అందుకే ప్రియాంకను పిలుస్తున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమయ్యారని, అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీని దింపాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని, అందులో నాయకులు పరిమితమని అన్నారు.
‘ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ విషయం వారి అంతర్గత వ్యవహారం. అయితే మూడు విషయాలు స్పష్టమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నుంచి ఎప్పటికీ బయటకురాలేదు. గాంధీ కుటుంబంలోనే నాయకత్వాన్ని కోరుకుంటోంది. రాహుల్ విఫలమయ్యారు కాబట్టే ప్రియాంకను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. రాహుల్ రాజకీయాల్లో విజయవంతం అయుంటే ప్రియాంకను పిలిచేవారు కాదు’ అని పాత్రా అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ ఇటీవల ప్రియాంకను కలసి, యూపీ ప్రచార బాధ‍్యతలు చేపట్టాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇందుకు ప్రియాంక అంగీకరించినట్టు సమాచారం.