గాంధీల ఇంట మాటల తూటా
వరుణ్‌పై మళ్లీ ప్రియాంక విమర్శలు
కుటుంబానికి ద్రోహం చేస్తున్నాడు
{పియాంక లక్ష్మణరేఖ మీరుతున్నారు: వరుణ్
అమేథీ/సుల్తాన్‌పూర్: ఎన్నికల నేపథ్యంలో గాంధీల కుటుంబంలో మాటల మంట రేగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ తన చిన్నాన్న కుమారుడు వరుణ్ గాంధీపై మరోసారి విమర్శల దాడి చేశారు. వరుణ్ చేష్టలన్నీ కుటుంబానికి ద్రోహం చేసేటట్టుగా ఉన్నాయని మండిపడ్డారు. అదే సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి వరుణ్ గాంధీ కూడా తన అక్కకు ఘాటుగా బదులిచ్చారు. ప్రియాంక లక్ష్మణరేఖ దాటుతున్నారంటూ హెచ్చరించారు. ఈ మాటల యుద్ధం మంగళవారం వరుణ్ సుల్తాన్‌పూర్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసే నేపథ్యంలో జరిగింది.
అదే సమయంలో పక్క నియోజకవర్గం అమేథీలో రాహుల్ గాంధీ తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రియాంక విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలు కుటుంబ టీ పార్టీ కాదని, భావజాలాల మధ్య యుద్ధమని పేర్కొన్నారు. భావసారూప్యం లేని వాళ్లు రక్తసంబంధీకులైనాతనకు ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు. ‘గత ఎన్నికల్లో వరుణ్ వెల్లడించిన భావాలను నేను పూర్తిగా వ్యతిరేకించాను. అవి నా కుటుంబానికి ద్రోహం చేసేవి. దేశ ఐక్యత కోసం నా తండ్రి ప్రాణాలర్పించాడు. నా పిల్లలకోసమైనా సరే దానిని నేను తక్కువ చేయలేను’ అని ప్రియాంక చెప్పారు.
మర్యాద మీరుతున్నారు: అక్క వరుస విమర్శలపై మౌనం వీడిన వరుణ్ గాంధీ తన మర్యాదైన ప్రవర్తనను చేతగాని తనంగా ఎవరూ చూడొద్దని ప్రియాంకను పరోక్షంగా హెచ్చరించారు. మర్యాద అనే లక్ష్మణ రేఖను ఆమె దాటారని చెప్పారు. కొంతమంది తాను తప్పు దారి పట్టానని చెబుతున్నారని, తన దారి ముఖ్యం కాదని దేశానికి సరైన దిశానిర్దేశం చేయడం ముఖ్యమని చెప్పారు.
మన్మోహనే సూపర్ పీఎం:సోనియా చేతిలో ప్రధాని కీలుబొమ్మగా పనిచేశారని ఆయన మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు చెప్పడంపై మన్మోహన్, సోనియా ఇంకా మౌనం వీడలేదు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ, ప్రధాని కుమార్తె ఉపీందర్ సింగ్ ఆయనకు బాసటగా నిలిచారు. మన్మోహనే సూపర్ పీఎం అని ప్రియాంక, సంజయ్ తన తండ్రి నమ్మకాన్ని వమ్ముచేశారంటూ ఉపీందర్ పేర్కొన్నారు.