ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న వీఆర్‌ఏలు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య భద్రత, పింఛన్, పదోన్నతులకు ఆమడ దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో కొలువులు చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులు, పిల్లల విద్య, వైద్యం వ్యయాలను తాము భరించలేకపోతున్నామని, బతుకుబండి లాగాలంటే తమకు పేస్కేల్– ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. డిమాండ్ల సాధనకు 28 రోజులుగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నారు.
గ్రామాల్లో కీలకం..
రాష్ట్రంలో మొత్తం 23,000 మంది వీఆర్‌ఏలు ఉన్నారు. అందులో 20,000 మంది ఇదే వృత్తిని సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. వీరిలో గరిష్టంగా 80 ఏళ్ల వయసు వారు కూడా వీఆర్‌ఏలుగా కొనసాగుతున్నారు. వీరంతా రూ.10,500 వేతనంతో బతుకుబండి నెట్టుకువస్తున్నారు. కాగా, 23,000 మందిలో 3,000 మంది 2012లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యారు.
వీరిలో 60 శాతం మంది మహిళలు ఉన్నారు. పంటల నమోదు, గ్రామాల్లో చెరువులను, కుంటలను, కుంట శిఖాలను, ప్రభుత్వ భూములను పరిరక్షించడం వీరి విధుల్లో ముఖ్యమైనవి. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు వారికి క్షేత్రస్థాయిలో సహకారం అందింస్తుంటారు. గ్రామాల్లో కీలకంగా ఉన్నా.. వీరికి ఎలాంటి పేస్కేలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, బీమా, పింఛన్ వంటి సదుపాయాల్లేవు. 24 గంటల్లో ఏ క్షణమైనా విధులకు వెళ్లాల్సి ఉంటుంది.
పనిభారం పెరిగినా.. పదోన్నతుల్లేవు!
కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారికి ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. 2017లో వీరిలో అర్హులకు ప్రమోషన్లు రావాల్సి ఉండగా.. జిల్లాల విభజన వీరికి శరాఘాతంగా మారింది. అదనపు జిల్లాలు, మండలాలు, రెవెన్యూడివిజన్లతో పనిభారం పెరిగింది. వాస్తవానికి సర్వీస్‌రూల్స్ ప్రకారం.. మూడేళ్ల తరువాత వీఆర్‌ఏలను అటెండర్, నైట్ వాచ్‌మన్, జీపు డ్రైవర్‌గా ప్రమోట్ చేయాలి. అయితే వీరిలో కొందరు ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కనీసం పింఛన్ సదుపాయం కూడా లేదు. ఇపుడున్న వీఆర్‌ఏలలో చాలామంది 40 ఏళ్లు సర్వీసు ఉన్న వారూ నామమాత్రం వేతనానికి పనిచేస్తున్నారు.
పదోన్నతులు ఇవ్వాల్సిందే
దశాబ్దాలుగా పనిచేస్తున్నా మాకు కనీస హక్కులు అమలు కావడం లేదు. 2017లో సీఎంతో వీఆర్‌ఏలు భేటీ అయిన సందర్భంలో అర్హతలు ఉన్న వారికి వివిధ దశల్లో పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. కారుణ్యనియామకాల ద్వారా వచ్చిన వీఆర్‌ఏలకు డబుల్ బెడ్‌రూం, అటెండర్ ఉద్యోగాలిస్తామన్న హామీలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు.
– కందుకూరి బాపుదేవ్, వీఆర్‌ఏ రాష్ట్ర సహాధ్యక్షుడు
మెటర్నిటీ లీవులు కరువు
దేశంలో మహిళలకు, అందులోనూ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెటర్నిటీ లీవులు విధిగా ఇవ్వాలి. కానీ, ఇంతవరకూ వీఆర్‌ఏలకు ఇది అమలు కావడం లేదు. గర్భిణులుగా ఉన్నా.. రాత్రీ పగలు లేకుండా.. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నాం. బాలింతలు కూడా డ్యూటీలు చేయాల్సిన దుస్థితి ఉంది.
– కంది శిరీషారెడ్డి, రాష్ట్ర జేఏసీ కో–కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment