* కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించండి: నరేంద్ర మోడీ
* విద్వేష రాజకీయాలు చేసేది
* సోనియా కుటుంబమేనని విమర్శ
శ్రీనగర్ (ఉత్తరాఖండ్): దేశ ప్రజలను దోచుకుని, ఆ సొమ్మును విదేశాల్లో దాచుకున్న ఈ దోపిడీదారుల ప్రభుత్వాన్ని సాగనంపాలని బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ తల్లీకుమారులు కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారని, పైగా దీనిపై ఏమాత్రం చింతించడం లేదంటూ సోనియాగాంధీ, రాహుల్‌లపై మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ.. సోనియాగాంధీ కుటుంబంపై విరుచుకుపడ్డారు. ‘‘బోఫోర్స్ కుంభకోణాన్ని మరిచిపోయినట్లుగా ప్రజలు అన్నీ మరిచిపోతారని ఆ తల్లీకుమారులకు హోంమంత్రి షిండే చెబుతారు. యూపీఏ అవినీతి, పాలనా వైఫల్యం వంటివాటన్నింటినీ ప్రజలు మర్చిపోతారని వారు అనుకుంటారు. వాళ్లు దోచుకుని విదేశాల్లో దాచుకున్న డబ్బు మొత్తం తిరిగి రావాలంటే.. ముందు ఢిల్లీలో ఉన్న ఆ దోపిడీదారుల ప్రభుత్వాన్ని సాగనంపాలి..’’ అని మోడీ పిలుపునిచ్చారు. ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఆ తల్లీ కొడుకులు పేదరికంలో ఉన్న కష్టాలేమిటో ఏనాడూ తెలుసుకోలేదని విమర్శించారు.
రాహుల్ భయ్యా..!: రాహుల్‌గాంధీని తరచూ కొత్త తరహాలో విమర్శించే నరేంద్ర మోడీ శనివారం.. ‘రాహుల్ భయ్యా..’ అంటూ మాట్లాడారు. మోడీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ రాహుల్ చేసిన విమర్శలపై స్పందిస్తూ... ‘‘రాహుల్ భయ్యా నాపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాడు. విద్వేష రాజకీయాలు చేసింది వారి కుటుంబమే. సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టగానే.. అప్పటి చీఫ్ సీతారాం కేసరిని రోడ్డు మీద పడేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సొంత పార్టీ సీఎంనే రాజీవ్‌గాంధీ అవమానించారు. మన్మోహన్ కేబినెట్ రూపొందించిన ఆర్డినెన్స్ ప్రతిని రాహుల్ బహిరంగంగానే చించి పారేశారు. ఇక సోనియా దేశంలో సంస్కరణలకు ఆద్యుడైన సొంత పార్టీ ప్రధాని పీవీ నరసింహారావు పార్థివ దేహాన్ని కూడా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోని రానివ్వలేదు. ఢిల్లీలో అంత్యక్రియలు చేయనివ్వలేదు..’’ అని మోడీ మండిపడ్డారు.
వృత్తి స్వేచ్ఛ కోసం డీడీ పోరాటం: మోడీ
అహ్మదాబాద్: ప్రభుత్వ ప్రసార సంస్థలో జర్నలిజం పరమైన స్వేచ్ఛ దిగజారి పోతుండటంపై నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. వృత్తి స్వేచ్ఛను కొనసాగించేందుకు దూరదర్శన్ పోరాడుతుండటం చాలా బాధ కలిగిస్తోందన్నారు. శనివారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం పురస్కరించుకుని మోడీ ట్విట్టర్‌లో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పనిలోపనిగా తాను దూరదర్శన్‌కిచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలను ప్రసారభారతి తొలగించడం, ఆలస్యంగా ప్రసారం చేయడంపై తలెత్తిన వివాదానికి మరింత ఆజ్యం పోశారు. ఎమర్జెన్సీ రోజుల్లో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ అణచివేతకు గురికావడాన్ని మనమంతా చూశామన్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికే మచ్చ అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, మోడీ ఇంటర్వ్యూకు సంబంధించిన వివాదంపై విచారణ అవసరమా? లేదా? అనే అంశంపై ప్రసారభారతి సోమవారం నిర్ణయం తీసుకోనుంది.
దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపండి
Published Sun, May 4 2014 3:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement