VRAs
-
మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే ఈ నియామకాలను పూర్తిచేసి.. గతంలో రెవె న్యూ సిబ్బంది అందించిన అన్ని సేవలను మళ్లీ వారికే అప్పగించనుంది. మొత్తంగా రాష్ట్రంలోని 10,909 రెవెన్యూ గ్రామాలకు మళ్లీ రెవెన్యూ అధికారులు రానున్నారు.గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో... పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. మిగతా వారిలో తగిన విద్యార్హతలు ఉన్న వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, నియామకాలు చేపట్టనున్నారు. అయి తే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభు త్వం ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదు. ఇబ్బందులు రాకుండా ప్రణాళిక.. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రాతిపదికలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టు తెలిసింది. ఈ అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్వోలు, వీఆర్ఏలుగా నియమితులైన వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి రానున్నారు. దాదాపు మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసి.. వివిధ శాఖల్లోకి వెళ్లిన వారిలో డిగ్రీ, ఇంటర్ అర్హతలను గుర్తించి వేర్వేరుగా ఈ పరీక్ష (రెవెన్యూ సేవలే సిలబస్‌గా) నిర్వహించనున్నారు. పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. నేడు వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం పూర్వ వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం ఆదివారం శామీర్‌పేట మండలంలోని తూంకుంట గ్రామంలో జరగనుంది. తెలంగాణ వీఆర్వోల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో... గ్రూప్–4 ఉద్యోగ నియామకాల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అసోసియేషన్ అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లిన పూర్వ వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. -
TS: వీఆర్ఏల సర్ధుబాటు.. జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు
-
TS: వీఆర్ఏల సర్ధుబాటు.. జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వీఆర్ఏల సర్దుబాటుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు గురువారం ఆదేశాలిచ్చింది. ఇక, వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు జీవోను సస్పెండ్ చేసింది. జీవోలకు ముందు యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే వీఆర్ఏల పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: బుద్వేల్ భూముల వేలం.. తొలి సెషన్లో రికార్డులు బ్రేక్ చేసిన ప్లాట్స్ -
వీఆర్ఏల సర్దుబాటు షురూ
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. పలు ప్రభుత్వశాఖల్లో వారిని విలీనం చేసేందుకు వీలుగా 14,954 సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూతోపాటు మిషన్ భగీరథలో వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ బుధవారం జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండలస్థాయిలో ఏ పోస్టులో ఎంతమందిని నియమించాలో ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ఇలా... రెవెన్యూశాఖ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో 16, డివిజన్లో 7, మండల స్థాయిలో ఐదుగురిని నియమించాలని, రికార్డు అసిస్టెంట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో ముగ్గురు, డివిజన్లో నలుగురు, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని వెల్లడించారు. ఇక, ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో 12 మంది, డివిజన్లో నలుగురిని, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని, చైన్మెన్లుగా డివిజన్, మండల స్థాయిలో ఒక్కరు చొప్పున నియమించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథలో... మిషన్ భగీరథకు సంబంధించి ప్రతి రూరల్ మండలంలో ఆరుగురుని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో సూచించారు. మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లు, సాగునీటిశాఖలో లస్కర్లుగా ఎంత మంది వీఆర్ఏలను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై ఆయా శాఖలు త్వరలోనే స్పష్టత ఇస్తాయి. -
గుడ్ న్యూస్: వీఆర్ఏల కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు, ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. వీఆర్ఏలను పలు శాఖల్లో విలీనం చేసుకునేందుకు వీలుగా ఆయా శాఖల్లో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించేందుకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. ఈ మేరకు 14,954 సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్, మున్సిపల్ శాఖలో 1,266 వార్డు ఆఫీసర్లు (జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ), రెవెన్యూ శాఖలోనే 2,113 రికార్డు అసిస్టెంట్లు, 679 సబార్డినేట్/చైన్‌మెన్ పోస్టులు, సాగునీటి శాఖ పరిధిలో 5,073 లస్కర్లు, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథలో 3,372 హెల్పర్ పోస్టులను కల్పించేందుకు అనుమతిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా శాఖల వారీగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు కల్పిస్తున్నారన్న దానిపై స్పష్టతనిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు! -
కలెక్టర్ల నేతృత్వంలో వీఆర్ఏల విలీనం.. మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకునే ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఈ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చారు. వీఆర్ఏల విలీన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఖాళీల గుర్తింపు ప్రకటన నుంచి కేటాయింపు వరకు కలెక్టర్లే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. 61 ఏళ్లు నిండితే కారుణ్య ఉద్యోగం 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల కుమారుడు లేదా కుమార్తెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. కారుణ్య ఉద్యోగం కోసం ఈ ఏడాది జూలై 31 నాటికి వీఆర్ఏ వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నియామకాల కోసం దరఖాస్తు ఫార్మాట్‌ను రూపొందించారు. దీని ప్రకారం దరఖాస్తు చేసుకోవడంతో పాటు సదరు వీఆర్ఏ కూడా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర కుటుంబసభ్యుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) సమరి్పంచాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, విద్యార్హత, కుల, నివాస ధ్రువపత్రాలు, ఆధార్ వివరాలను జత పరచాల్సి ఉంటుంది. ఈ కారుణ్య నియామకాల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీఆర్ఏల విలీనం మార్గదర్శకాలివే.. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విస్ రూల్స్‌లోని రూల్ 10(ఏ) ప్రకారం వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకుంటారు. ఇదే నియమం ప్రకారం కారుణ్య నియామకాలు కూడా చేపడతారు. విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ శాఖల్లోని చివరి స్థాయి సర్విసు/రికార్డు అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్ తత్సమాన హోదాల్లో వీఆర్ఏలను రెగ్యులర్ స్కేల్ ఉద్యోగులుగా తీసుకుంటారు. జిల్లాల వారీగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆయా హోదాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఆ జిల్లాలో విలీనం చేసుకోవాల్సిన వీఆర్ఏల సంఖ్యను కలెక్టర్లు ప్రకటించాలి.వాటి ఆధారంగా వీఆర్ఏల విలీనం, కారుణ్య నియామకాల కోసం అవసరమైతే రెగ్యులర్ లేదా సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లాలో ఉన్న ఖాళీలకు మించి వీఆర్ఏలను విలీనం చేసుకోవాల్సి వస్తే వారిని ఇతర జిల్లాలకు కూడా పంపవచ్చు. అలా పంపాల్సి వస్తే సదరు వీఆర్ఏల వివరాలను ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. అలా ప్రకటించిన తర్వాత సదరు వీఆర్ఏలు తమకు కేటాయించిన జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లా కలెక్టర్ వీఆర్ఏను ఏదైనా శాఖలో విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అదే జిల్లాలో సర్దుబాటు చేసినా, ఇతర జిల్లాలకు పంపినా కలెక్టర్ కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే తహసీల్దార్లు వీఆర్ఏలను రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఏ శాఖలకు పంపితే ఆయా శాఖల సర్వీసు రూల్స్ వీఆర్ఏలకు వర్తిస్తాయి. ఒక్కసారి కేటాయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదు. తమను మార్చాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఉండదు. కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీఆర్ఏలు సంబంధిత అధికారికి రిపోర్టు చేయాలి. ఆ అధికారి బేషరతుగా వారిని విధుల్లోకి తీసుకుని పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయండి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మల్టిజోన్లలోని ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే తహసీల్దార్లను విధుల్లోకి తీసుకోవాలని, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్లు కూడా పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 మందికి పైగా తహసీల్దార్లు గత నెల 31న బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇలావుండగా తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన మరో 9 మందికి మంగళవారం పోస్టింగులిస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
జీవో 81ను సవరణ చేయాలని వీఆర్ఏల డిమాండ్
-
Telangana VRAs: ‘పది’ పూర్తయితేనే పేస్కేల్!.. సర్కార్ చెప్తున్నదేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మందికి పైగా గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) పనిచేస్తుండగా, వారిలో పదో తరగతి, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న వారికే పేస్కేల్ వర్తింపజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు వీఆర్ఏ జేఏసీకి చెందిన 12 మంది నేతలతో జరిపిన చర్చల సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. చదువు లేని వాళ్లకు ఉద్యోగాలు క్రమబద్ధీకరించి వారికి పేస్కేల్ వర్తింపజేసేందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అసలు విద్యార్హత లేని 5వేల మందితో పాటు పదో తరగతిలోపు చదువుకున్న 7వేల మంది కలిపి మొత్తం 12 వేల మందికి పేస్కేల్ ఇచ్చే పరిస్థితి లేదని, ఏదైనా విషయం ఉంటే సీఎం కేసీఆర్ వద్ద మాట్లాడుకోవాలని జేఏసీ నేతలకు మంత్రి కేటీఆర్ చెప్పారని అంటున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ నేతలు చేసిన మరో ప్రతిపాదన కూడా సాధ్యం కాదనే రీతిలో అధికారులు బదులిచ్చినట్టు తెలుస్తోంది. విద్యార్హతలు సరిపోని వీఆర్ఏల కుటుంబ సభ్యులకు కారుణ్య ఉద్యోగాలిచ్చి, వారిలో విద్యార్హతలున్న వారికి పేస్కేల్ వర్తింపజేయాలని జేఏసీ నాయకులు కేటీఆర్‌ను కోరగా, అలాంటి ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తారని స్పష్టం చేశారని చెబుతున్నారు. అధికారులు మాత్రం తగిన విద్యార్హతలు లేకుండా, కారుణ్య నియామకాలిచ్చి పేస్కేల్ వర్తింపజేయడం న్యాయపరమైన సమస్యలకు దారితీస్తుందని చెప్పినట్టు సమాచారం. కాగా, సమ్మె కాలపు వేతనం, సమ్మెకాలంలో మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు ఆర్థిక సాయం, వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు లాంటి అంశాల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, త్వరలోనే సీఎం కేసీఆర్ వద్ద చర్చలుంటాయని మంత్రి కేటీఆర్ జేఏసీ నేతలకు చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో సమావేశం తర్వాత ఎవరికి పేస్కేల్ ఇవ్వాలనే అంశం తేలుతుందని, ఆ తర్వాతే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు కూడా వస్తాయని జేఏసీ నేతలు చెపుతున్నారు. -
వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పది రోజుల్లో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని, పేస్కేలు కల్పించి క్రమబద్ధీకరిస్తామని, 55 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పిస్తామని, వీఆర్ఏల సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని 2017లో మహా శివరాత్రి పండుగ రోజు ప్రగతిభవన్, మంత్రులు, ఉన్నతాధికారుల సాక్షిగా సీఎం హామీ ఇచ్చి ఐదేళ్లవుతున్నా నెరవేర్చలేదని విమర్శించారు. మరోవైపు 2020లో అసెంబ్లీలో రెవెన్యూ చట్టం ప్రవేశపెడుతూ వీఆర్ఏలందరికీ పే స్కేల్ కల్పించి క్రమబద్ధీకరిస్తానని చెప్పి 22 నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని.. వీఆర్ఏలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన సీఎస్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని పొన్నం గుర్తు చేశారు. -
తండ్రి లాంటి సీఎంకు కోపమేల: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు కోపం వచ్చినా వెంటనే తమ పిల్లలను దగ్గరకు తీసుకుంటారని, అలాగే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి సీఎం పోస్టులో ఉన్న కేసీఆర్‌కు వీఆర్ఏలపై కోపం తగదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. మూడు నెలలుగా వీఆర్ఏలకు జీతాలు లేవని, వారంతా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా అయినా వారి సమస్యలను పరిష్కరించి దసరా కానుక ఇవ్వాలని ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి అన్నారు. సమ్మెలో ఉన్న వారంతా జీతాలు లేక అవస్థల పాలవుతున్నారని, ఈ సమ్మె కాలంలోనే 28 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్ అమలు చేయాలని, పదోన్నతులు, వారసులకు ఉద్యోగాలిచ్చే జీవోలను విడుదల చేయాలని కోరారు. సీఎం పెద్ద మనసుతో ఆలోచించి వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తిచేశారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
తగ్గేదేలే.. 20లోపు జీవో రాకపోతే ఉద్యమం ఉధృతం: వీఆర్ఏలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ హామీతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వీఆర్ఏలు అన్నారు. మంత్రిపై తమకు నమ్మకం ఉందన్నారు. ఆందోళన విరమించాలన్న కేటీఆర్ ప్రతిపాదనలపై చర్చిస్తున్నామని వీఆర్ఏ నేతలు పేర్కొన్నారు. ఈ నెల 20లోపు జీవో రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాగా, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టిన వీఆర్ఏ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వీఆర్ఏల సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అంతవరకు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్ వెల్లడించారు. చదవండి: వీఆర్ఏల ఆందోళన.. తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్ -
Telangana VRAs: ప్రభుత్వంతో ముగిసిన వీఆర్ఏల చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు ముగిశాయి. వీఆర్ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఆందోళన విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం వీఆర్ఏలు మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. చదవండి: TS: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే? తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
హైదరాబాద్‌లో హై టెన్షన్.. అసెంబ్లీ టూ ప్రగతి భవన్ రోడ్డు మూసివేత!
సాక్షి, తెలంగాణ: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించారు. వీఆర్ఏలు, పలు ప్రజాసంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వీఆర్ఏలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు, వీఆర్ఏల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. వీఆర్ఏలపై లాఠీచార్జ్ చేశారు. కాగా, పెద్ద ఎత్తున జిల్లాల నుంచి వీఆర్ఏలు హైదరాబాద్‌కు తరలివచ్చినట్టు సమాచారం. అయితే, వీఆర్ఏల సమస్యలపై జిల్లాలో, గ్రామాల్లో వీఆర్ఏలు గత 50 రోజుల నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇందిరా పార్క్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, పే స్కేల్ అమలు చేయాలంటూ వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి కార్పొరేషన్ కోసం రెడ్డి సంఘం ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని మత్య్సకారులు, సింగరేణి కార్మికులు నిరసనలు తెలిపారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల అమలుకు జీవో జారీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, అసెంబ్లీ ముట్టడికి ఏడు సంఘాలు ప్రయత్నించినట్టు సమాచారం. -
ఉద్యోగ భద్రత లేదా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య భద్రత, పింఛన్, పదోన్నతులకు ఆమడ దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో కొలువులు చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులు, పిల్లల విద్య, వైద్యం వ్యయాలను తాము భరించలేకపోతున్నామని, బతుకుబండి లాగాలంటే తమకు పేస్కేల్– ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. డిమాండ్ల సాధనకు 28 రోజులుగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో కీలకం.. రాష్ట్రంలో మొత్తం 23,000 మంది వీఆర్ఏలు ఉన్నారు. అందులో 20,000 మంది ఇదే వృత్తిని సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. వీరిలో గరిష్టంగా 80 ఏళ్ల వయసు వారు కూడా వీఆర్ఏలుగా కొనసాగుతున్నారు. వీరంతా రూ.10,500 వేతనంతో బతుకుబండి నెట్టుకువస్తున్నారు. కాగా, 23,000 మందిలో 3,000 మంది 2012లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యారు. వీరిలో 60 శాతం మంది మహిళలు ఉన్నారు. పంటల నమోదు, గ్రామాల్లో చెరువులను, కుంటలను, కుంట శిఖాలను, ప్రభుత్వ భూములను పరిరక్షించడం వీరి విధుల్లో ముఖ్యమైనవి. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు వారికి క్షేత్రస్థాయిలో సహకారం అందింస్తుంటారు. గ్రామాల్లో కీలకంగా ఉన్నా.. వీరికి ఎలాంటి పేస్కేలు, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, పింఛన్ వంటి సదుపాయాల్లేవు. 24 గంటల్లో ఏ క్షణమైనా విధులకు వెళ్లాల్సి ఉంటుంది. పనిభారం పెరిగినా.. పదోన్నతుల్లేవు! కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారికి ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. 2017లో వీరిలో అర్హులకు ప్రమోషన్లు రావాల్సి ఉండగా.. జిల్లాల విభజన వీరికి శరాఘాతంగా మారింది. అదనపు జిల్లాలు, మండలాలు, రెవెన్యూడివిజన్లతో పనిభారం పెరిగింది. వాస్తవానికి సర్వీస్‌రూల్స్ ప్రకారం.. మూడేళ్ల తరువాత వీఆర్ఏలను అటెండర్, నైట్ వాచ్‌మన్, జీపు డ్రైవర్‌గా ప్రమోట్ చేయాలి. అయితే వీరిలో కొందరు ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కనీసం పింఛన్ సదుపాయం కూడా లేదు. ఇపుడున్న వీఆర్ఏలలో చాలామంది 40 ఏళ్లు సర్వీసు ఉన్న వారూ నామమాత్రం వేతనానికి పనిచేస్తున్నారు. పదోన్నతులు ఇవ్వాల్సిందే దశాబ్దాలుగా పనిచేస్తున్నా మాకు కనీస హక్కులు అమలు కావడం లేదు. 2017లో సీఎంతో వీఆర్ఏలు భేటీ అయిన సందర్భంలో అర్హతలు ఉన్న వారికి వివిధ దశల్లో పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. కారుణ్యనియామకాల ద్వారా వచ్చిన వీఆర్ఏలకు డబుల్ బెడ్రూం, అటెండర్ ఉద్యోగాలిస్తామన్న హామీలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. – కందుకూరి బాపుదేవ్, వీఆర్ఏ రాష్ట్ర సహాధ్యక్షుడు మెటర్నిటీ లీవులు కరువు దేశంలో మహిళలకు, అందులోనూ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెటర్నిటీ లీవులు విధిగా ఇవ్వాలి. కానీ, ఇంతవరకూ వీఆర్ఏలకు ఇది అమలు కావడం లేదు. గర్భిణులుగా ఉన్నా.. రాత్రీ పగలు లేకుండా.. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నాం. బాలింతలు కూడా డ్యూటీలు చేయాల్సిన దుస్థితి ఉంది. – కంది శిరీషారెడ్డి, రాష్ట్ర జేఏసీ కో–కన్వీనర్ -
బతుకమ్మ, బోనాలతో వీఆర్ఏల నిరసన
సాక్షి, నెట్వర్క్: ప్రభుత్వం ప్రకటించిన విధంగా తమకు పేస్కేళ్లు, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్లతో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె కొత్తరూపం దాల్చింది. గురువారం తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకమ్మ, బోనాల ప్రదర్శనలతో నిరసనలు తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో 25 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా కొత్త తరహా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ నాయకులు రాజయ్య, వంగూరు రాములు, దాదేమియా, వెంకటేష్ యాదవ్, శిరీషారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఆడవాళ్లదీ.. అదే దైన్యం!
సాక్షి నెట్వర్క్: ‘ప్రసూతి కోసం వెళ్లినా జీతం కట్.. పిల్లకు పాలిద్దామన్నా గంట సమయం కూడా ఇవ్వరు. పనిచేస్తున్న ప్రదేశంలోనే పాలిచ్చే పరిస్థితి. ఊరందరి సమస్యను మా సమస్యగా భావించే మేము, మా సమస్య వచ్చే సరికి ఎవరికీ కాకుండా పోయాం..’ఇదీ రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు రెండువేల మంది మహిళా వీఆర్ఏల మనోవేదన. 2014లో నిర్వహించిన వీఆర్ఏ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సుమారు 55 శాతం మంది మహిళలే ఎంపికయ్యారు. తాజాగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, వీఆర్ఏలకు సర్వీస్ రూల్స్, డ్యూటీ చార్ట్‌లేవీ అమల్లోకి రాలేదు. దీంతో మహిళా వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు, ఇసుక రవాణాను అడ్డుకునే డ్యూటీలు వేస్తుండటం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వీఆర్ఏపై కొందరు దాడికి దిగారు. జీతాల్లో కోత పెడుతున్నారు.. వీఆర్ఏల సర్వీస్ క్రమబద్ధీకరణ ఆలస్యం అవుతుండటంతో సెలవులు, పని గంటలు అనేవి ఏవీ లేకుండాపోయాయి.పై అధికారి అనుమతితో సెలవుపై వెళితే జీతంలో కోత విధిస్తున్నారని చెబుతున్నారు. తల్లులు చంటిపిల్లలతో విధుల్లో పాల్గొనాల్సి వస్తోందని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా వీఆర్ఏ శుక్రవారం సాక్షి ప్రతినిధితో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే జిల్లాలోని కొందరు తహశీల్దార్లు తమతో కొప్పులు, జడలు వేయించుకుంటున్నారని మరో మహిళా వీఆర్ఏ వాపోయారు. -
నిర్మల్: టెన్నిస్ కోర్టుకు మళ్లీ వీఆర్ఏలు
సాక్షి,నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ టెన్నిస్ ఆట వ్యవహారం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. నిర్మల్ టెన్నిస్ కోర్టులో మళ్లీ వీఆర్ఏలకు డ్యూటీలు విధించారు. దీంతో వీఆర్ఏలు విధులకు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ తాను టెన్నిస్ ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ చర్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా గురువారం సైతం వీఆర్ఏలకు టెన్నిస్ కోర్టు వద్ద డ్యూటీలు విధించడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. తమకు టెన్నిస్ కోర్టు వద్దే ప్రతి సాయంత్రం డ్యూటీలు విధించారని.. అందుకోసమే ఏం చేయాలో తెలియక ఇక్కడే విధులు నిర్వహస్తామంటున్నారు వీఆర్ఏలు. అయితే తాము టెన్నిస్ కోర్టుకు వచ్చేసరికి ఇంకా కలెక్టర్ టెన్నిస్ కోర్టు వద్దకు రాలేదని వీఆర్ఏలు పేర్కొన్నారు. ప్రతి రోజూ డే అంతా ఇక్కడే డ్యూటీ చేస్తామని అన్నారు. వెనకాల ఇద్దరు.. నెట్ మధ్యలో ఇద్దరం ఉంటామని చెప్పారు. ఈ రోజు టెన్నిస్ కోర్టుకు నలుగురు వీఆర్ఏలు వచ్చామని అన్నారు. సాయంత్రం స్పెషల్ డ్యూటీ టెన్నిస్ కోర్టులో వేస్తారని తెలిపారు. -
వీఆర్ఏలు కట్టుబానిసలా.. అసెంబ్లీ సాక్షిగా మీరిచ్చిన హామీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పరిస్థితి కట్టుబానిసల్లా తయారైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పేరుకే పార్ట్టైమర్లు అయినా వారితో ఫుల్‌టైమ్ పనిచేయించుకుం టున్నారని, గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారే తప్ప వారి సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రభు త్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు మంగళవారం రేవంత్‌రెడ్డి బహి రంగ లేఖ రాశారు. ఏళ్ల తరబడి పదోన్నతులు లేక, చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న వీఆర్ఏల బాధ వర్ణనాతీతమని, ఉపాధి హామీ కూలీలకంటే దీనమైన స్థితిలో వారు కాలం వెళ్లదీస్తున్నారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతం, పని ఒత్తిడితో గుండె పోటుకు గురై కొందరు చనిపోతుంటే, మరికొం దరు ఆత్మహత్యలు చేసు కుంటున్నారని వెల్లడించారు. (చదవండి: రాష్ట్రాన్నే సరిగ్గా పాలించట్లేదు.. దేశాన్ని ఏలతారట ) రాష్ట్రంలో పనిచేస్తున్న 23 వేల మంది వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామని 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నిం చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టో లేనట్టో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. వీఆర్ఏలు రోడ్డెక్కేం దుకు కారణమైన మీరే, వారి సమస్యలను పరిష్క రించాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరిం చారు. సీఎం హామీ ఇచ్చిన విధంగా వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజే యాలని, అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, సొంత గ్రామాల్లో వారికి డబుల్బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని, విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. (చదవండి: కరోనాను మించి ముంచుతోంది!) -
ఆందోళనలో ఆ 22 వేల మంది ఉద్యోగులు.. కేసీఆర్ కనికరిస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా (వీఆర్ఏ) పని చేస్తున్న 22 వేల మంది సిబ్బంది పరిస్థితి డోలాయమానంలో పడింది. ఏళ్ల తరబడి వేతనాలు పెరగకపోవడం, పదోన్నతులు రాకపోవడంతో పాటు వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తమ భవిష్యత్తు ఏంటనే బెంగ వీఆర్ఏలు, వారి కుటుంబ సభ్యులకు పట్టుకుంది. తమను రెవెన్యూలోనే కొనసాగిస్తారా? ఎంతమందిని కొనసాగిస్తారు? ఇతర శాఖలకు పంపుతారా? అసలు ఉద్యోగాలను ఉంచుతారా? తీసేస్తా రా? అనే సందేహాలు వీఆర్ఏ వర్గాల్లో వ్యక్తమ వుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు పేస్కే ల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళన బాట పట్టారు. అన్నీ పెండింగ్‌లోనే.. క్షేత్రస్థాయిలో జరిగే రెవెన్యూ కార్యకలాపాలకు సహాయకులుగా ఉండేందుకు ప్రభుత్వం వీఆర్ఏలను నియమించింది. వీరిలో కొందరిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయగా, చాలామందిని నేరుగానే నియమించింది. 2007 నుంచి వీరికి నెలకు రూ.10,500 వేతనం ఇస్తున్నారు. టీఏ, డీఏలు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,400, పట్టణ ప్రాంతాల్లో రూ.11,500 చొప్పున వేతనం వస్తోంది. అయితే తమకు ఉద్యోగ భద్రత కోసం పేస్కేల్ వర్తింపజేయాలని వీఆర్ఏలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పేస్కేల్ అమల్లోకి వస్తే హెల్త్‌కార్డులు వస్తాయని, టీఏ, డీఏలతో పాటు అన్ని అల వెన్సులు క్రమం తప్పకుండా పెరుగుతాయనే ఆలోచనతో వీఆర్ఏలు ఈ డిమాండ్ చేస్తు న్నారు. వాస్తవానికి వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పదోన్నతులు ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలకు అవకాశమిస్తామని కూడా హామీ ఇచ్చారు. వీటితో పాటు డైరెక్ట్ వీఆర్ఏల సర్వీసులను క్రమబద్ధీకరించే అంశం కూడా పెండింగ్‌లోనే ఉంది. మూడు రకాలుగా వర్గీకరణ! విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తోన్న వీఆర్ఏలను మూడు రకాలుగా వర్గీకరించాలని ఉన్నతస్థాయిలో ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. అందులో 3,300 మందికి పైగా వీఆర్ఏలను సాగునీటి శాఖలో లష్కర్లుగా పంపాలన్న దానిపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. ఇక మిగిలిన వారిని స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పేరుతో వర్గీకరించారు. స్కిల్డ్ ఉద్యోగులను రెవెన్యూలోనే కొనసాగించాలని, గ్రామానికొకరిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, మిగిలిన 8–9 వేల మందిని అన్‌స్కిల్డ్ కేటగిరీలో చేర్చగా, వీరిని ఏం చేస్తారన్నదే తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే వీఆర్ఏలు సోమ, మంగళ వారాల్లో ధర్నాలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏ, వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ కోరారు. వీఆర్ఏల డిమాండ్లివే.. ♦సీఎం హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్ వర్తింపజేయాలి. ♦55 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ♦అర్హులైన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. ♦అందరికీ సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ♦విధుల్లో భాగంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. -
‘చదువుకోవడానికి సరిపడ పుస్తకాలు లేవన్నా..’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర సాగుతున్న మార్గంలో అన్ని వర్గాల ప్రజలు టీడీపీ ప్రభుత్వ హయంలో తాము పడుతున్న కష్టాలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన వి భానమ్మ అనే మహిళ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి తనను అకారణంగా తొలగించారని తెలిపారు. అలాగే చాపరకు చెందిన రాజారావు కుటుంబ సభ్యులు జననేతను కలిసి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ కుమారుడికి చికిత్స చేయించే ఆర్థిక స్థోమత తమ వద్ద లేదని వాపోయారు. ఉద్యోగ భద్రతల కల్పించాలని కోరుతూ.. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను వీఆర్ఏలు కలిశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జననేత దృష్టికి తీసుకువచ్చారు. తమకు జీతాలు కూడా సరిగా రావడం లేదని వైఎస్ జగన్‌కు తెలిపారు. స్కూలు పిల్లల ఆవేదన.. వైఎస్ జగన్‌ను కలిసిన చాపర జడ్పీ స్కూల్ విద్యార్థులు తమకు అరకొరగా పుస్తకాలు పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని తెలిపారు. ఒక పుస్తకాన్ని ఇద్దరు, ముగ్గురు పంచుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు దగ్గర పడుతున్న పదో తరగతి పుస్తకాలు ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీ అందక ఇబ్బందులు పడుతున్నాం.. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసిన పాతపట్నం రైతులు తాము ఎదురుకుంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రుణమాఫీ అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఏక కాలంలో రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకులు తిరిగి రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను బ్యాంకర్లు ఎగవేతదారులుగా చూస్తునారనే అవమాన భారంతో కుంగిపోతున్నామని అన్నారు. తిత్లీ బాధితుని ఆవేదన.. జాడుపల్లి గ్రామానికి చెందిన రైతు కోట భీముడు తన ఆవేదనను జననేతతో చెప్పుకున్నారు. తుపాన్ వల్ల 6 ఎకరాల్లో వేసిన పంట నష్టపోవాల్సి వచ్చిందని.. అయిన ప్రభుత్వం నుంచి రూపాయి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములపై హక్కు లేదంటున్నారు.. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను సీతారామపల్లి గ్రామస్తులు కలిశారు. తరతరాలుగా 200 ఎకరాల భూమిని సాగు చేస్తున్నామని.. ఇప్పుడు అధికారులు వాటిపై తమకు ఎలాంటి హక్కులు లేవంటున్నారని జననేతకు తమ ఆవేదనను తెలిపారు. -
కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు హెచ్చరించారు. వీఆర్ఏల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వీఆర్ఏలు స్థానిక కలెక్టరేట్ వద్ద రెండో రోజు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వీఆర్ఏలు ఐక్యంగా పోరాడుతున్నారని తెలిసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారి మధ్య చీలికలు తేవాలని చూస్తోందన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టి పాత, కొత్త వీఆర్ఏలందరూ ఐక్యంగా తమ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి, కె.ఏసురత్నం, ఎం.రాఘవులు, ఎస్కే.మస్తాన్, ఎ.రవికుమార్, కె.నాగరాజు, డి.వెంకటేశ్వరరావు, ఎం.చంటిబాబు, కె.నాగమ్మ, సీహెచ్.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు హెచ్చరించారు. వీఆర్ఏల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వీఆర్ఏలు స్థానిక కలెక్టరేట్ వద్ద రెండో రోజు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వీఆర్ఏలు ఐక్యంగా పోరాడుతున్నారని తెలిసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారి మధ్య చీలికలు తేవాలని చూస్తోందన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టి పాత, కొత్త వీఆర్ఏలందరూ ఐక్యంగా తమ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి, కె.ఏసురత్నం, ఎం.రాఘవులు, ఎస్కే.మస్తాన్, ఎ.రవికుమార్, కె.నాగరాజు, డి.వెంకటేశ్వరరావు, ఎం.చంటిబాబు, కె.నాగమ్మ, సీహెచ్.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏల వేతనం పెంపు
- రూ.10,500కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం - ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనాలు అమలులోకి - స్వగ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు - రెగ్యులర్ నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్ - రాష్ట్రంలోని 19,345 మంది వీఆర్ఏలకు ప్రయోజనం సాక్షి, హైదరాబాద్: వారసత్వంగా పనిచేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాలు కురిపించారు. వీఆర్ఏల వేతనాలను 64.61 శాతం పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. దీంతో ప్రస్తుతం నెలకు రూ.6,500గా ఉన్న వీఆర్ఏల వేతనం రూ.10,500కు పెరగనుంది. అదనంగా రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్‌ను కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా ఒక్కో వీఆర్ఏ వేతనం రూ.4,200 చొప్పున పెరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయి. గ్రామాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నందున ప్రతీ వారసత్వ వీఆర్ఏకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తమ స్వగ్రామంలో ఇల్లు కట్టివ్వాలని, వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీఆర్వో, అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో 30 శాతం ఉద్యోగాలు వీరికి రిజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. వెట్టి తదితర పేర్లతో పిలుస్తున్న వారందరినీ ఇకపై గౌరవంగా వీఆర్ఏలు అని సంబోధించాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో వారసత్వంగా పనిచేస్తున్న 19,345 మంది వీఆర్ఏలకు ప్రయోజనం చేకూరుతుంది. వీఆర్ఏ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వీఆర్ఏ(డైరెక్ట్ రిక్రూటీస్) సంఘం అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీధర్, మహిళా విభాగం అధ్యక్షురాలు బాలామణి, వీఆర్ఏ(డిపెండెంట్స్) సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లన్న, రాజయ్య, కార్మిక సంఘం నాయకులు జి.రాంబాబుయాదవ్, పి.నారాయణ తదితరులు సీఎంతో చర్చలు జరిపారు. ఒకటో తారీఖున వేతనం.. ‘ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి వీఆర్ఏలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా జీతాలను పెంచుతాం. ప్రతి నెలా ఒకటో తారీఖున మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నట్లే వీరికీ వేతనం అందాలి. వీఆర్ఏలకు గౌరవం కూడా పెరగాలి. వెట్టి, మస్కూరి, కావల్ కార్, కాన్ దార్ తదితర పేర్లతో వీరిని పిలుస్తున్నారు. ఇకపై అలా పిలవవద్దు. ఏ పని చేసే వారైనా సరే వీఆర్ఏ అని మాత్రమే పిలవాలి. పెరిగిన జీతం, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, పిలిచే పిలుపుతో వీఆర్ఏల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాలనేదే ప్రభుత్వ లక్ష్యం..’అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూటీల రెగ్యులరైజ్.. పబ్లిక్ సర్వీస్ పరీక్ష రాసి వీఆర్ఏలుగా పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ‘కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడం వల్ల చాలా పోస్టులు అవసరమవుతాయి. ఇంకా ప్రభుత్వంలో ఖాళీలను కూడా గుర్తించాలి. వీరందరినీ రెగ్యులర్ చేయాలి’అని సీఎం అన్నారు. వెంటనే విధివిధానాలు తయారు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటికీ.. తక్కువ వేతనంతో పని చేస్తున్న 2,900 మంది డెరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలకు లబ్ధి చేకూరుతుంది. -
వీఆర్ఏల వినూత్న నిరసన
హన్మకొండ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న డైరెక్టు రిక్రూట్మెంట్ వీఆర్ఏలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె బుధవారం నాటికి 14 రోజులకు చేరుకుంది. హన్మకొండలోని సమ్మె శిబిరం వద్ద వీఆర్ఏలు ఒంటి కాలిపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోషియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు కుల్ల కరుణాకర్, సహాధ్యక్షుడు ఇజ్జగిరి సతీష్, నాయకులు మండల దేవిక, పూజారి సురేష్, బి.రమేష్, ఎడ్ల రవి, యాదేష్, రాము, దివ్య, శ్వేత, నాగమణి, పద్మ పాల్గొన్నార -
వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలి
కొత్త జిల్లాలతో ఉద్యోగులపై పనిభారం ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ముకరంపుర : ఏపీపీఎస్సీ ద్వారా నియమించబడిన వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి పే స్కేలు వర్తింపజేయాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు కొనసాగిస్తున్న సమ్మె శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి, శ్రమదోపిడీపై స్పందించాల్సిందిగా కోరుతూ మానవlహక్కుల కమిషన్‌కు లేఖలు రాస్తానన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేసే వీఆర్ఏలు సమ్మెలో ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. తెలంగాణలో తాత్కాలిక ఉద్యోగాలు అనే మాట ఉండదని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పడంతో తాత్కాలిక ఉద్యోగులు రోడ్డునపడ్డారని అన్నారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు మినహా కిందిస్థాయి సిబ్బందిని నియమించకుండా వేగవంతమైన పరిపాలన ఎలా సాధ్యమన్నారు. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న ఉద్యోగులే 27 జిల్లాల్లో పని చేయాలంటే వారి విపరీతమైన భారం పడుతుందన్నారు. 58 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో రూ.63వేల కోట్ల అప్పులుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండేళ్లలోనే రూ.33 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. ఆగస్టులోనే రూ.9వేల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. రానున్న ఐదేళ్ల కాలంలో అప్పులు రూ.లక్ష కోట్లు దాటుతాయన్నారు. సమ్మెలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి బాపుదేవ్, జిల్లా కార్యదర్శి గోపు రామకృష్ణ, ఆనంద్‌కుమార్, రవి, తిరుపతి, సజిత్‌రెడ్డి, సంకీర్తన, నరేందర్‌రావు తదితరులున్నారు. వైఎస్సార్సీపీ సంఘీభావం వీఆర్ఏల సమ్మె శిబిరాన్ని వైఎస్సార్సీపీ నాయకులు సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కె.నగేష్, సెగ్గెం రాజేష్, సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, సంయుక్త కార్యదర్శి గడ్డం జలజరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేణి వేణుమాధవ్‌రావు, వినుకొండ రామకృష్ణారెడ్డి, మందరాజేష్, నాయకులు సిరి రవి, జక్కుల యాదగిరి, సాన రాజన్న, దుబ్బాక సంపత్, గండి శ్యామ్, కంది వెంకటరమణారెడ్డి, బండమీది అంజయ్య, పావురాల కనుకయ్య, చొక్కాల రాము, గంటుక పంపత్ తదితరులున్నారు.