డక్కిలి, న్యూస్‌లైన్ : భుక్తి కోసం పేదోడు ఓ ఎకరం ఆక్రమించి రెక్కల కష్టంతో సాగు చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద ఆ భూమిని లాగేసుకుంటారు. ఎకరం భూమి కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటామని ఎందరో అభాగ్యులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరు. కానీ.. అధికారం, పలుకుబడి, ధనబలం ఉన్న వారు ఎన్నెన్ని ఎకరాలు ఆక్రమించినా రెవెన్యూ అధికారులు ధృతరాష్ట్రుల్లా వ్యవహరిస్తుంటారు. ఆ పెద్దలకు ఏకంగా తమ అండదండలు ఇచ్చి ఆక్రమించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మండలంలోని వెలికల్లులో ఇటువంటి ఉదంతమే ఒకటి వెలుగుచూసింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీకి చెందిన పలువురు నాయకులు కలిసి సుమారు రూ.5కోట్లు విలువ చేసే 137 ఎకరాలను దర్జాగా కబ్జా చేసిసాగు చేసుకుంటున్నారు.
మండలంలోని వెలికల్లు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 210-2లో 137 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి తెలుగుగంగ కాలువ కింద భాగంలో ఉండటంతో ప్రస్తుత మార్కెట్ విలువ అంచనా ప్రకారం రూ.5 కోట్లు చేస్తుందని అంచనా. ఈ భూమి మీద కన్నేసిన కమ్మపల్లి, వడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్కొక్కరు 10 పేర్లతో భూములను ఆక్రమించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు కూడా భారీగానే ముడుపులు అందజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూములకు పట్టాలు పొందేందుకు గ్రామ పంచాయతీ తీర్మానం కోసం ఆ నాయకులు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే సెంటు భూమి లేని వెలికల్లుకు చెందిన పేదలు చాలా మంది ఉన్నారు. వీరంతా తమకు భూములు ఇస్తే సాగు చేసుకుంటామని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించని రెవెన్యూ అధికారులు కొందరు పెద్దలు ఎకరాలకు ఎకరాలు ఆక్రమించినా చూసీచూడనట్లు వ్యవహరించడంపై ఆరోపణలున్నాయి. మండలంలోని సంగనపల్లిలో ఇటీవల వందలాది ఎకరాలు భూములు కబ్జాకు గురైన విషయం వెలుగుచూసినా.. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది.
బోర్డులు ఏర్పాటు చేస్తాం : చెంచుకృష్ణమ్మ, తహశీల్దార్
ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా చూస్తు ఊరుకోం. ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం. వెలికల్లు రెవెన్యూ గ్రామంలో భూములు ఆక్రమణకు గురైన విషయం ఇటీవలే నా దృష్టికి కూడా వచ్చింది. ఈ భూముల్లో ఎవరూ ప్రవేశించకుండా బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నాణ్యత గాలికి.
రూ.5 కోట్ల భూమి హాంఫట్
Published Wed, Nov 20 2013 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement