వీఆర్‌ఏల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు.
విజయవాడ: విజయవాడ లెనిన్ సెంటర్‌లో వీఆర్‌ఏలు సాగిస్తున్న నిరసన దీక్షలు శనివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. నాలుగు రోజులుగా నిరాహార దీక్షల్లో పాల్గొంటున్న కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో పోలీసులు దీక్షలను భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో వీఆర్‌ఏలు పోలీసులను అడ్డుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఉద్రికత్త పరిస్థితికి దారితీసింది. ఈ తోపులాటలో పలువురు వీఆర్‌ఏలకు గాయాలయ్యాయి. ఆరోగ్యం విషమించిన ఐదుగురిని బలవంతంగా ఆస్పత్రికి, దాదాపు 20 మందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు దీక్ష శిబిరాన్ని ఎత్తివేయటంతో ఆగ్రహానికి గురైన వీఆర్‌ఏలు పెద్ద సంఖ్యలో ఏలూరు రోడ్డులో రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో లక్ష్మణ్ అనే వీఆర్‌ఏ పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో తరలించినట్టు తెలిసింది. దాంతో వీఆర్‌ఏలలో ఆందోళన నెలకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, కనీస వేతనాల కోసం నాలుగు రోజులుగా ఐదుగురు వీఆర్‌ఏలు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.