రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పచ్చతోరణం అమలు కాకుండానే వాడిపోయింది. మూలన పడిన ఎన్నో పథకాల జాబితాలో పచ్చతోరణం కూడా చేరిపోయింది. సెంటు భూమి కూడా లేని ఉపాధి కూలీలకు భూమిని కల్పించి అందులో పండ్ల తోటల పెంపకానికి నిర్దేశించిన పథకం అధికారుల నిర్లక్ష్యం.. మొక్కల పంపిణీలో అలసత్వం ఈ పథకాన్ని మూలనపడేశాయి. పనికిరాని భూములు, లబ్ధిదారుల ఎంపికలో లోపాలు ఈ పథకాన్ని నీరుగార్చుతున్నాయి. 4 వేల ఎకరాలు లక్ష్యం కాగా 4 ఎకరాల్లో మాత్రమే మొక్కలు నాటారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దగదర్తి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇందిరమ్మ పచ్చతోరణం పథకం పూర్తిగా అటకెక్కింది. నిబంధనలు, అధికారుల నిర్లిప్తత ఈ పథకాన్ని నీరుగారుస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో కనీసం పది రోజులైనా పనిచేసి, సెంటు భూమిలేని దళిత, గిరిజన నిరుపేదలు పథకానికి లబ్ధిదారులుగా నిర్ణయించారు. ఈ పథకానికి చెరువు గట్లు, అడవి పోరంబోకు, రోడ్డుకిరువైపులా ఉన్న భూములను ఎంపికచేశారు. అన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు సర్వేచేశారు. ఐదువేలకు పైగా ఎకరాలు పథకం అమలుకు అనువుగా ఉన్నాయని గుర్తించారు. ఒక్కో లబ్ధిదారుడికి భూమితోపాటు ఐదేళ్లకుగాను రూ.5 లక్షల వరకు నగదును విడతలవారీగా ఇస్తారు. ఒక రైతుకు గరిష్టంగా 100 మొక్కలు నాటేందుకు సరిపడా భూమి ఇస్తారు. మామిడి మొక్కలు నాటాలనుకుంటే 1.4 ఎకరాలు, జామ మొక్కలకు 90 సెంట్లు, సపోటాకు 1.6 ఎకరాలు, నేరేడుకు 2.5ఎకరాలు, సీతాఫలం 40 సెంట్లు, చింతకాయ మొక్కలకు రెండున్నర ఎకరాల చొప్పున పొలం ఇస్తారు. రోడ్డు పక్కన అయితే ఆయా పంటలన్నింటికీ అర కిలోమీటరు
పొడవున భూమి ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొక్కలను లబ్ధిదారులతో నాటిస్తారు. వాటి సస్యరక్షణ ఖర్చులూ ఇస్తారు. ఫలసాయం లబ్ధిదారులకే చెందుతుంది. భూములపై మాత్రం హక్కు ఉండ దు.
జిల్లాలో లబ్ధిదారుల వివరాలు..
పథకానికి సంబంధించి అధికారులు అల్లూరులో 9 మందిని, అనంతసాగరం 26, ఏఎస్‌పేట 10, ఆత్మకూరు 44, బాలాయపల్లి 42, బోగోలు 14, బుచ్చిరెడ్డిపాళెం 5, చేజర్ల 9, చిల్లకూరు 32, చిట్టమూరు 40, దగదర్తి 41, డక్కిలి 21, దొరవారిసత్రం 25, దుత్తలూరు 47, గూడూరు 21, ఇందుకూరుపేట 1, జలదంకి 33, కలిగిరి 8, కలువాయి 50, కావలి12, కొడవలూరు 34, కొండాపురం 12, కోట 2, మనుబోలు 44, మర్రిపాడు 22, ముత్తుకూరు 4, నాయుడుపేట 31, నెల్లూరు 77, ఓజిలి 27, పెళ్ళకూరు 15, పొదలకూరు 39, రాపూరు 73, సంగం 26, సీతారామపురం 26, సూళ్ళురుపేట 38, సైదాపురం 15, తడ 14, టీపీ గూడూరు 5, ఉదయగిరి 18, వాకాడు 15, వరికుంటపాడు 5, వెంకటగిరి 56, విడవలూరు 2, వింజమూరులో 30 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఇప్పటికీ వీరికి మొక్కలు పంపిణీచేయలేదు. పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
అమలు తీరు అధ్వానం
జిల్లాలో ఈ పథకం పూర్తిగా అటకెక్కింది. చదరంగా ఉన్న ప్రదేశాల్లో 2,679 ఎకరాలు, రోడ్డుకి రువైపులా 2,641 కిలోమీటర్ల దూరం పరిధిలో 1320 ఎకరాలు మొత్తం కలిపి 3,999 ఎకరాలు మాత్రమే మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్నట్లు ఉపాధి సిబ్బంది తేల్చారు. 1,144 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఇప్పటివరకు ఒక్క కలిగిరి మండలంలోనే కేవలం ముగ్గురు రైతులే పథకాన్ని వినియోగించుకోగలిగారు. 300 మొక్కలను మాత్రమే నాటారు. కిలోమీటర్ల దూరంతోపాటు సాగుకు అనుకూలంగా ఉండని రోడ్డుకిరువైపులా భూములు, అడవి పోరంబోకు, చెరువుల్లోని భూములను మొక్కల పెంపకానికి చూపిస్తుండటంతో లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదు. ఉపాధి పథకంలో పనిచేసినవారే లబ్ధిదారులనే నిబంధన ఉండటం కూడా అడ్డంకిగా మారింది. దీనివల్ల నిరుపేదలకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు ఉపాధి కూలీల ఎంపికే జరగలేదు. అక్కడి వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొక్కలు ఇవ్వలేదు: తాటిచెట్ల ప్రభావతమ్మ, లబ్ధిదారురాలు, దగదర్తి
మొక్కలు నాటేందుకు ఇప్పటివరకు భూములను ఇవ్వలేదు. మొక్కలూ పంపిణీచేయలేదు. దగదర్తి చెరువులోని పోరంబోకు స్థలాన్ని చూపుతున్నారు. ఇది దేనికీ ఉపయోగపడదు. వర్షాలకు చెరువులో నీరు చేరి మొక్కలు నాటేందుకు అనుకూలంగా లేదు.
15 రోజుల్లో పనులు: గౌతమి, ప్రాజెక్ట్ డెరైక్టర్, డ్వామా, నెల్లూరు
ప్రస్తుతం కలిగిరి మండలంలో మొక్కలు నాటారు. ఆత్మకూరు, ఏఎస్‌పేట మండలాలకు పదివేల మొక్కలు పంపుతున్నాం. సీజన్ మొదలైంది. 15 రోజుల్లోగా అన్ని మండలాల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నాం.
వాడిన పచ్చతోరణం
Published Fri, Nov 8 2013 3:36 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement