మీ ప్రచారానికి నిధులెక్కడివి?
* మోడీని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ
* జీవితాంతం అమేథీలోనే ఉంటా
* ఎన్నికల తర్వాత ప్రత్యర్థులు పారిపోతారు
అమేథీ: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి నిధులెక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాషాయ పార్టీ ప్రచారానికి కార్పొరేట్లు నిధులు కుమ్మరిస్తున్నారని ఆరోపించారు. భారీ కటౌట్లు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారని, వీటికి నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. శనివారం తన సొంత నియోజకవర్గం అమేథీలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. బీజేపీ, మోడీలపై విరుచుకుపడ్డారు.
మోడీ రూ.26 వేల కోట్ల విలువైన విద్యుత్‌ను, రూ. 15 వేల కోట్ల విలువైన భూమిని ఒక కార్పొరేట్ అధిపతికి కట్టబెట్టారని, ఇది ఓ ఏడాదిలో కేంద్రం ఉపాధి హామీ ద్వారా పేదలకు అందించిన రూ. 30 వేల కోట్ల కంటే అధికమని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికలు రెండు సిద్ధాంతాలకు మధ్య పోరాటంగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ మతాలన్నిటినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తుంటే.. ప్రత్యర్థులు విద్వేష రాజకీయాలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. తాము ఏటీఎం ను పేదలకు ఇవ్వాలని భావి స్తోం టే.. ప్రత్యర్థులు ఏటీఎంలను తమ వద్దే ఉంచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అమేథీలో తన ప్రత్యర్థులు స్మృతి ఇరానీ, కుమార్ విశ్వాస్‌లపైనా ఆయన విరుచుకుపడ్డారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు గాంధీ కుటుంబంతో ప్రజల సత్సంబంధాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత వారు పారిపోతారని చెప్పారు. కొందరు వస్తుంటారు పోతుంటారని, తాను జీవితాంతం ఇక్కడే ఉంటానని ఆయన ఉద్వేగంగా చెప్పారు.
మోడీది విభజన నమూనా: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారతదేశ విభజన నమూనాకు నరేంద్రమోడీ నేతృత్వం వహిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఓట్లు కొల్లగొట్టేందుకు మతతత్వ కార్డుతో బీజేపీ నేతలు జనం ముందుకు వస్తున్నారని మండిపడింది. ప్రధాని పదవికి పోటీపడుతున్న మోడీ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారని కేంద్రమంత్రి కపిల్ సిబల్ ఆరోపించారు.
థర్డ్ ఫ్రంట్‌కు మద్దతివ్వం
సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మూడో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ మద్దతిస్తుందని వస్తున్న వార్తలను రాహుల్‌గాంధీ కొట్టిపారేశారు. ఎన్నికల తర్వాత తాము ఏ కూటమికీ మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లౌకిక కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం ఉందని శుక్రవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత మూడో కూటమికి మద్దతిస్తారా అని రాహుల్‌ను విలేకరులు ప్రశ్నించగా.. తమ పార్టీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందని చెప్పారు. ఎన్నికల అనంతరం పొత్తులపై విలేకరులు గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో తాము ఏ కూటమికీ మద్దతివ్వబోమన్నారు.