అధికార పక్షంలో ఉంటేనే ఎమ్మెల్యేనా?
అవగాహన సదస్సులో నిలదీసిన చెవిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘అధికార పక్షంలో ఉంటేనే ఎమ్మెల్యేనా? ప్రతిపక్షంలో ఉంటే కాదా? ఇలాంటి వ్యవహారశైలితో ప్రభుత్వం మా నుంచి సహకారాన్ని, సమన్వయాన్ని ఎలా ఆశిస్తుంది? ప్రజా సమస్యలను పట్టించుకోని ఇలాంటి అధికారపక్షంతో కలసికట్టుగా నడవాలా?’’ అని వైఎస్సార్‌సీపీకి చెందిన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నిం చారు.
శుక్రవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన సదస్సు సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి ఆయన ఈ ప్రశ్న వేశారు. ప్రతిపక్షం, అధికారపక్షం సమన్వయం, సహకారం, ఏకాభిప్రాయం తో నడవాలని మంత్రి చేసిన సూచనపై చెవిరెడ్డి ఇలా స్పందించారు. దీనికి ఆయన సూటిగా సమాధానం చెప్పలేక... ‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాటించాల్సిన కొన్ని నిబంధనలు, పద్ధతులు ఉన్నా యి. అందరూ వాటి ప్రకారం నడుచుకోవలసిందే’’ అంటూ దాటవేశారు. ఈ పరిణామంతో వేదికపై ఉన్న చంద్రబాబు ఒకింత ఇబ్బందికి గురయ్యారు.