సింగరేణి కార్మికుల మూడు రోజుల సమ్మె ప్రారంభం | Singareni: All Trade Unions Of SCCL To Go On Three Day Strike | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుల మూడు రోజుల సమ్మె ప్రారంభం

Published Thu, Dec 9 2021 3:21 AM | Last Updated on Thu, Dec 9 2021 9:38 AM

Singareni: All Trade Unions Of SCCL To Go On Three Day Strike - Sakshi

సాక్షి, మంచిర్యాల/సాక్షి, ప్రతినిధి కరీంనగర్‌: సింగరేణిలో సమ్మె ఖాయమైంది. బొగ్గుబావుల్లో గురువారం (ఈ నెల 9) నుంచి 11 వరకు సమ్మె కొనసాగనుంది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రాం తీయ కార్మిక శాఖ కమిషనర్‌ నేతృత్వంలో డైరెక్టర్‌(పా) ఎన్‌.బలరాం, జీఎం(పర్సనల్‌) ఆనంద్‌రావుతో.. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్, ఏఐటీ యూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు, బీఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి మాధవ్‌నాయక్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులను వేలం నుంచి తీసేయాలని, ప్రైవేటీకరణ ను ఆపాలనే ప్రధాన డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. సమ్మె కారణంగా గురువారం ఉదయం మొదటి షిఫ్టు నుంచే బొగ్గు బావుల్లో ఉత్పత్తి నిలిచిపోయే అవకాశముంది. ఖ మ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మం చిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల పరి«ధిలోని 11 ఏరియాల్లో 19 ఓపెన్‌ కాస్టులు, 23 భూగర్భ గనుల్లోని మొత్తం 42 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు.

వీరితోపాటు 25 వేలమంది కాంట్రాక్టు కార్మికులు విధులకు దూరంగా ఉండే అవకాశముంది.అత్యవసర సేవలు, సివిల్, కొన్నివిభాగాల్లో పనులు కొనసాగనున్నాయి. మొదట టీజీబీకేఎస్‌ ఈ నెల 25న సమ్మె నోటీసు ఇవ్వగా తర్వాత జాతీయ సంఘాలు జత కలిశాయి. నోటీసు అందినప్పటి నుంచి సమ్మె నిలుపుదలకు యాజమాన్యం విఫలప్రయత్నం చేసింది. 

ప్రైవేటీకరణే ప్రధానంగా...  
కేంద్రం దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు నోటిఫై చేసి 41 గనులను వేలానికి పెట్టింది. వీటిలో సింగరేణికి చెందిన కళ్యాణిఖని బ్లాక్‌–6, శ్రావణ్‌పల్లి, సత్తుపల్లి బ్లాక్‌–3, కోయగూడెం బ్లాక్‌–3 ఉన్నాయి. ఇప్పటికే ఈ నాలుగు గనుల భూ సేకరణ, ఇతర పెట్టుబడుల కోసం సింగరేణి రూ.750 కోట్లు ఖర్చు చేసింది.

కేంద్రం 49, రాష్ట్రం 51 శాతం వాటాతో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కూడా ప్రైవేటు పోటీదారులతో వేలంలో పాల్గొని బ్లాక్‌లు దక్కించుకోవాల్సి ఉంది. ఇది భవిష్యత్తులో కొత్త గనుల ఏర్పాటుపై ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే కార్మికులు ఆందోళన బాటపట్టారు. 

సమ్మె డిమాండ్లు...  
బొగ్గు బ్లాక్‌ల వేలం రద్దు చేయాలి 
భూగర్భ, ఓపెన్‌ కాస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కార్మికుల నియామకాలు చేపట్టవద్దు 
ఎస్సార్పీ 3, మణుగూరు ఓసీపీ ప్రమాదంలో చనిపోయినవారికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా. 
కోవిడ్‌తో చనిపోతే ఎక్స్‌గ్రేషియా రూ.15 లక్షలకు పెంచాలి  
పెండింగ్‌లో ఉన్న వారసత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి 
వారసుల వయస్సు 35 నుంచి 40కి పెంచాలి 
ఆదాయ పన్ను మినహాయించాలి  

ప్రైవేటీకరణకు వ్యతిరేకం: అధికారుల సంఘం  
సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(సీఎంఓఏఐ) పూర్తిగా వ్యతిరేకమని అధ్యక్షుడు జక్కం రమేశ్, కార్యదర్శి రాజశేఖర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను సంస్థకే కేటాయించాలని కోరారు. ప్రైవేటీకరణ వల్ల సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సింగరేణి వ్యాప్తంగా.. 
రోజువారీ బొగ్గు ఉత్పత్తి: 2 లక్షల టన్నులు 
ఉత్పత్తి నష్టం : రూ.53 కోట్లు 
జీతాల రూపేణా: రూ.20 కోట్లు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement