కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ
పటాన్‌చెరు: ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలలో భవంతులను నేలమట్టం చేశారు. అమీన్‌పూర్ రెవెన్యూ అధికారుల నివేదిక మేరకు హైడ్రా అధికారులు ఆయా నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు. కిష్టారెడ్డిపేట్‌లో మూడు పెద్ద భవనాలను, పటేల్‌గూడలో 22 విల్లాలను కూల్చివేశారు. ఈ ప్రక్రియ ఆదివారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. కూల్చివేతల కోసం భారీ క్రేన్లను వినియోగించారు.
అమీన్‌పూర్ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూల్చివేత ప్రక్రియలో పాల్గొన్నారు. పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటేల్‌గూడలో విల్లాలు నిర్మించిన యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. అయితే తాము ప్రభుత్వ భూమి పరిధిలోకి వచ్చే నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తహసీల్దార్ రాధ ఆయనకు వివరించారు. విల్లాల నిర్మాణానికి సర్వే నంబర్ 6 పరిధిలో అనుమతులు తీసుకొని సర్వే నంబర్ 12లో నిర్మిస్తున్నట్లు గుర్తించామని ఆమె స్పష్టం చేశారు.
కాబట్టి ఎలాంటి కోర్టు స్టే ఆర్డర్ కూల్చివేతల ప్రక్రియలకు అడ్డుకాదని చెప్పారు. కిష్టారెడ్డిపేట్‌లో సర్వే నంబర్ 164లో మూడు భవంతుల నిర్మాణాలు జరిగాయని, వాటిని కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. కిష్టారెడ్డిపేట్‌లో సర్వే నంబర్ 164లో ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేశారని వారికి నోటీసులు ఇచ్చి తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. కూల్చివేత ప్రక్రియకు ముందే హైడ్రా, రెవెన్యూ అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వ భూమి పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని పరిశీలించి కూల్చివేతలకు ఉపక్రమించారు.
సామాన్య ప్రజలకు, పరిసర నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్చివేతల్లో ఒక డాక్టర్ భవనం కూడా ఉండటం గమనార్హం. మరో భవనం ఏపీలోని ఒక ఎమ్మెల్యేకు సంబంధించిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పాట్లను కొనుగోలు చేసి నిర్మాణాలు చేశామే తప్ప.. కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మించలేదని వాదిస్తున్నారు.
మరిన్ని కూల్చివేతలు..
కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కిష్టారెడ్డిపేట్ పరిసర గ్రామాల పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో జరిగిన నిర్మాణాల కూల్చివేతకు అధికారులు నివేదిక రూపొందించినట్లు తెలిసింది.
పొరుగు గ్రామాల ప్రభుత్వ భూముల్లో కిష్టారెడ్డిపేట్ పంచాయతీ అనుమతులతో జరిగిన నిర్మాణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అదే గ్రామంలో చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూడా రెవెన్యూ అధికారులు గుర్తించి హైడ్రాకు నివేదిక ఇచ్చి నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment