న్యూఢిల్లీ: ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖపై తమకు పూర్తిగా అవగాహన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా 2016లో మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నోట్ల రద్దు వ్యర్థ ప్రయాసగా మిగిలిపోయిందా, ఏమైనా ప్రభావం చూపిందా అన్నదానిపై అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని న్యాయమూర్తి ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం బుధవారం వివరించింది.
ఇలాంటి అకడమిక్ అంశాలపై కోర్టు తన సమయం వృథా చేసుకోరాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. ఏ అంశమైనా రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు పరిశీలించి తగిన సమాధానమివ్వడం తమ బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు సూచించింది. విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment