'లక్ష్మణ రేఖ గీసుకోవాల్సిందే..'
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ పనితీరును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా విమర్శించారు. స్వేచ్ఛ పేరుతో అన్ని విషయాల్లో ముఖ్యంగా కార్యనిర్వాహక విషయాల్లోకి ప్రవేశించకూడదని అన్నారు. అంతేకాదు.. న్యాయవ్యవస్థ తనకు తాను ఓ లక్ష్మణ రేఖ గీసుకుంటే మంచిదని కూడా హితవు పలికారు. ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కార్ప్స్(ఐడబ్ల్యూపీసీ)తో మాట్లాడుతున్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం పేరిట కార్యనిర్వాహక శాఖ అంశాలను స్పృశించేలాగా న్యాయ వ్యవస్థ నిర్ణయాలు ఉండరాదని చెప్పారు.
'న్యాయ సమీక్ష అనేది న్యాయవ్యవస్థకు ధర్మబద్ధమైనది. కానీ, అదే సమయంలో ఆ శాఖలోని అన్ని విభాగాలు వాటికవి లక్ష్మణ రేఖలు గీసుకోవాలి. లక్ష్మణ రేఖ ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. కార్యనిర్వాహక సంబంధమైన అంశాలు కార్యనిర్వాహక శాఖే తీసుకుంటుంది. న్యాయశాఖ కాదు' అని చెప్పారు. కార్యనిర్వాహక శాఖకు న్యాయశాఖలు ప్రత్యామ్నాయం కాదు. నా పని నేను చేస్తాను. మూడు విధులు నువ్వే (న్యాయశాఖ) చేస్తానంటే అవి అందుబాటులో ఉండవు' అని చెప్పారు.