కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు కార్మికుల నిరసన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కరీంనగర్/మంచిర్యాల: బొగ్గుగనులు భగ్గుమన్నాయి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా గుర్తింపు సంఘం సైతం సమ్మెకు సై అంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ మొత్తం సింగరేణినే ‘బ్లాక్’చేశారు. సమ్మె తొలిరోజు గురువారం నల్లబంగారు లోకం నిర్మానుష్యమైంది. సింగరేణి కార్మికుల సమ్మె తొలిరోజు విజయవంతమైంది. గనులన్నీబోసిపోయాయి. దేశం లో 88 బొగ్గుగనులు, తెలంగాణలోని కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీ– 3, శ్రావణపల్లి ఓసీ, కేకే– 6 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నల్లసూరీళ్లు 72 గంటల సమ్మెకు దిగారు.
దీంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 11 ఏరియాలు, నాలుగు రీజియన్ల పరిధిలోని 25 ఓపెన్ కాస్టులు, 20 భూగర్భగనుల్లో డంపర్లు, డోజర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మొదటి, రెండో షిఫ్టుల్లో మొత్తం 34,777 మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, వారిలో అత్యవసర సేవల సిబ్బంది 4,625 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 29,247 మంది సమ్మెలో పాల్గొనగా, 905 మంది సెలవుపెట్టారు.
25 వేలమంది కాంట్రాక్ట్ కార్మికుల్లో 10 శాతం మాత్రమే విధులకు హాజరయ్యారు. తొలిరోజు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సంస్థకు సుమారు రూ.80 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కార్మికులు సైతం వేతనాల రూపంలో రూ.20 కోట్లు కోల్పోయారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్యాలయం ముందు టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్ సంఘాలు నాయకులు ధర్నా చేశారు.
సమ్మెలో తొలిసారిగా గుర్తింపు సంఘం
సింగరేణి గుర్తింపుసంఘం టీబీజీకేఎస్ కూడా సమ్మెలో భాగస్వామ్యమైంది. 20 12లో సింగరేణిలో జరిగిన ఎన్నికల్లో టీబీ జీకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. అంతకుముందు గుర్తింపుపొందిన సంఘాలేవీ ఆయా సందర్భాల్లో జరిగిన సమ్మెల్లో పాల్గొనలేదు. ప్రతిపక్ష సంఘాల తో గుర్తింపు సంఘం కూడా సమ్మెకు దిగ డం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి.
చర్చలు విఫలం
హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్(ఆర్‌ఎల్‌సీ) వద్ద గురువారం కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మొత్తం 12 డిమాండ్లలో ఏ ఒక్క దానినీ యాజమాన్యం అంగీకరించలేదని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వి.సీతారామయ్య తెలిపారు. శుక్రవారం కూడా చర్చలు కొనసాగనున్నాయి.
సమ్మెకు మావోల మద్దతు..!
సింగరేణి కార్మికుల సమ్మెకు మావోయిస్టు పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ అధికార ప్రతినిధి ప్రభాత్ పేరిట ఓ లేఖ విడుదలైంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరాడాలని పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment