మన్మోహన్ ఒక సూపర్ పీఎం:ప్రియాంక గాంధీ
ఆమేథీ: పీఎంవోలో ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర నామమాత్రమేనని ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకంలో పేర్కొనడంతో విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పుస్తకంపై ఎవరెన్ని విమర్శలు చేసినా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ లు మాత్రం మౌనాన్ని మాత్రం వీడటం లేదు. అయితే సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ మాత్రం ఆ పుస్తకం నెలకొన్న వివాదానికి తెరదించేందుకు తొలిసారి పెదవి విప్పారు.
మన్మోహన్..ఒక సూపర్ పీఎం అంటూ అభినందనల వర్షం కురిపించారు. అసలు ఆ విషయాన్ని ఇప్పుడు బయటకు తీసుకురావడం వెనుక కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉందన్నారు. ఆ పుస్తకానికి అసలు విలువలేదని, అది పూర్తిగా అనైతికమని ఆమె అభివర్ణించారు. ఆయన(మన్మోహన్) దేశం గర్వించదగ్గ ప్రధాని మంత్రి అని ఆమె కొనియాడారు. యూపీఏ పది సంవత్సరాల పాలనలో ఆయన ఒక గొప్ప ప్రధానిగా సేవలందిచారన్నారు. ఇదిలా ఉండగా ప్రియాంకాకు మన్మోహన్ కుమార్తె ఉపేందర్ సింగ్ కూడా జతకలిశారు. ఎన్నికలముందు ఆ పుస్తకం విడుదల చేయడం వెన్నుపోటు రాజకీయాల్లో భాగంగానే జరిగిందన్నారు. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్- ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ పేరుతో బారు రాసిన పుస్తకంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.