ప్రియాంక గాంధీ లక్ష్మణ రేఖ దాటారు: వరుణ్
సుల్తాన్పూర్: గాంధీ నెహ్రూ కుటుంబ వారసుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మేనక గాంధీ కొడుకు, బీజేపీ యువనేత వరుణ్ గాంధీ తాజాగా అక్క ప్రియాంక గాంధీపై విరుచుకుపడ్డారు. ప్రియాంక హుందాతనం వీడి లక్ష్మణ రేఖ దాటారని వరుణ్ విమర్శించారు. దశాబ్ద కాలంగా కుటుంబ సభ్యుడిగా, ఓ రాజకీయ నేతగా తన ప్రసంగాల్లో ఎప్పుడూ అమర్యాదగా మాట్లాడలేదని, లక్ష్మణ రేఖ దాటలేదని పేర్కొన్నారు. స్వలాభం కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా భావిస్తానని, తాను ఇదే బాటలో నడుస్తానని వరుణ్ చెప్పారు. వరుణ్, మేనక బీజేపీ తరపున లోక్సభకు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తరపున ప్రియాంక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య పరస్పర విమర్శలకు కారణమేంటంటే..
గత వారం అమేథిలో అన్న రాహుల్కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ప్రియాంక.. వరుణ్ దారి తప్పారని, అతను సరైన మార్గంలో నడవాలంటే ఓడించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 'వరుణ్ మా కుటుంబ సభ్యుడే. అతను నాకు సోదరుడు. అయితే తమ్ముడు దారి తప్పాడు. ఓ కుటుంబంలో చిన్నవాళ్లు దారితప్పితే పెద్దలు సరైన మార్గంలో నడిపించాలి. వరుణ్ను సన్మార్గంలో నడిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా' అని ప్రియాంక అన్నారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మేనక దీటుగా బదులిచ్చారు. వరుణ్ దారి తప్పాడా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని, ప్రియాకం కాదన్నట్టుగా మేనక వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు మాని ప్రజల సమస్యలపై మాట్లాడాలని వరుణ్ అన్నారు. విమర్శల పర్వం ఇంతటితో ముగుస్తుందో లేక మరింత తీవ్ర రూపం దాల్చుతుందో చూడాలి!