lakshman rekha
-
మా లక్ష్మణరేఖ తెలుసు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖపై తమకు పూర్తిగా అవగాహన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా 2016లో మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నోట్ల రద్దు వ్యర్థ ప్రయాసగా మిగిలిపోయిందా, ఏమైనా ప్రభావం చూపిందా అన్నదానిపై అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని న్యాయమూర్తి ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం బుధవారం వివరించింది. ఇలాంటి అకడమిక్ అంశాలపై కోర్టు తన సమయం వృథా చేసుకోరాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. ఏ అంశమైనా రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు పరిశీలించి తగిన సమాధానమివ్వడం తమ బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు సూచించింది. విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. -
Sedition Order: లక్ష్మణ రేఖను గౌరవించాలి.. దాటకూడదు!
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన రాజద్రోహ చట్టం విషయంలో ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సమీక్షలు పూర్తయ్యేదాకా రాజద్రోహ చట్టాన్ని నిలిపివేయాలంటూ కేంద్రానికి చెప్పింది. అంతేకాదు కొత్త కేసులు.. అరెస్టులు నమోదు చేయొద్దని చెబుతూనే.. ఇప్పటికే రాజద్రోహం కింద అరెస్టయిన వాళ్లు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చని స్పష్టం చేసింది. ఈ పరిణామంపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు Kiren Rijiju కోర్టు ఆదేశాలపై.. ‘కోర్టులకు ఉన్న స్వతంత్ర్య హోదాను, వాటిని తీర్పును గౌరవిస్తామని అన్నారు. అంతేకాదు లక్ష్మణ రేఖను దాటకూడదు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. మా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏంటో కూడా న్యాయస్థానానికి తెలియజేశాం. న్యాయస్థానాలను, వాటి స్వతంత్ర్య హోదాను మేం గౌరవిస్తాం. కానీ, అంతా లక్ష్మణ రేఖను గౌరవించాలి. అంతేగానీ దాటకూడదు కదా అంటూ మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో భారతీయుల అణచివేతకు కారణమైన ఐపీసీ సెక్షన్ 124-ఏను.. ఇప్పటికీ అమలు చేస్తుండడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తంకాగా, కేంద్రం మాత్రం ఈ సెక్షన్‌పై దోబుచులాడుతూ వస్తోంది. తాజాగా ఈ సెక్షన్ సవరణ సమీక్షకు తాము సిద్ధమంటూ అఫిడవిట్లో పేర్కొనడం.. ఆపై సుప్రీం కోర్టు జోక్యంతో రాజద్రోహం సెక్షన్‌కు ఇప్పుడు బ్రేకు పడింది. చదవండి: ‘రాజద్రోహం చట్టం’పై స్టే విధించిన సుప్రీంకోర్టు -
కోర్టులు లక్ష్మణరేఖను దాటవు: సుప్రీం
న్యూఢిల్లీ: ‘న్యాయస్థానాలకు లక్ష్మణ రేఖ ఉంది. దానిని అధిగమించజాలవు. చట్టాలపై తీర్పులు ఇవ్వడం వరకే వాటి బాధ్యత. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌దే’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ తరఫు లాయరు దినేశ్ ద్వివేది వాదిస్తూ.. ‘నేరారోపణలు ఉన్నవారు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా పార్లమెంట్ చట్టం చేయడం అసాధ్యం. అందుకే సుప్రీం జోక్యం చేసుకోవాలి’ అని కోరారు. ‘చట్ట సభల సభ్యులపై ఉన్న కేసుల విచారణను సత్వరం చేపట్టేలా చర్యలు తీసుకోగలం. అంతేకానీ, చట్టసభల పరిధిలోని కొన్ని అంశాలపై చట్టాలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, పార్లమెంట్‌ను కోరలేమని కోర్టు పేర్కొంది. ఒక వ్యక్తిపై ఆరోపణలు రుజువయ్యే దాకా అతడు నిర్దోషేనని, అలాంటప్పుడు అతడిని పోటీ చేయకుండా అడ్డుకోలేమన్నారు. -
లక్ష్మణరేఖ!
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్మొహమాటంగా మాట్లాడతారని పేరుంది. న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల గురించి వారం రోజుల వ్యవధిలో ఆయన రెండుసార్లు చేసిన వ్యాఖ్యానాలు సంచలనం కలిగించాయి. న్యాయవ్యవస్థ తన పరిధిని, పరిమితులను అతిక్రమిస్తున్నదన్నదే ఆ రెండు వ్యాఖ్యల సారాంశం. శాసన, కార్య నిర్వాహక వ్యవస్థల అధికారాల్లోకి న్యాయవ్యవస్థ చొరబడుతున్నదని వారంక్రితం ఆయన విమర్శించారు. దానిపై వివరణను కోరిన సందర్భంలో ఈసారి మరింత స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకోవలసిన నిర్ణయాలను దానికే వదిలేయాలి తప్ప ఆ పని న్యాయవ్యవస్థ నెత్తిన వేసుకోరాదని ఆయన హితవు పలికారు. అంతేకాదు...న్యాయవ్యవస్థ క్రియాశీలతకు నిగ్రహం అవసరమని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ తనకు తాను లక్ష్మణరేఖ గీసు కోవాలని కూడా సూచించారు. అరుణ్ జైట్లీ కన్నా ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం న్యాయమూర్తుల సదస్సులో ఈ మాదిరే అన్నారు. న్యాయస్థానాలు హద్దు మీరుతున్నాయని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ పోకడలపై నేతలు ఆందోళన వ్యక్తం చేయడం ఇది మొదటిసారేమీ కాదు. ఆమాటకొస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం దానిపై పలుమార్లు మాట్లాడారు. నాలుగేళ్లక్రితం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్. కపాడియా న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఒక్కోసారి పరిధులను దాటుతోందని, ఇందువల్ల శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతింటున్నదని అంగీకరించారు. ‘న్యాయం చేయాలన్న ఆత్రుతే’ అందుకు కారణమని ఆయన సంజాయిషీ ఇచ్చుకున్నారు. అరుణ్‌జైట్లీ గతంలో కూడా న్యాయవ్యవస్థ లోటుపాట్లపై నిశితమైన విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు గనుక ఆయన అభిప్రాయాలు కొట్టేయదగ్గవి కాదు. న్యాయమూర్తులుగా పనిచేసేవారు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులనూ అంగీకరించరాదని 2012లో ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన సూచించారు. అక్కడితో ఆగలేదు...కొందరు న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత వచ్చే పదవులు ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాస్తున్నారని కూడా ఆరోపించారు. ‘న్యాయమూర్తులు రెండు రకాలు... కొందరు న్యాయం తెలిసున్నవారైతే, మరికొందరు న్యాయ శాఖ మంత్రి తెలిసున్నవారు’ అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. వాటి సంగతలా ఉంచితే న్యాయవ్యవస్థ పరిధులు, పరిమితుల గురించి అరుణ్ జైట్లీ చేస్తున్న వ్యాఖ్యలతో బహుశా కాంగ్రెస్ కూడా ఏకీభవిస్తుంది. కామన్వెల్త్ క్రీడల స్కాం, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎన్నో ఎదురుదెబ్బలు తింది. సీబీఐని యూపీఏ సర్కారు ఆటబొమ్మగా మార్చిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఈ కేసుల పర్యవేక్షణను సుప్రీంకోర్టు తానే చేపట్టింది. ఆ పరాభవాన్ని కాంగ్రెస్ అంత సులభంగా మరిచిపోదు. అయితే న్యాయవ్యవస్థ క్రియాశీలత అవసరాన్ని ఏర్పరిచిందీ, అది విస్తరించ డానికి దోహదపడిందీ కార్యనిర్వాహక వ్యవస్థ వైఫల్యాలేనన్న సంగతి మర్చి పోకూడదు. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగానికీ, చట్టాలకూ అనుగుణంగా వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ క్రియాశీలత అవసరమే ఏర్పడి ఉండేది కాదు. అయి దేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో జనం ఓట్లతో నెగ్గితే ఆ తర్వాత తమను ఎవరూ ఏమీ చేయలేరని, తాము ఎవరికీ జవాబుదారీ కాదని నాయకులు భావిస్తున్నారు. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి చర్యలను నియంత్రించే చట్టాలు లేదా నిబంధనలుంటే వాటిని ఏమార్చడానికి సందేహించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలకుల తీరుతెన్నులను గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. అవతలి పార్టీల నుంచి గెలిచినవారిని బహిరంగ సభల్లో కండువాలు కప్పి ఆహ్వానించడానికి రెండు రాష్ట్రాల్లోని సీఎంలూ సందేహించడం లేదు. ఇలా చేయడం అనైతికమనుకోవడం లేదు. ఒకపక్క ఇంత దిగజారుడు పనులకు పాల్పడుతూ ప్రజల కనీసావసరాలపై దృష్టి సారించడానికి సమయం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటపుడు కరువు విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైతే...ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే ఉలికిపాటు ఎందుకు? తమ అధికారాల్లోకి చొచ్చుకొస్తున్నదని నొచ్చుకోవడం ఎందుకు? దేశంలో కరువుకాటకాలు అలముకున్నప్పుడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో చెప్పడానికి 2005 నాటి విపత్తు నివారణ చట్టంతోపాటు 2009లో రూపొందిన కరువు మాన్యువల్, 2010నాటి జాతీయ విపత్తు నివారణ మార్గ దర్శకాలు ఉన్నాయి. అయినా చాలా రాష్ట్రాలకు వాటిని అమలు చేయాలన్న స్పృహే లేకపోయింది. ఈమధ్యే ‘నీట్’పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా జైట్లీ ప్రస్తా వించారు. పరీక్షల నిర్వహణ తమ పరిధిలోనిదైతే వాటిని ఎప్పుడు నిర్వహించాలో, ఏమి చేయాలో సుప్రీంకోర్టు చెప్పడమేమిటని రాష్ట్రాలు అడుగుతున్నాయని కూడా అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలున్న మాట నిజమే. కానీ వైద్య విద్యా రంగాన్ని మాఫియా శాసిస్తుంటే, నిజమైన అర్హతలున్నవారికి సీట్లు దక్కని పరిస్థితులుంటే, విద్య అంగడి సరుకవుతుంటే ఇన్ని దశాబ్దాలుగా నిర్లిప్తంగా ఉండిపోయిన ప్రభుత్వాల నిర్వాకం వల్లనే సుప్రీంకోర్టు రంగంలోకి దిగిందని గుర్తుంచుకోవాలి. ఉత్తరాఖండ్ వ్యవహారంలోనూ అంతే. ఒక ప్రభుత్వానికి మెజా రిటీ ఉన్నదో, లేదో తేలాల్సింది చట్టసభలోనే అన్న సంగతి మరిచి ప్రవర్తించడం వల్లనే అక్కడ సుప్రీంకోర్టు జోక్యం అవసరమైంది. ఏ వ్యవస్థకుండే అధికారాలకైనా ప్రాతిపదిక రాజ్యాంగమే. రాజ్యాంగం మూడు వ్యవస్థలకూ ఇచ్చిన అధికారాలైనా... నిర్దేశించిన పరిధులు, పరిమితులు అయినా ప్రజల ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ కాంక్షించి రూపొందించినవేనని మరిచి పోకూడదు. తమ అధికారాలను న్యాయవ్యవస్థ కబ్జా చేస్తున్నదని ఆరోపించే ముందు తమ నిర్వాకం ఎలా ఉన్నదో, తమ పరంగా జరుగుతున్న తప్పులేమిటో మిగిలిన రెండు వ్యవస్థలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. లోటుపాట్లను సరిదిద్దు కోవాలి. అది జరగనంతకాలం న్యాయవ్యవస్థ క్రియాశీలతను హర్షించడమే కాదు... అది మరింత విస్తరించాలని అందరూ కోరుకుంటారు. -
'లక్ష్మణ రేఖ గీసుకోవాల్సిందే..'
