
ముత్తారం(మంథని): గ్రామీణ ప్రాంతంలోని కూలీల వలసలను అరికట్టడం కోసం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిర్వీర్యం అవుతోంది. ఈ పథకం ద్వారా చేపట్టిన అభివద్ధి పనుల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలను నియంత్రించడం కోసం నిర్వహిస్తున్న సామాజిక తనిఖీలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి విధించిన రికవరీలు అధికారుల రికార్డులకే పరిమితం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి జిల్లాలోని 11 మండలాల్లో ఇప్పటి వరకు 10 విడతలు సామాజిక తనిఖీ నిర్వహించారు. వివిధ విడతలుగా నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అరకొరగా విధించిన రికవరీలను ఇప్పటి వరకు సంబధిత అధికారులు పూర్తి స్థాయిలో వసూలు చేయలేకపోయారనే విమర్శలు వినపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు సామాజిక తనిఖీల్లో విధించిన రికవరీల నుంచి0 రూ.1,17,57,621లు మాత్రమే రికవరీ చేశారు.
సామాజిక తనిఖీల్లో విధించిన రికవరీల్లో ఇంకా మిగిలిన 28.87 శాతానికి గాను రూ.47,71,222లు రికవరీ చేయాల్సి ఉంది. అయితే జిల్లాలోని ముత్తారం మండలంలో అత్యధికంగా 87.97శాతం రికవరీ చేయగా జిల్లా కేంద్రమైన పెద్దపల్లి మండలంలో అత్యల్పంగా 47.26శాతం మాత్రమే సంబంధిత అధికారులు రికవరీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. అక్రమాలకు పాల్పడిని సిబ్బంది నుంచి విధించిన రికవరీల డబ్బులను నెలనెలా కొంత డబ్బులు వేతనాల నుంచి రికవరీ చేస్తామని ప్రకటించిన అధికారులు అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమాలకు సంబధించిన రికవరీలు అధికారుల రికార్డులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.. తప్ప కార్యరూపం దాల్చడం లేదని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన డీఆర్‌డీఏ ప్రేమ్‌కుమార్‌ను సాక్షి వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment