జిల్లాలో బోగస్ కార్డుల ఏరివేత మొదలైంది. రేషన్ కార్డులను ఆధార్‌తో మెలికపెట్టి బోగస్ చిట్టాను సిద్ధం చేస్తున్న సర్కారు.. ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ వీటిని ఏరివేసే పని పెట్టుకుంది. మంగళవారం నాటికి జిల్లావ్యాప్తంగా 6,905 బోగస్ కార్డులను రద్దు చేశారు. వీటిని రేషన్ డీలర్లు స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో 49,547 యూనిట్లు తొలిగిపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు.
- సాక్షి ప్రతినిధి, కరీంనగర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఇటీవలే అన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు తమ పరిధిలో ఉన్న బోగస్ కార్డులను వెంటనే సరెండర్ చేయాలని రేషన్ డీలర్లను అప్రమత్తం చేశారు. లేకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు డబుల్ కార్డులు ఉన్న కుటుంబాలు తమంతట తాముగా అదనంగా ఉన్న కార్డును సరెండర్ చేయాలని సూచించించారు. తమ కుటుంబాల్లో మృతి చెందినవారు, వలస వెళ్లిన వారుంటే కార్డుల్లో వారి పేర్లను తొలగించుకోవాలని చెప్పారు. మీ-సేవ లేదా ఈ-సేవ కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రచారం చేశారు. లేకుంటే అసలు కార్డుకు ఎసరు వస్తుందని.. భవిష్యత్తులో అసలు కార్డును కూడా రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో రేషన్ డీలర్లలో కదలిక వచ్చింది. జిల్లాలోనే అత్యధికంగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌లో గత పది రోజుల్లో 2,502 కార్డులను సరెండర్ చేశారు. అదే వరుసలో కరీంనగర్ డివిజన్‌లో 1,598, సిరిసిల్ల డివిజన్‌లో 1,115, మంథనిలో 923, జగిత్యాలలో 767 బోగస్ కార్డులు అధికారులకు అప్పగించారు.
కొత్త సర్కారు ఆదేశాల మేరకు పది రోజులుగా జిల్లా యంత్రాంగం కార్డుల ఏరివేతను ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. పౌరసరఫరాల విభాగానికి మన జిల్లాకు చెందిన మంత్రి ఈటెల రాజేందర్ సారథ్యం వహిస్తుండటంతో బోగస్ ఏరివేతపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏ రోజుకారోజు మండలాల వారీగా ఎవరెన్ని కార్డులు అప్పగించారు... వాటిలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి.. ఎన్ని యూనిట్లు తొలిగిపోయాయి.. అని పక్కాగా సమాచారం సేకరిస్తోంది. దీంతో మండల స్థాయిలోనూ అధికారులు బోగస్ ఏరివేతకు రేషన్ డీలర్లపై ఒత్తిడి పెంచారు.
బోగస్.. ఇదిగో..!
Published Wed, Jul 16 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement
Advertisement