 లక్షల కోట్ల విలువైన 300 ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. ఆ పరంపరలో ఇది మరొకటి. ఆ తరహా పంటల ప్రయోగాలపై దేశంలోని శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదని, వాటివల్ల చేకూరగలదనుకునే నష్టాన్ని నిరోధిం చడానికి లేదా కనీసం అంచనావేయడానికి అవసరమైన ప్రొటోకాల్స్ ఇంకా అమల్లోకి రాలేదని...కనుక అనుమతులు సాధ్యంకాదని జయంతి నటరాజన్ అప్పట్లో చెప్పారు. అంతేకాదు...సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం సంగతి తేలాకే ఈ విషయంలో ముందడుగేయాలని నిర్ణయించారు. పర్యావరణ శాఖ ఒక వ్యక్తినుంచి మరొకరికి వెళ్లినంత మాత్రాన ఈ పరిస్థితుల్లో వచ్చిన మార్పేమిటి? ఆమె ఈ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలేమిటి? కొత్తగా ఎలాంటి నియంత్రణ సంస్థలు అమల్లోకొచ్చాయి? ఈ ప్రశ్నల్లో వేటికీ సర్కారు దగ్గర జవాబులేదు. జన్యుమార్పిడి పంటల అవసరం గురించి మాట్లాడేవారు ఆహార భద్రతకు అది అత్యంత అవసరమని వాదిస్తారు. క్రిమికీటకాదులనూ, భూసార క్షీణతనూ తట్టుకుని నిలిచే పంటలవల్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని...పెపైచ్చు ఉత్పత్తి వ్యయం ఎంతగానో తగ్గుతుందని వారంటారు. మరో పదిహేనేళ్లలో ఆహార అవసరాలు రెట్టింపు కావొచ్చుగనుక జన్యుమార్పిడి పంటలు తప్ప ఈ దేశంలో ప్రత్యా మ్నాయం లేదన్నది అలాంటివారి వాదన. కానీ, మన దేశంలో ఆహార భద్రతకు ఏర్పడిన ప్రమాదమేమీ లేదని ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలే గతంలో స్పష్టంచేశాయి. పైగా మనదగ్గర ఏ పంటను ఎలా పండించారో తెలియజెప్పే లేబిలింగ్ వ్యవస్థ అమలులో లేదు. అలాగే జీవ సాంకేతిక నియంత్రణ వ్యవస్థలూ లేవు. వీటన్నిటినీ విస్మరించి ఎన్నికల ముందు బహుళజాతి ప్రయోజనాలే పరమార్ధమన్నట్టు ప్రభుత్వం అడుగులేస్తున్నది. కనీసం మన పార్లమెంటరీ కమిటీ చెప్పిందేమిటో చూద్దామన్న ఆసక్తిని కూడా ప్రదర్శించడంలేదు. దేశంలోని ఆహార, సాగు వ్యవస్థలకు జన్యుమార్పిడి పంటలు విఘాతం కలిగిస్తాయని, గ్రామీణ జీవనోపాధి మార్గాలు దెబ్బతింటాయని పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికలో తెలిపింది. జన్యుమార్పిడి పంటల్ని ఒకసారి సాగుచేస్తే అలాంటిచోట తిరిగి మామూలు సేద్యం సాధ్యపడదని స్పష్టంచేసింది. నేలను సారవంతంగా ఉంచి, పంటపొలాలకు మేలుచేసే కోటానుకోట్ల సూక్ష్మజీవులు జన్యుమార్పిడి విత్తనాలవల్ల మరణిస్తాయని, పర్యవసానంగా భూసారం క్షీణించి కొన్నాళ్లకు పంట దిగుబడి కూడా తగ్గిపోతుందని ఆ కమిటీ తెలిపింది. దేశంలోని రైతాంగంలో 80 శాతంపైగామంది చిన్న, సన్నకారు రైతులేనని...అలాంటివారంతా ఈ పంటల కారణంగా రోడ్డునపడే ప్రమాదం ఉన్నదని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది. ఇంతగా అధ్యయనం చేసి వెలువరించిన నివేదికను గానీ, సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల సంఘం మాటలనుగానీ యూపీఏ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. జన్యుమార్పిడి పంటల ప్రయోగాలకు ఏడేళ్లక్రితం అనుమతులిచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎన్నో సూచనలు చేసింది. జీవభద్రతతోసహా పలు అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. కానీ, ఆచరణలో అవన్నీ సరిగా అమలు కాలేదని పార్లమెంటరీ కమిటీకి డాక్టర్ పీఎం భార్గవ చెప్పారు. అసలు జీఈఏసీలో ప్రయోగశాలే లేదని, ఏ కంపెనీకి ఆ కంపెనీ ప్రయోగాల తర్వాత తనకు తాను కితాబులిచ్చుకున్నదని ఆయనన్నారు. వాస్తవం ఇదికాగా, ఇప్పుడు 11 పంటల ప్రయోగాలకు అనుమతులిస్తూ జీఈఏసీ కొన్ని షరతులు విధించింది. ప్రయోగాలకు ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోవాలన్నది ఆ షరతుల్లో ఒకటి. జీఎం పంటల ప్రయోగాలు ఎక్కడో గ్రీన్ హౌస్‌లోనో, గ్లాస్ హౌస్‌లోనో జరగవు. బహిరంగ వ్యవసాయ క్షేత్రాల్లోనే ఈ ప్రయోగాలు జరుగుతాయి గనుక పర్యావర ణంపై దుష్ర్పభావం పడుతుందని, రైతుల ఆరోగ్యానికి, పశు సంతతికి హానికలిగిస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీనికితోడు ఆయా ప్రయోగాల పర్యవేక్షణ, పర్యావరణంపై ఆ ప్రయోగాలు చూపిస్తున్న ప్రభావంవంటి అంశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లేమీ లేవు. జన్యుమార్పిడి పంటలకు సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో వచ్చే నెలలో ఎటూ విచారణ ఉంది. ఈలోగానే ఆదరా బాదరాగా జీఈఏసీ ఈ నిర్ణయం తీసుకోవడంలోని ఆంతర్యమేమిటో అర్ధంకాదు. మన ప్రజల అవసరాలు, మన ప్రాధాన్యాలూ కాక... బహుళజాతి సంస్థల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్న యూపీఏ సర్కారు తీరును జనం క్షమించరు.