స్నేహితులకు చౌకగా భూములు
గుజరాత్ అభివృద్ధి ఇదేనా? - మోడీపై ప్రియాంక గాంధీ ధ్వజం
రాయబరేలి(యూపీ): బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్ తరహా అభివృద్ధి నమూనాపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ విమర్శల దాడి పెంచారు. వేలాది ఎకరాల భూములను కారుచౌకగా తన స్నేహితులకు, సన్నిహితులకు కట్టబెట్టడమే మోడీ తరహా అభివృద్ధి అని ఆమె ధ్వజమెత్తారు. దేశాన్ని మోడీ తరగతి గదిగా భావిస్తున్నారని దుయ్యబట్టారు. తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలి లోక్‌సభ స్థానంలో ప్రియాంకగాంధీ శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ గుజరాత్ తరహా అభివృద్ధి నమూనా గురించి ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ‘మీ స్నేహితులకు వేలాది ఎకరాల భూమిని కారుచౌకగా పందేరం చేయడాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు’ అంటూ మోడీనుద్దేశించి వ్యాఖ్యానించారు. తన అభివృద్ధి నమూనాలో రైతులు, కార్మికుల పరిస్థితి ఎలా ఉందీ... మహిళల కోసం ఏం చేశారో ప్రజలకు చెప్పాలని మోడీకి సవాలు విసిరారు.
మోడీ తన ప్రసంగాల్లో.. కాంగ్రెస్ అవినీతికి చిహ్నంగా ‘ఏబీసీ’ (ఆదర్శ్ స్కాం, బోఫోర్స్, కోల్ స్కాం) అనే పదాలను, యూపీఏ పాలన ‘ఆర్‌ఎస్‌వీపీ’ (రాహుల్, సోనియా, వాద్రా, ప్రియాంక) నమూనా అంటూ ఒక వ్యక్తి ఐదేళ్లలో లక్ష రూపాయల నుంచి రూ.400 కోట్ల స్థాయికి ఎదిగారంటూ వ్యాఖ్యలు చేయడంపై ప్రియాంకగాంధీ మండిపడ్డారు. ఇలాంటి ప్రకటనలు తక్షణం ఆపేయాలని, ఇందుకు బదులుగా ప్రజలకు తానేం చేయాలనుకుంటున్నారో చెప్పుకోవాలని సూచించారు. ‘‘మీరు మాట్లాడుతోంది స్కూలు పిల్లలతో కాదు.. దేశ ప్రజలతో అన్న విషయాన్ని మరువొద్దు’’ అని ఆమె సూచించారు. ‘‘మీ మచ్చలేని రాజకీయాలు ఎలాంటివో ప్రజలు అర్థం చేసుకున్నారు. నిన్న(గురువారం) మీ పక్కన నుంచుని ప్రజలకు అభివాదం చేస్తున్నవారే ఇందుకు ఉదాహరణ’’ అని అంటూ వారణాసిలో మోడీ నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో మోడీ అనుచరుడు అమిత్ షా పాల్గొనడాన్ని ప్రస్తావించారు. అధికారాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న మోడీ ఆలోచన సరికాదని విమర్శించారు.