సరైన నియంత్రణ వ్యవస్థలు లేని మనలాంటి దేశంలో జన్యుమార్పిడి పంటలకు అనుమతినిస్తే అది వ్యవసాయరంగానికి మృత్యు ఘంటికను మోగించినట్టే అవుతుందని రెండేళ్లక్రితం పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టంచేసింది. ఈ తరహా పంటలపై క్షేత్రస్థాయి ప్రయోగాలను పదేళ్లపాటు నిషేధించాలని సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల సంఘం కూడా అభిప్రాయపడింది. కానీ, యూపీఏ ప్రభుత్వానికి ఇలాంటి హితవచనాలు తలకెక్కలేదు. మరికొన్ని రోజుల్లో తాను అధికారం నుంచి వైదొలగక తప్పదని తెలిసి కూడా అత్యంత కీలకమైన జన్యుమార్పిడి పంటల విషయంలో హడావుడి నిర్ణయం తీసుకుంది. ఆ పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని జన్యు సాంకేతిక అనుమతుల సంఘం (జీఈఏసీ) గోధుమ, వరి, మొక్కజొన్న, పత్తితోసహా 11పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలకు పచ్చజెండా ఊపింది. జయంతి నటరాజన్‌ను పర్యావరణ శాఖనుంచి తప్పించి, ఆ శాఖను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీకి కట్టబెట్టిన తర్వాత రూ. 6 లక్షల కోట్ల విలువైన 300 ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. ఆ పరంపరలో ఇది మరొకటి. ఆ తరహా పంటల ప్రయోగాలపై దేశంలోని శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదని, వాటివల్ల చేకూరగలదనుకునే నష్టాన్ని నిరోధిం చడానికి లేదా కనీసం అంచనావేయడానికి అవసరమైన ప్రొటోకాల్స్ ఇంకా అమల్లోకి రాలేదని...కనుక అనుమతులు సాధ్యంకాదని జయంతి నటరాజన్ అప్పట్లో చెప్పారు. అంతేకాదు...సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం సంగతి తేలాకే ఈ విషయంలో ముందడుగేయాలని నిర్ణయించారు. పర్యావరణ శాఖ ఒక వ్యక్తినుంచి మరొకరికి వెళ్లినంత మాత్రాన ఈ పరిస్థితుల్లో వచ్చిన మార్పేమిటి? ఆమె ఈ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలేమిటి? కొత్తగా ఎలాంటి నియంత్రణ సంస్థలు అమల్లోకొచ్చాయి? ఈ ప్రశ్నల్లో వేటికీ సర్కారు దగ్గర జవాబులేదు. జన్యుమార్పిడి పంటల అవసరం గురించి మాట్లాడేవారు ఆహార భద్రతకు అది అత్యంత అవసరమని వాదిస్తారు. క్రిమికీటకాదులనూ, భూసార క్షీణతనూ తట్టుకుని నిలిచే పంటలవల్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని...పెపైచ్చు ఉత్పత్తి వ్యయం ఎంతగానో తగ్గుతుందని వారంటారు. మరో పదిహేనేళ్లలో ఆహార అవసరాలు రెట్టింపు కావొచ్చుగనుక జన్యుమార్పిడి పంటలు తప్ప ఈ దేశంలో ప్రత్యా మ్నాయం లేదన్నది అలాంటివారి వాదన. కానీ, మన దేశంలో ఆహార భద్రతకు ఏర్పడిన ప్రమాదమేమీ లేదని ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలే గతంలో స్పష్టంచేశాయి. పైగా మనదగ్గర ఏ పంటను ఎలా పండించారో తెలియజెప్పే లేబిలింగ్ వ్యవస్థ అమలులో లేదు. అలాగే జీవ సాంకేతిక నియంత్రణ వ్యవస్థలూ లేవు. వీటన్నిటినీ విస్మరించి ఎన్నికల ముందు బహుళజాతి ప్రయోజనాలే పరమార్ధమన్నట్టు ప్రభుత్వం అడుగులేస్తున్నది. కనీసం మన పార్లమెంటరీ కమిటీ చెప్పిందేమిటో చూద్దామన్న ఆసక్తిని కూడా ప్రదర్శించడంలేదు.
