
అధికారులను హెచ్చరించిన హైకోర్టు
హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పున్నా సెలవు రోజు కూల్చివేతలా?
చట్టాన్ని పాటించాల్సిందే.. ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: ఎన్నిసార్లు చెప్పినా.. చట్టాన్ని ధిక్కరించి మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సివస్తుందని హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ‘ఎందుకంత తొందర.. రాత్రికి రాత్రే హైదరాబాద్ నగరాన్ని మార్చలేరు. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు కాదు’అని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిబంధనలు పాటించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని పేర్కొంది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. ‘సరైన విచారణ నిర్వహించకుండా వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ఓసారి తెల్లవారుజామున 4 గంటలకు ప్రహరీ కూల్చివేశారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు.. అధికారులు అలా చేయరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆక్రమణల స్వాధీనానికి, అనుమతి లేని భవనాల కూల్చివేతకు మేం ఏ మాత్రం వ్యతిరేకం కాదు.
కానీ, ప్రతి దానికీ ఓ చట్టం అంటూ ఉంటుంది. దాన్ని ప్రతీ వ్యక్తి పాటించి తీరాల్సిందే’అని తేల్చిచెప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి సర్వే నంబర్ 296/ఇ/2 మూడు గుంటల భూమిలోని షెడ్‌ను ఎలాంటి సమాచారం లేకుండా (ఆదివారం) కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ కోర్టు ఎదుట హాజరుకావాలన్న ఆదేశాల మేరకు ఆయన న్యాయస్థానం ముందు హాజరయ్యారు.
ఇకపై జరగదంటూనే.. మళ్లీ అదే తప్పు
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ‘పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతిపత్రంపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. నాలా, సేల్ డీడ్, పంచాయతీ అనుమతులు ఇలా అన్ని డ్యాక్యుమెంట్లను ప్రవీణ్ సమర్పించారు. అయినా పట్టించుకోకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు రోజున కూల్చివేశారు’అని చెప్పారు.
హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ రవీందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పంచాయతీ కార్యదర్శి బలవంతంగా అనుమతులు మంజూరు చేశారు. ఆ తర్వాత వాటిని రద్దు చేశారు. సెలవు రోజు కూల్చివేతలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ప్రతీసారి ఇలా జరగకుండా చూసుకుంటామంటూనే మళ్లీ అదే తప్పు చేస్తున్నారు.
గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలనూ లెక్కచేయకుండా, చట్టాన్ని పాటించకుండా వ్యవహరిస్తే హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 99ను రద్దు చేస్తాం. హైడ్రా తప్పులకు ఓ రిజిస్ట్రర్ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. నిర్మాణ అనుమతి రద్దు ఉత్తర్వులను కోర్టు ముందు ఎందుకు ఉంచలేదు? సదరు పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకున్నారా? హైడ్రా తీరు ఆక్షేపణీయం.
నీటి వనరులు, రహదారులు, ప్రభుత్వ భూముల రక్షణకు మేం వ్యతిరేకం కాదు. కానీ, చర్యలు చట్టబద్ధమై ఉండాలన్నదే మా ఉద్దేశం’అని వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన స్టేటస్‌కో ఆదేశాలను పొడిగిస్తూ, తదుపరి విచారణ వరకు ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించకూడదని ఆదేశించారు. ప్రతివాదులకు వ్యక్తిగత నోటీసులతో సహా నోటీసులు జారీ చేయాలంటూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment