సమ్మె సైరెన్‌ | Union Federations Called For A Strike Aganist Central Govt policies | Sakshi
Sakshi News home page

సమ్మె సైరెన్‌

Published Thu, Nov 26 2020 10:02 AM | Last Updated on Thu, Nov 26 2020 10:06 AM

Union Federations Called For A Strike Aganist Central Govt policies - Sakshi

కరీంనగర్‌: కేంద్రప్రభుత్వ విధానాలకు నిరసనగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు కార్మికలోకం సన్నద్ధమైంది. కేంద్రం కార్మిక చట్టాల సవరణ నిలిపివేయాలని, రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని తొమ్మిది కార్మిక సంఘాలతోపాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రక్షణ, ఫార్మారంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఫెడరేషన్లు సమ్మెకు  పిలుపునిచ్చాయి.  సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు జిల్లావ్యాప్తంగా ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, టీఎన్‌టీయూసీ, ఏఐయూటీసీ కార్మికల సంఘాలు సిద్ధమయ్యాయి. కార్మికులను సమ్మెలో భాగస్వాములను చేసేందుకు నాయకులు రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, మోటర్‌ సైకిల్‌ ర్యాలీలు, కరపత్రాల పంపిణీలు, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించారు. కార్మికులు పనిచేసే సంస్థలకు సమ్మె నోటీసులు అందజేశారు. ఇప్పటికే జిల్లాస్థాయి సన్నాహక సదస్సు ఏర్పాటు చేసి సార్వత్రిక సమ్మె రోజున జిల్లాకేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. షాపింగ్‌మాల్స్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసే కార్మికులకు కూడా ప్రత్యేక టీంల ద్వారా సమ్మె ప్రాధాన్యతను వివరించారు. 

జిల్లాలో కార్మికులు
జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో 1.8 లక్షలమంది కార్మికులు, ఇతర రంగాలలో మరో 1.5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. రైస్‌మిల్లు కార్మికులు 40 వేల మంది, ఐసీడీఎస్‌ 11 వేల మంది, ఐకేపీ 4,720 మంది, గ్రామపంచాయతీ కార్మికులు 8 వేల మంది, ఆశ కార్యకర్తలు 6,470 మంది, ఫీల్డ్‌ అసిస్టెంట్లు 7,460 మంది సమ్మెలో పాల్గొననున్నారు. కరోనాకాలంలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు తీవ్ర దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొన్ని కంపెనీలు అసలు జీతాలు ఇవ్వకుండానే కార్మికులను తొలగించాయి. మరికొన్ని కంపెనీలు  సగం జీతంతో పని చేయించాయి. దీంతో కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా సమ్మెతప్ప మరో మార్గం లేదని నిర్ణయానికి వచ్చి సమ్మెకు సై అంటున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్, స్కీంవర్కర్లకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనాకాలంలో భవన నిర్మాణ కార్మికులకు రూ.1500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వేలాదిమంది నిరాశకు లోనయ్యారు.

        ప్రధాన డిమాండ్లు
∙    లేబర్‌కోడ్‌లను, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. 
∙    ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం నిలిపివేయాలి. 
∙    అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి.
∙    కోవిడ్‌ను సాకుగా చూపి ఉద్యోగాల నుంచి తొలగించడం, వేతనాల్లో కోత పెట్టడం నిలిపివేయాలి. 
∙    అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను, రైల్వే, రక్షణ, ఎల్‌ఐసీ, బ్యాంకులు ప్రైవేటీకరించరాదు. 
∙    వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి ఆహారభద్రతను దెబ్బతీసే చట్టాలను రద్దు చేయాలి.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తోంది. సంఘం ఏర్పాటు చేసుకోవడం నుంచి సమ్మె చేయడం వరకు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ ఒక్కొక్కటిగా సంస్కరణల పేరిట నిర్వీర్యం చేస్తోంది. సార్వత్రిక  సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని కార్మికుల శక్తిని చాటాలి.  
                                                                                                                                            – పొనగంటి కేదారి,సీపీఐ జిల్లా కార్యదర్శి
రాజ్యాంగబద్ధంగా కార్మికులకు చెందాల్సిన హక్కులను కాలరాయడం అప్రజాస్వామికం. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మిక చట్టాలు నిర్వీర్యమయ్యాయి. ఎల్‌ఐసీ, బ్యాంకింగ్‌ రంగ సంస్థ, బీఎస్‌ఎన్‌ఎల్, విమానాయానం లాంటి సంస్థలనే ప్రైవేట్‌ పరం చేయడం దుర్మార్గం. సార్వత్రికసమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. 
                                                                                                                                       – గీట్ల ముకుందరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement