village revenue
-
మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే ఈ నియామకాలను పూర్తిచేసి.. గతంలో రెవె న్యూ సిబ్బంది అందించిన అన్ని సేవలను మళ్లీ వారికే అప్పగించనుంది. మొత్తంగా రాష్ట్రంలోని 10,909 రెవెన్యూ గ్రామాలకు మళ్లీ రెవెన్యూ అధికారులు రానున్నారు.గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో... పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. మిగతా వారిలో తగిన విద్యార్హతలు ఉన్న వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, నియామకాలు చేపట్టనున్నారు. అయి తే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభు త్వం ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదు. ఇబ్బందులు రాకుండా ప్రణాళిక.. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రాతిపదికలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టు తెలిసింది. ఈ అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్వోలు, వీఆర్ఏలుగా నియమితులైన వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి రానున్నారు. దాదాపు మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసి.. వివిధ శాఖల్లోకి వెళ్లిన వారిలో డిగ్రీ, ఇంటర్ అర్హతలను గుర్తించి వేర్వేరుగా ఈ పరీక్ష (రెవెన్యూ సేవలే సిలబస్‌గా) నిర్వహించనున్నారు. పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. నేడు వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం పూర్వ వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం ఆదివారం శామీర్‌పేట మండలంలోని తూంకుంట గ్రామంలో జరగనుంది. తెలంగాణ వీఆర్వోల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో... గ్రూప్–4 ఉద్యోగ నియామకాల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అసోసియేషన్ అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లిన పూర్వ వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. -
వీఆర్వోలకు మేలు చేసేలా జీవోలు
సాక్షి, అమరావతి: వీఆర్వోలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం 154, 64, 6538, 166, 31 జీవోలు జారీ చేసిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (వీఆర్వో అసోసియేషన్) అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో రవీంద్రరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులలో వీఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోటా 40 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని, ఖాళీగా ఉన్న సీనియర్ సహాయకుల పోస్టులలో వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రకారం 70 శాతం పదోన్నతులను వీఆర్వోలతో భర్తీ చేయాలని కోరారు. సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్–2 వీఆర్వోల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, నాయకులు బాలాజీరెడ్డి, మౌళి భాష, లక్ష్మీనారాయణ, బాపూజీ పాల్గొన్నారు. -
పల్లెను మింగిన ‘పెద్దనోటు’
సందర్భం దేశ ఆర్ధిక వ్యవస్థలో కరెన్సీ వాటా కేవలం 10 శాతం మాత్రమే. ఇందులో 2 శాతం కరెన్సీ గ్రామాల్లోని సమాంతర ఆర్ధిక వ్యవస్థలోనే చెలామణి అవుతు న్నట్లు అంచనా. పెద్దనోట్ల రద్దు ఈ వ్యవస్థనే ఛిద్రం చేసింది. నరేంద్ర మోది చేపట్టిన ఆర్థికపరమైన సర్జికల్ దాడి నల్ల కుబేరులను కాకుండా, సగటు మనిషి ఆర్థిక వ్యవ స్థను, మహిళల వంటింటి బడ్జెట్‌ను ఒక కుదుపు కుది పింది. సాగు మడి చుట్టూ కర్షకుడు నేర్పుగా నిలబెట్టు కున్న అతి సున్నితమైన ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. రూ. 10, రూ. 20 నోటు ఖర్చుతో జీవనం చేసే రైతాంగం మీదకు బలవంతంగా పెద్ద నోట్లను ప్రయోగించారు. మార్కెట్లోకి తెచ్చిన ధాన్యానికి రూ. 500, రూ. 1,000 నోటుతోనే లెక్కలు కట్టి అంటగట్టారు. భారత ఆర్థిక వ్యవస్థలో కేవలం బ్యాంకింగ్ లావా దేవీలు మాత్రమే లేవు. కార్పోరేటు సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీల పెట్టుబడులకు, రాబడులకు వ్యూహ రచనలు చేసే పెద్ద మనుషుల ఊహలకు అందని మరో సమాంతర ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థలోనే అంతర్భాగం. ఈ ద్రవ్యనిధికి కర్త, కర్మ, క్రియ పల్లె జనం, రైతాంగమే. పెట్టు బడులు, మిగులు, షేర్ మార్కెట్ల మార్మికత తెలియని పేద జనం రెక్కల కష్టం పెట్టుబడుల మీద ఆధారపడి నడిచే ఆర్థిక వ్యవస్థ ఇది. కోట్ల మంది సంపాదన పోగేస్తే రూ. లక్షలు మాత్రమే చేతిలో ఉంటుంది. ఇదంతా బ్యాంకు రికార్డులకు అందని డబ్బు. అటక మీద పాత ఇనుపరేకు సందకలో తాత్కాలికంగా నిలువ ఉండి నిత్యం ప్రజా మార్కెట్లో తిరిగే ద్రవ్యం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పల్లెకు అల్లుకున్న బంధాలు, బంధుత్వాల మీద ఆధారపడి ఉంది. ఈS పొదరింట్లో బ్యాంకుల అవసరం బహు స్వల్పం. దేశంలో ఎక్కువ మంది సన్నకారు రైతులే. భూ కమతాలు చాలా చిన్నవి.. ఏడాది అంతా కష్టపడితే రూ. 25 నుంచి రూ. 30 వేల ఆదాయానికి మించిన దిగుబడి ఉండదు. ఈ ఆదాయం మీద ఒక్క రైతు కుటుంబం మాత్రమే కాకుండా కుమ్మరి, కమ్మరి, రజక, గీత, గొల్లకుర్మ, ముదిరాజు దళిత తదితర చేతి వృత్తుల వారికి, ఆడబిడ్డ, అల్లుడు, అయినవారు మొదలైన బంధువులు, వ్యవసాయ కూలీలు ఆధార పడి జీవనోపాధి పొందుతారు. వచ్చిన దిగుబడిలో సింహభాగం రైతు తీసుకొని మిగిలినవి ఎవరి వాటా వాళ్లకు పంచుతారు. వేలలో ఉండే ఈ మొత్తాలను దాచుకోవడానికి వారికి బ్యాంకుల అవసరం రాదు. అటక మీదున్న ఇనుపరేకు సందక సరిపోతోంది. సమ కూరిన డబ్బులో రైతు కొంత జీవనానికి వాడు కొని మరి కొంత సొమ్ము మరుసటి కారుకు పెట్టుబడిగా వినియోగిస్తే... మిగిలిన వారు వచ్చిన ఆదాయంతో కాలం గడుపుతారు. ఊర్లో ఎవరికైనా రోగమో, నొప్పో వచ్చినా మళ్లీ ఆ డబ్బే అక్కరకు వస్తుంది. ఆపద తీరుస్తుంది. ఇదంతా బ్యాంకు రికార్డులకు పన్నులు, లావాదేవీలకు దొరకని ‘లెక్క’. అంత మాత్రం చేత ఈ డబ్బును నల్లధనం అని అనగలమా? వాస్తవానికి పల్లెల్లో సజీవంగా ఉన్న ఈ విధానమే దేశ ఆర్థిక వ్యవ స్థకు పట్టుగొమ్మ. 2009–10 మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుది పేసిన సమయంలో కూడా సమాంతర ఆర్థిక వ్యవస్థే భారతదేశానికి అండగా నిలబడింది. వాస్తవానికి కరెన్సీ రద్దు అనేది ఇప్పుడే మొదటి సారి జరుగలేదు.1946, 1978 సంవత్సరాల్లో రెండు సార్లు పెద్ద నోట్లను రద్దు చేసినా ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కొద్ది శాతమే ఉన్న పెద్దనోట్లు కేవలం ధనవంతులకే పరిమితం కావటంతో సాధా రణ ప్రజలు ఇబ్బంది పడలేదు. రోజువారి జీవన కార్యాకలాపాలు సాఫీగానే సాగాయి. తాజాగా రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు సామాన్య జన జీవ నంపై పెను ప్రభావాన్ని చూపెడుతోంది. యాసంగి సాగుతో పొలం పనుల్లో బిజిబిజిగా ఉండాల్సిన గ్రామీ ణులు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు గాస్తున్నారు. రూ. 500 నోటు చేతిలో పట్టుకొని పూట బువ్వ కోసం పడిగాపులు కాస్తున్నారు. వాస్తవానికి దేశ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ వాటా కేవలం 10 శాతం మాత్రమే ఉంటే ఇందులో కనీసం 2 శాతం కరెన్సీ గ్రామీణ ప్రాంతంలో పాతుకుపోయిన సమాంతర ఆర్థిక వ్యవస్థలోనే చెలామణి అవుతున్నట్లు ఆర్థిక సర్వేలు చెప్తున్నాయి. నరేంద్రమోదీ చేసిన ఆర్థిక పరమైన సర్జికల్ స్రై్టక్ సరిగ్గా ఈ వ్యవస్థనే ఛిద్రం చేసింది. అకస్మిక పెద్ద నోట్ల నిర్ణయం రైతాంగాన్ని ఆత్మహత్యల వైపుకు పురిగొల్పుతోంది. సిద్ధిపేట జిల్లా మిర్దొడ్డి మండలం నా సొంత నియోజకవర్గం దుబ్బాకలోనే ధర్మారంలో రైతు కుటుంటాన్ని పెద్ద నోట్ల రద్దు కాటేసింది. పెండ్లికి ఎదిగిన ఆడబిడ్డ ఒకవైపు, అప్పుల కుంపటి ఇంకో వైపుతో ఇబ్బంది పడుతున్న వర్ద బాలయ్య అనే రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంకా అలాంటి మరణాలు మరిన్ని చూడక ముందే మోదీ గ్రామీణ సమాంతర ఆర్ధిక వ్యవస్థను పరిరక్షించే ప్రయత్నం చేయాలి. వ్యాసకర్త శాసనసభ అంచనా పద్దుల కమిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్రం 94403 80141 సోలిపేట రామలింగారెడ్డి -
వీఆర్ఓ ఫలితాల్లో పురుషుల హవా
గ్రామ రెవెన్యూ అధికారి పరీక్ష ఫలితాల్లో పురుషుల హవా కనిపించింది. ఫస్ట్ ర్యాంకు మొదలు వరుసగా 28వ ర్యాంకు వరకు పురుషులే ఉన్నారు. కుల్కచర్ల మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మర్పల్లి వెంకటరమణారెడ్డి 95మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించగా, యాచారం మండలం గడ్డమల్లయ్యగూడకు చెందిన గౌర కృష్ణ 4వ ర్యాంకు, ఆయనతో కలిసి పదోతరగతి చదివిన గునుగల్ గ్రామానికి చెందిన పి.సంధ్యారాణి 29వ ర్యాంకు, చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన బాలకృష్ణ 5వ ర్యాంకు, అలాగే గండేడ్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన బోయినివికాంత్ 8వ రర్యాంకు సాధించారు. గ్రూప్ వన్ ఉద్యోగం సాధిస్తా ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన నేను 2011 సంవత్సరం నుంచి ఎస్సై, తదితర పోటీ పరీక్షలకు సొంతంగా మెటీరియల్ తయారుచేసుకొని ప్రిపేర్ అవుతున్నాను. వీఆర్ఓ పరీక్షలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది. గ్రూప్ వన్ ఉద్యోగం కోసం పట్టుదలగా చదువుతున్నా, తప్పకుండా దాన్ని సాధిస్తా. కష్టానికి ఫలితం దక్కింది చిన్నపటినుండి కష్టపడి చదివిన చదువుకు ఫలితం దక్కింది. ఎన్నో ఒడిదొడుకుల మధ్య చదువుకుంటూ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రయత్నించాను. తాతయ్య నన్ను బాగా ప్రోత్సహించారు. వీఆర్ఓ పరీక్షలో 93మార్కులతో జిల్లాలో 8ర్యాంకు వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవచేసే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను. అమ్మానాన్నల కల కూడా నెరవేరింది. - బోయిని రవికాంత్, చౌదర్పల్లి, గండేడ్ మండలం ఐఏఎస్ సాధించడమే లక్ష్యం అమ్మానాన్న బౌరమ్మ, యాదయ్యలు వ్యవసాయ కూలీలు. కష్టపడి మమ్మల్ని చదివించారు. అన్న నర్సింహకు కొద్ది నెలల క్రితమే రైల్వేలో ఉద్యోగం వచ్చింది. మా పెదనాన్న కొడుకు వెంకటేష్ ప్రస్తుతం ఎస్సైగా మహబూబ్‌నగర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇద్దరు అన్నల స్ఫూర్తితో కష్టపడి వీఆర్ఓ పరీక్షకు ప్రిపేరయ్యాను. జిల్లాలో నాల్గో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. వచ్చిన ఉద్యోగం చేస్తూనే భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. - గౌర కృష్ణ, గడ్డమల్లయ్యగూడ, యాచారం మండలం ఐఏఎస్ తప్పకుండా సాధిస్తా వీఆర్ఓ ఫలితాల్లో జిల్లాలో నాకు 29వ ర్యాంకు వచ్చిందని స్నేహితుల ద్వారా తెలిసి సంతోషం కలిగింది. నా విజయం వెనుక తల్లిదండ్రులు యాదమ్మ, భిక్షపతిగౌడ్ల కృషి ఎంతైనా ఉంది. వీఆర్ఓగా పనిచేస్తూనే అమ్మానాన్నల ఆశయం మేరకు ఐఏఎస్‌ను తప్పకుండా సాధిస్తా - పి. సంధ్యారాణి, గునుగల్, యాచారం మండలం -
రూ.5 కోట్ల భూమి హాంఫట్
డక్కిలి, న్యూస్‌లైన్ : భుక్తి కోసం పేదోడు ఓ ఎకరం ఆక్రమించి రెక్కల కష్టంతో సాగు చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద ఆ భూమిని లాగేసుకుంటారు. ఎకరం భూమి కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటామని ఎందరో అభాగ్యులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరు. కానీ.. అధికారం, పలుకుబడి, ధనబలం ఉన్న వారు ఎన్నెన్ని ఎకరాలు ఆక్రమించినా రెవెన్యూ అధికారులు ధృతరాష్ట్రుల్లా వ్యవహరిస్తుంటారు. ఆ పెద్దలకు ఏకంగా తమ అండదండలు ఇచ్చి ఆక్రమించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మండలంలోని వెలికల్లులో ఇటువంటి ఉదంతమే ఒకటి వెలుగుచూసింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీకి చెందిన పలువురు నాయకులు కలిసి సుమారు రూ.5కోట్లు విలువ చేసే 137 ఎకరాలను దర్జాగా కబ్జా చేసిసాగు చేసుకుంటున్నారు. మండలంలోని వెలికల్లు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 210-2లో 137 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి తెలుగుగంగ కాలువ కింద భాగంలో ఉండటంతో ప్రస్తుత మార్కెట్ విలువ అంచనా ప్రకారం రూ.5 కోట్లు చేస్తుందని అంచనా. ఈ భూమి మీద కన్నేసిన కమ్మపల్లి, వడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్కొక్కరు 10 పేర్లతో భూములను ఆక్రమించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు కూడా భారీగానే ముడుపులు అందజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూములకు పట్టాలు పొందేందుకు గ్రామ పంచాయతీ తీర్మానం కోసం ఆ నాయకులు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. అయితే సెంటు భూమి లేని వెలికల్లుకు చెందిన పేదలు చాలా మంది ఉన్నారు. వీరంతా తమకు భూములు ఇస్తే సాగు చేసుకుంటామని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించని రెవెన్యూ అధికారులు కొందరు పెద్దలు ఎకరాలకు ఎకరాలు ఆక్రమించినా చూసీచూడనట్లు వ్యవహరించడంపై ఆరోపణలున్నాయి. మండలంలోని సంగనపల్లిలో ఇటీవల వందలాది ఎకరాలు భూములు కబ్జాకు గురైన విషయం వెలుగుచూసినా.. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. బోర్డులు ఏర్పాటు చేస్తాం : చెంచుకృష్ణమ్మ, తహశీల్దార్ ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా చూస్తు ఊరుకోం. ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం. వెలికల్లు రెవెన్యూ గ్రామంలో భూములు ఆక్రమణకు గురైన విషయం ఇటీవలే నా దృష్టికి కూడా వచ్చింది. ఈ భూముల్లో ఎవరూ ప్రవేశించకుండా బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నాణ్యత గాలికి.