తమ్ముడు దారి తప్పాడు!
-
వరుణ్‌గాంధీపై ప్రియాంక సంచలన ఆరోపణలు
-
ఎన్నికల్లో అతన్ని గెలిపించొద్దని ప్రజలకు విజ్ఞప్తి
-
ఎవరు దారి తప్పారో ప్రజలే నిర్ణయిస్తారన్న వరుణ్ తల్లి
న్యూఢిల్లీ: అసలే ఉప్పు, నిప్పుగా ఉండే సోనియాగాంధీ, మేనకాగాంధీ కుటుంబాలు రాజకీయంగా మరోసారి కత్తులు దూసుకున్నాయి. మాటల తూటాలు సంధించుకున్నాయి. తన చిన్నాన్న సంజయ్‌గాంధీ కుమారుడు, తనకు తమ్ముడయ్యే వరుణ్‌గాంధీపై ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. వరుణ్ దారితప్పాడని ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుణ్‌ను ఎన్నికల్లో గెలిపించరాదని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం అమేథీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ఫిల్‌బిత్ సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ ఈసారి ఎన్నికల్లో అమేథీ పక్క నియోజకవర్గమైన సుల్తాన్‌పూర్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ‘‘వరుణ్‌గాంధీ కచ్చితంగా మా కుటుంబానికి చెందిన వ్యక్తే. అతను నాకు తమ్ముడే. కానీ అతను దారితప్పాడు. కుటుంబంలో అందరికన్నా చిన్నోడు తప్పుడు బాటను ఎంచుకుంటే పెద్దలే అతనికి సరైన మార్గాన్ని చూపుతారు. అందువల్ల నా తమ్ముడికి సరైన మార్గం చూపాలని కోరుతున్నా’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. వరుణ్ రాజకీయంగా ముందుకు సాగాలంటే మంచి మనసుతో అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. ‘‘దేశ ఐక్యత కోసం మనస్ఫూర్తిగా ఓటు వేయాలని కోరేందుకే నేను ఇక్కడకు (సుల్తాన్‌పూర్) వచ్చా. ఈసారి మీ నియోజకవర్గం గురించే కాకుండా యావత్ దేశం గురించి ఆలోచించండి. కుటుంబంలోని చిన్న వ్యక్తికి సరైన బాట చూపేలా తెలివిగా ఓటు వేయండి’’ అని కోరారు.
ప్రజలే నిర్ణయిస్తారు: మేనక
ప్రియాంక విమర్శలపై వరుణ్‌గాంధీ తల్లి, బీజేపీ నాయకురాలు మేనకాగాంధీ దీటుగా స్పందించారు. ఎవరు తప్పు దోవలో వెళ్లారో దేశమే నిర్ణయిస్తుందనిఆదివారం వ్యాఖ్యానించారు. దేశ సేవలో ఒకవేళ అతను తప్పుడు బాటలో పయనించి ఉంటే దేశమే దానిపై నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు వరుణ్‌గాంధీకి బీజేపీ బాసటగా నిలిచింది. వరుణ్ సరైన దారిలోనే ప్రయాణిస్తున్నారని, దేశాన్ని ఎవరైనా తప్పుదోవ పట్టించారంటే అది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు.