రాహుల్ కు కనీస జ్ఞానం లేదు
గుజరాత్ గురించి ఆయనకు ఏమీ తెలియదు: మోడీ
సునామీ వస్తుందని కాంగ్రెస్‌కు తెలిసినా ప్రధానికి తెలియట్లేదు
ఖెరాలు(గుజరాత్): గుజరాత్‌పై కాంగ్రెస్ అవగాహన లేమికి రాహుల్ గాంధీ ఓ నిదర్శనమని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. ఆయన సోమవారం గుజరాత్‌లోని ఖెరాలు పట్టణంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘‘మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే.. రాహుల్ గాంధీ ప్రసంగాలు వినండి. ఆయన లెక్కల ప్రకారం.. గుజరాత్‌లో 27 వేల కోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయట. గుజరాత్ మొత్తం జనాభా ఆరు కోట్లయితే ఇన్ని ఖాళీలెక్కడి నుంచి వచ్చాయి? గుజరాత్ గురించి రాహుల్‌కు ఏమీ తెలియదు. అతడు ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. గుజరాత్‌లో లోకాయుక్త లేదన్నాడు. ఆయన తెలుసుకోవాల్సిందేంటంటే.. గుజరాత్‌లో లోకాయుక్త ఉంది. అది తన మొదటి రిపోర్టును అసెంబ్లీకి సమర్పించింది కూడా’’ అని మోడీ విరుచుకుపడ్డారు.
‘‘రాహుల్ భాయ్ మీకు కనీసం ఈ మాత్రం జ్ఞానం కూడా లేకపోతే.. భారత్ ఏమైపోతుంది?’’ అని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నర్మద డ్యామ్ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. గుజరాత్‌కు అన్యాయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తనను ఏదో రకంగా వివాదాస్పదం చేయడానికి చాలా ప్రయత్నిస్తోందన్నారు. తాను అసలు టీ అమ్మేవాడినా కాదా అని తెలుసుకోవడానికి తన స్వస్థలం వాద్‌నగర్‌కు 100 మందిని పంపిందని ఆరోపించారు. ప్రధాని మన్మోహన్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. సునామీ వస్తుందని కాంగ్రెస్‌కు తెలిసినా, ప్రధానికి తెలియట్లేదన్నారు.
మోడీపై ఒమర్, ఫరూక్ విమర్శలు
‘‘జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేయాలని మోడీ యోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యంకాదు. మోడీ సాబ్.. మీరు ప్రధాని అభ్యర్థి అయినా ఓట్లు అడగడానికి కాశ్మీర్‌కు వచ్చే ధైర్యం లేదు మీకు. ఇక్కడి ప్రజల గుండెల్లో మీకు చోటులేదు’’ అని కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా సోమవారం శ్రీనగర్‌లో విమర్శించారు. దీనిపై మోడీ తీవ్రంగా స్పందించారు. కాశ్మీరీ పండిట్లను ఇక్కడి నుంచి తరిమేసిన ఈ తండ్రీకొడుకులకు మరొకరిని విమర్శించే అర్హత లేదన్నారు.