దేశంలోని ఆహార, సాగు వ్యవస్థలకు జన్యుమార్పిడి పంటలు విఘాతం కలిగిస్తాయని, గ్రామీణ జీవనోపాధి మార్గాలు దెబ్బతింటాయని పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికలో తెలిపింది. జన్యుమార్పిడి పంటల్ని ఒకసారి సాగుచేస్తే అలాంటిచోట తిరిగి మామూలు సేద్యం సాధ్యపడదని స్పష్టంచేసింది. నేలను సారవంతంగా ఉంచి, పంటపొలాలకు మేలుచేసే కోటానుకోట్ల సూక్ష్మజీవులు జన్యుమార్పిడి విత్తనాలవల్ల మరణిస్తాయని, పర్యవసానంగా భూసారం క్షీణించి కొన్నాళ్లకు పంట దిగుబడి కూడా తగ్గిపోతుందని ఆ కమిటీ తెలిపింది. దేశంలోని రైతాంగంలో 80 శాతంపైగామంది చిన్న, సన్నకారు రైతులేనని...అలాంటివారంతా ఈ పంటల కారణంగా రోడ్డునపడే ప్రమాదం ఉన్నదని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది. ఇంతగా అధ్యయనం చేసి వెలువరించిన నివేదికను గానీ, సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల సంఘం మాటలనుగానీ యూపీఏ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. జన్యుమార్పిడి పంటల ప్రయోగాలకు ఏడేళ్లక్రితం అనుమతులిచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎన్నో సూచనలు చేసింది. జీవభద్రతతోసహా పలు అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. కానీ, ఆచరణలో అవన్నీ సరిగా అమలు కాలేదని పార్లమెంటరీ కమిటీకి డాక్టర్ పీఎం భార్గవ చెప్పారు. అసలు జీఈఏసీలో ప్రయోగశాలే లేదని, ఏ కంపెనీకి ఆ కంపెనీ ప్రయోగాల తర్వాత తనకు తాను కితాబులిచ్చుకున్నదని ఆయనన్నారు.
వాస్తవం ఇదికాగా, ఇప్పుడు 11 పంటల ప్రయోగాలకు అనుమతులిస్తూ జీఈఏసీ కొన్ని షరతులు విధించింది. ప్రయోగాలకు ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోవాలన్నది ఆ షరతుల్లో ఒకటి. జీఎం పంటల ప్రయోగాలు ఎక్కడో గ్రీన్ హౌస్‌లోనో, గ్లాస్ హౌస్‌లోనో జరగవు. బహిరంగ వ్యవసాయ క్షేత్రాల్లోనే ఈ ప్రయోగాలు జరుగుతాయి గనుక పర్యావర ణంపై దుష్ర్పభావం పడుతుందని, రైతుల ఆరోగ్యానికి, పశు సంతతికి హానికలిగిస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీనికితోడు ఆయా ప్రయోగాల పర్యవేక్షణ, పర్యావరణంపై ఆ ప్రయోగాలు చూపిస్తున్న ప్రభావంవంటి అంశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లేమీ లేవు. జన్యుమార్పిడి పంటలకు సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో వచ్చే నెలలో ఎటూ విచారణ ఉంది. ఈలోగానే ఆదరా బాదరాగా జీఈఏసీ ఈ నిర్ణయం తీసుకోవడంలోని ఆంతర్యమేమిటో అర్ధంకాదు. మన ప్రజల అవసరాలు, మన ప్రాధాన్యాలూ కాక... బహుళజాతి సంస్థల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్న యూపీఏ సర్కారు తీరును జనం క్షమించరు.
ఎందుకింత తొందర?!
Published Tue, Mar 25 2014 12:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement