సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ఎన్నుకునే తిరుగులేని ఆయుధం ఓటు. సామాన్యుడి చేతిలో అదో పాశుపతాస్త్రం. ఇంత ముఖ్యమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో మన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోవడం ఎప్పుడో మరిచిపోయిన రెవెన్యూ అధికారులు జనాభాలో ఏకంగా 70 శాతం మందిని ఓటర్లుగా తేల్చారు.
శాస్త్రీయత ప్రకారం జనాభాలో 67 శాతం వరకు మాత్రమే ఓటర్లు ఉండాలి. మెట్రో నగరాల్లో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉండొ చ్చు. గ్రామీణ ప్రాంతమే ఎక్కువగా ఉన్న జిల్లాలో ఓటర్ల శాతం జనాభాలో 70 శాతం మించిపోవడం రెవెన్యూ అధికారుల పనితీరుపై విమర్శలకు తావిస్తోంది. ఒక్క కోరుట్ల నియోజకవర్గంలో మినహా మిగతా 12 స్థానాల్లో ఉండాల్సినదానికంటే ఎక్కువ శాతం ఓటర్లు ఉండడంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది 71 శాతం నుంచి 77 శాతం వరకు ఉంది. ఇంకా చాలా మంది అర్హులకు ఓటు హక్కు లేదు. 18 ఏళ్లు నిండినవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పేర్లు ఓటర్ల జాబితాలోకి ఎక్కలేదు. ఇలాంటివారి పేర్లు చేరితే ఓటర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఇది ఇలాగే ఉంటే వచ్చే సాధారణ ఎన్నికల సమయంలో జిల్లా జనాభా, ఓటర్ల సంఖ్య సమానంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 38 లక్షల 88వేల 674. దీంట్లో 67 శాతం మంది మాత్రమే ఓటర్లుగా ఉండాలి.
జిల్లాలో మాత్రం ఇది 70 శాతం ఉంది. అక్టోబరు 5న రూపొందించిన నివేదిక ప్రకారం జిల్లాలోని ఓటర్ల సంఖ్య 27 లక్షల 21వేల 184. ఆగస్టులో ఓటర్ల శాతం 71గా ఉండగా... అధికారులు ఎన్నో కసరత్తులు చేసి చివరకు ఒక శాతం తగ్గించగలిగారు. కానీ, మరో మూడు శాతం అధికంగా ఉండడానికి కారణాలేంటనేది తెలియడం లేదు. కరీంనగర్ నియోజకవర్గంలో అయితే జనాభాలో ఏకంగా 77 శాతం మంది ఓటర్లే. తప్పులు లేని జాబితా లక్ష్యంగా సిస్టమెటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్‌రోల్‌మెంట్(స్వీప్) - 2014 పేరిట భారత ఎన్నికల కమిషన్ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.
జూన్‌లో సేకరించిన సమాచారం ప్రకారం జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కలిపి 9 లక్షల 93 వేల 383 ఓటర్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి ఇలాంటి వారిని గుర్తించి ఒకే దగ్గర ఓటు ఉండేలా చేస్తే కనీసం 1.50 లక్షల నుంచి 2 లక్షల బోగస్ ఓట్లను గుర్తించి తొలగించవచ్చు. ఇలాంటి ఓట్లను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులు... తర్వాత పట్టించుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో తప్పుల సవరణ జరగడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మెరుగైన ఓటరు జాబితా రూపకల్పన ఇప్పట్లో అయ్యే పనిగా కనిపించడం లేదని రెవెన్యూ వర్గాల్లోనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తప్పుల కుప్ప
Published Wed, Oct 16 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement