పదెకరాల వరకు పథకం వర్తింపజేయాలి
వాణిజ్య భూములు, భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులకు వద్దు... కౌలు రైతులకు రైతుభరోసా లేదా సబ్సిడీ, గుర్తింపు కార్డులు ఇవ్వాలి
యంత్రలక్ష్మిని పునరుద్ధరించాలి.. పోడు చేసేవారికి రైతు భరోసా ఇవ్వాలి... మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల అభిప్రాయం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతుభరోసా విధివిధానా ల రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం కదిలింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో రైతులు, కౌలురైతులు, రైతుసంఘాల నేతలు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు 70 మందికి పైగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అంతేకాక లేఖ ద్వారా కూడా అభిప్రాయాలు తెలపొచ్చని మంత్రులు ప్రకటించడంతో పలువురు రైతులు లేఖలు అందించారు. సమావేశంలో మెజారిటీగా వెల్లడైన అంశాలిలా ఉన్నాయి.
⇒ సాగుచేసే వారికే రైతుభరోసా పథకం అమలు చేయాలి. నిజమైన రైతులు ఎవరనేది వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి జాబితా రూపొందించాలి. సాగు చేయని భూములకు గతంలో రైతుబం«ధు ఇచ్చారు. ఈ విధానానికి స్వస్తి పలికితే అర్హులైన, సాగు చేసుకునే రైతులకే రైతు భరోసా అందుతుంది.
⇒ రైతుబంధు పరిమితి లేకుండా ఎంత భూమి ఉన్నా ఇచ్చారు. అలా కాకుండా పదెకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో రైతుల నుంచి వచ్చే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
⇒ సీజన్ ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో రైతుభరోసా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
⇒ బంజరు భూములు, బీడు భూములు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు. భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందింది. రైతుభరోసాలో ఈ భూములు, ఈ కేటగిరీకి చెందిన వారిని తొలగించాలి.
⇒ కౌలు రైతులకు ఉపయోగపడేలా రైతుభరోసా ఉండాలి. రైతుబం«ధు అందక, పంటనష్టం జరిగినా పరిహారం లేక.. ఇన్‌పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ఎంతో కొంతైనా రైతుభరోసా ఇవ్వాలి. లేదా సబ్సిడీపై విత్తనాలు అందించాలి. యంత్రలక్ష్మి పథకాన్ని పునరుద్ధరించి రైతులు, కౌలు రైతులకూ వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి.
⇒ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కౌలు రైతులను అధికారికంగా గుర్తించారు. 2011లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి అర్హులైన వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. గ్రామసభలు నిర్వహించి మళ్లీ కౌలు రైతులను గుర్తించాలి.
⇒ ఒకటి, రెండు ఎకరాలున్న చాలామంది రైతుల భూములు ధరణిలో నమోదు కాలేదు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వీరికి పాత పాస్ పుస్తకాలు ఉన్నా.. ధరణిలో ఎక్కకపోవడంతో కొత్తవి రాలేదు. ఈ రైతులు రైతుభరోసా పథకాన్ని కోల్పోకుండా భూములను ధరణిలో చేర్చేందుకు రైతు సదస్సులు నిర్వహించాలి.
⇒ ఒకే భూమికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు రైతుబంధు తీసుకున్నారు. వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మారినప్పుడు ఇలా జరిగింది. వీటిని నియంత్రిస్తే అర్హులైన ఎక్కువమంది రైతులకు రైతుభరోసా అందుతుంది.
⇒ విత్తన సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయాలి. గతంలో జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. పంటల బీమాను త్వరితగతిన అమలు చేయాలి.
⇒ ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు పట్టాలు పొందిన, పోడు పట్టాలు పొందకుండా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతుభరోసా వర్తింపజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment