'భర్త తప్పు ల్ని భార్య వెనకేసుకు రావడం సహజం'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై బీజేపీ విమర్శనాస్త్రాలను తీవ్రం చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే తన భర్త రాబర్ట్ వాద్రాపై బీజేపీ ఆరోపణలకు దిగుతుందన్న ప్రియాంక వ్యాఖ్యలను బీజేపీ సరికొత్తగా చమత్కరించింది. ఎక్కడైనా భర్త తప్పు చేస్తే భార్య వెనకేసుకు రావడం సహజంగా జరిగే ప్రక్రియేనని బీజేపీ నేత షహనాజ్ హుస్సేన్ తెలిపారు. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ తన భర్త వాద్రాపై ఆరోపణలను ఖండిస్తుందన్నారు. ఇది ఒక భారతదేశ భార్యగా ఆమె తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని ఎద్దేవా చేశారు. భారతీయ సంప్రదాయాలను ప్రియాంక సరైన రీతిలో పాటిస్తుందంటూ చురకలంటించారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లోక్ సభకు పోటీ చేసే వారణాసిలో ఎన్నికల ప్రచారం చేయనని తేల్చిచెప్పిన ప్రియాంకకు ఆ నియోజకవర్గంలో అంత సీన్ లేదని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఆమె ప్రచారానికి ఆ లోక్ సభ స్థానంలో ప్రచారానికి వెళ్లడం లేదని హుస్సేన్ అన్నారు. అసలు కాంగ్రెస్ కంచుకోటలైన అమేథీ, రాయ్ బరేలీలోనే ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని, ఇంకా ఆమె వారణాసి ప్రచారానికి వచ్చే చేసేదేమీ లేదన్నారు. అయినా ఆమెకు ఇష్టమైతే ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. అందుకు ఎవరు అనుమతి అక్కర్లేదు'అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతల్ని కీలుబొమ్మలుగా చేసి రాబర్ట్ వాద్రా అధికమొత్తంలో లబ్ది పొందారని హుస్సేన్ తెలిపారు.