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ పనితీరును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా విమర్శించారు. స్వేచ్ఛ పేరుతో అన్ని విషయాల్లో ముఖ్యంగా కార్యనిర్వాహక విషయాల్లోకి ప్రవేశించకూడదని అన్నారు. అంతేకాదు.. న్యాయవ్యవస్థ తనకు తాను ఓ లక్ష్మణ రేఖ గీసుకుంటే మంచిదని కూడా హితవు పలికారు. ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కార్ప్స్(ఐడబ్ల్యూపీసీ)తో మాట్లాడుతున్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం పేరిట కార్యనిర్వాహక శాఖ అంశాలను స్పృశించేలాగా న్యాయ వ్యవస్థ నిర్ణయాలు ఉండరాదని చెప్పారు. 'న్యాయ సమీక్ష అనేది న్యాయవ్యవస్థకు ధర్మబద్ధమైనది. కానీ, అదే సమయంలో ఆ శాఖలోని అన్ని విభాగాలు వాటికవి లక్ష్మణ రేఖలు గీసుకోవాలి. లక్ష్మణ రేఖ ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. కార్యనిర్వాహక సంబంధమైన అంశాలు కార్యనిర్వాహక శాఖే తీసుకుంటుంది. న్యాయశాఖ కాదు' అని చెప్పారు. కార్యనిర్వాహక శాఖకు న్యాయశాఖలు ప్రత్యామ్నాయం కాదు. నా పని నేను చేస్తాను. మూడు విధులు నువ్వే (న్యాయశాఖ) చేస్తానంటే అవి అందుబాటులో ఉండవు' అని చెప్పారు. -
ప్రియాంక గాంధీ లక్ష్మణ రేఖ దాటారు: వరుణ్
సుల్తాన్పూర్: గాంధీ నెహ్రూ కుటుంబ వారసుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మేనక గాంధీ కొడుకు, బీజేపీ యువనేత వరుణ్ గాంధీ తాజాగా అక్క ప్రియాంక గాంధీపై విరుచుకుపడ్డారు. ప్రియాంక హుందాతనం వీడి లక్ష్మణ రేఖ దాటారని వరుణ్ విమర్శించారు. దశాబ్ద కాలంగా కుటుంబ సభ్యుడిగా, ఓ రాజకీయ నేతగా తన ప్రసంగాల్లో ఎప్పుడూ అమర్యాదగా మాట్లాడలేదని, లక్ష్మణ రేఖ దాటలేదని పేర్కొన్నారు. స్వలాభం కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా భావిస్తానని, తాను ఇదే బాటలో నడుస్తానని వరుణ్ చెప్పారు. వరుణ్, మేనక బీజేపీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తరపున ప్రియాంక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య పరస్పర విమర్శలకు కారణమేంటంటే.. గత వారం అమేథిలో అన్న రాహుల్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ప్రియాంక.. వరుణ్ దారి తప్పారని, అతను సరైన మార్గంలో నడవాలంటే ఓడించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 'వరుణ్ మా కుటుంబ సభ్యుడే. అతను నాకు సోదరుడు. అయితే తమ్ముడు దారి తప్పాడు. ఓ కుటుంబంలో చిన్నవాళ్లు దారితప్పితే పెద్దలు సరైన మార్గంలో నడిపించాలి. వరుణ్‌ను సన్మార్గంలో నడిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా' అని ప్రియాంక అన్నారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మేనక దీటుగా బదులిచ్చారు. వరుణ్ దారి తప్పాడా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని, ప్రియాకం కాదన్నట్టుగా మేనక వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు మాని ప్రజల సమస్యలపై మాట్లాడాలని వరుణ్ అన్నారు. విమర్శల పర్వం ఇంతటితో ముగుస్తుందో లేక మరింత తీవ్ర రూపం దాల్చుతుందో చూడాలి!