సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మందికి పైగా గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) పనిచేస్తుండగా, వారిలో పదో తరగతి, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న వారికే పేస్కేల్ వర్తింపజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు వీఆర్‌ఏ జేఏసీకి చెందిన 12 మంది నేతలతో జరిపిన చర్చల సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం.
చదువు లేని వాళ్లకు ఉద్యోగాలు క్రమబద్ధీకరించి వారికి పేస్కేల్ వర్తింపజేసేందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అసలు విద్యార్హత లేని 5వేల మందితో పాటు పదో తరగతిలోపు చదువుకున్న 7వేల మంది కలిపి మొత్తం 12 వేల మందికి పేస్కేల్ ఇచ్చే పరిస్థితి లేదని, ఏదైనా విషయం ఉంటే సీఎం కేసీఆర్ వద్ద మాట్లాడుకోవాలని జేఏసీ నేతలకు మంత్రి కేటీఆర్ చెప్పారని అంటున్నారు.
ఈ సందర్భంగా వీఆర్‌ఏ జేఏసీ నేతలు చేసిన మరో ప్రతిపాదన కూడా సాధ్యం కాదనే రీతిలో అధికారులు బదులిచ్చినట్టు తెలుస్తోంది. విద్యార్హతలు సరిపోని వీఆర్‌ఏల కుటుంబ సభ్యులకు కారుణ్య ఉద్యోగాలిచ్చి, వారిలో విద్యార్హతలున్న వారికి పేస్కేల్ వర్తింపజేయాలని జేఏసీ నాయకులు కేటీఆర్‌ను కోరగా, అలాంటి ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తారని స్పష్టం చేశారని చెబుతున్నారు.
అధికారులు మాత్రం తగిన విద్యార్హతలు లేకుండా, కారుణ్య నియామకాలిచ్చి పేస్కేల్ వర్తింపజేయడం న్యాయపరమైన సమస్యలకు దారితీస్తుందని చెప్పినట్టు సమాచారం. కాగా, సమ్మె కాలపు వేతనం, సమ్మెకాలంలో మరణించిన వీఆర్‌ఏల కుటుంబాలకు ఆర్థిక సాయం, వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు లాంటి అంశాల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, త్వరలోనే సీఎం కేసీఆర్ వద్ద చర్చలుంటాయని మంత్రి కేటీఆర్ జేఏసీ నేతలకు చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో సమావేశం తర్వాత ఎవరికి పేస్కేల్ ఇవ్వాలనే అంశం తేలుతుందని, ఆ తర్వాతే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు కూడా వస్తాయని జేఏసీ నేతలు చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment