విద్యార్హతల ఆధారంగా నియమించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం
గతంలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్‌ఏలు మళ్లీ రెవెన్యూ శాఖలోకి...
అందులో సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు నేరుగా విధుల్లోకి
మిగతా సుమారు 8 వేల పోస్టులకు రాతపరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే యోచన
డిగ్రీ, ఇంటర్ విద్యార్హత ఉన్నవారికి వేర్వేరుగా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే ఈ నియామకాలను పూర్తిచేసి.. గతంలో రెవె న్యూ సిబ్బంది అందించిన అన్ని సేవలను మళ్లీ వారికే అప్పగించనుంది. మొత్తంగా రాష్ట్రంలోని 10,909 రెవెన్యూ గ్రామాలకు మళ్లీ రెవెన్యూ అధికారులు రానున్నారు.
గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారిలో... పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. మిగతా వారిలో తగిన విద్యార్హతలు ఉన్న వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, నియామకాలు చేపట్టనున్నారు. అయి తే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభు త్వం ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదు.
ఇబ్బందులు రాకుండా ప్రణాళిక..
గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రాతిపదికలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టు తెలిసింది. ఈ అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా నియమితులైన వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి రానున్నారు. దాదాపు మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు. గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసి.. వివిధ శాఖల్లోకి వెళ్లిన వారిలో డిగ్రీ, ఇంటర్ అర్హతలను గుర్తించి వేర్వేరుగా ఈ పరీక్ష (రెవెన్యూ సేవలే సిలబస్‌గా) నిర్వహించనున్నారు. పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు.
నేడు వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం
పూర్వ వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం ఆదివారం శామీర్‌పేట మండలంలోని తూంకుంట గ్రామంలో జరగనుంది. తెలంగాణ వీఆర్వోల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో... గ్రూప్–4 ఉద్యోగ నియామకాల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అసోసియేషన్ అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లిన పూర్వ వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment