రాహుల్.. హద్దు మీరొద్దు!
నరేంద్ర మోడీ హెచ్చరిక
హవాలా స్కామ్‌తో సోనియా సహాయకుడికి సంబంధం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను అబద్ధాలకోరు అని విమర్శించడంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి ఘాటుగా స్పందించారు. రాహుల్ నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు, మురికి ఆరోపణలు చేస్తున్నారని, ఆయన హద్దుల్లో ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల ముందుకొచ్చి జవాబు చెప్పాలని, పారిపోకూడదని అన్నారు. మోడీ శనివారం త్రీడీ హాలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగం ఏడు రాష్ట్రాల్లోని 125 చోట్ల ప్రసారమైంది. అబ ద్ధాలు చెప్పందే మోడీకి నిద్ర పట్టదని రాహుల్ శనివారం చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. ‘తమ్ముడూ.. రాహుల్! నీ అబద్ధాలు అన్ని హద్దులూ దాటుతున్నాయి. నీ గురించి, మీ అమ్మ గురించి, మీ ప్రభుత్వం గురించి సానుకూలంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుక అబద్ధాలాడుతున్నావు. విషయాలను హద్దు మీరనివ్వొద్దు’ అని అన్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీపైనా నిప్పులు చెరిగారు. 10 జనపథ్(సోనియా నివాసం) సన్నిహితుడికి ఆదాయపన్ను శాఖ దాడులు జరిపిన మాంసం ఎగుమతిదారుడితో సంబంధాలున్నాయని, వారి మధ్య డబ్బు లావాదేవీలు జరిగాయని ఆరోపించారు.
ఆ వ్యాపారికి చెందిన 60 ప్రదేశాల్లో ఐటీ దాడులు జరిగాయని, అతని సంభాషణల టేపుల్లో 10 జనపథ్ ప్రస్తావన ఉందన్నారు. అందులో 10 జనపథ్ సన్నిహితుడి సంభాషణలు కూడా ఉన్నాయని, అతడెవరో దేశానికి తెలియాలన్నారు. నల్లధనం కేసు ఎదుర్కొంటున్న పుణే వ్యాపారి హసన్ అలీని తల్లీకొడుకుల(సోనియా, రాహుల్) ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ప్రధాని మన్మోహన్ కు ధరల పెరుగుదల, అవినీతి కనిపించడం లేదని విమర్శించారు. ‘ఏమీ చూడలేని మీకు బీజేపీ హవా కూడా ఎలా కనిపిస్తుందిలెండి ’ అని ఎద్దేవా చేశారు. అంతకుముందు గుజరాత్‌లో ఎన్నికల సభల్లో మాట్లాడుతూ.. సోనియా సహాయకుడికి మాంసం ఎగుమతులకు సంబంధించిన కోట్లాది రూపాయల హవాలా స్కామ్‌తో సంబంధముందన్నారు.